Petrol diesel price : బ్రేకింగ్ న్యూస్! పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు- తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఇలా..
Petrol diesel price hike : ఊహించినదే జరిగింది! దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతున్నట్టు చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రకటించాయి. లీటరు పెట్రోల్, లీటరు డీజిల్‌పై ధరలు రూ. 3 మేర పెరిగాయి.
Petrol diesel price increase : దేశవ్యాప్తంగా వాహనదారులు ఊహించినదే జరిగింది! పశ్చిమాసియాలో యుద్ధంతో నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతున్నట్టు చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రకటించాయి! ఫలితంగా శుక్రవారం నుంచే అమల్లోకి వచ్చేలా లీటరు పెట్రోల్, లీటరు డీజిల్‌పై రూ. 3 మేర భారాన్ని మోపాయి.
ఇంధన వినియోగాన్ని తగ్గించుకోవాలని, ఇంటి నుంచే పని (వర్క్ ఫ్రమ్ హోమ్) చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చిన కొద్ది రోజుల్లోనే ఈ పెంపు చోటుచేసుకోవడం గమనార్హం.
మెట్రో నగరాల్లో తాజా ధరలు..
స్థానిక పన్నులు, లెవీల కారణంగా ఒక్కో రాష్ట్రంలో ధరలు ఒక్కోలా ఉంటాయి. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి:
దిల్లీ: పెట్రోల్ ధర రూ. 94.77 నుంచి రూ. 97.77 కి చేరింది. డీజిల్ రూ. 89.67 నుంచి రూ. 90.67 కి పెరిగింది.
ముంబై: పెట్రోల్ లీటరుపై రూ. 3.14 పెరిగి రూ. 106.68 కి చేరుకుంది.
కోల్‌కతా: గరిష్టంగా రూ. 3.29 పెరగడంతో పెట్రోల్ ధర రూ. 108.74 కి చేరింది.
చెన్నై: రూ. 2.83 పెంపుతో పెట్రోల్ ధర రూ. 103.67 వద్ద ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..
ఇక దేశంలోనే అత్యధిక ఇంధన ధరలు కలిగిన రాష్ట్రాల జాబితాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు టాప్‌లో ఉన్నాయనే చెప్పుకోవాలి.
తాజా పెంపు అనంతరం హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ. 110.89కి చేరింది. లీటరు డీజిల్ ధర రూ. 98.96గా ఉంది.
వరంగల్‌లో లీటరు పెట్రోల్ ధర రూ. 110.53గాను, లీటరు డీజిల్ ధర రూ. 98.65గాను ఉన్నాయి.
ఇక ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో లీటరు పెట్రోల్ ధర రూ. 113.03గాను, లీటరు డీజిల్ ధర 100.71గాను ఉన్నాయి.
విశాఖపట్నంలో లీటరు పెట్రోల్ ధర రూ. 111.74గాను, లీటరు డీజిల్ ధర రూ. 99.47గాను ఉన్నాయి.
సీఎన్జీ ధరలు కూడా..
సామాన్యుడికి శుక్రవారం ఉదయం షాక్ మీద షాక్ తగిలింది! పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు సీఎన్జీ ధరలను సైతం చమురు మార్కెటింగ్ సంస్థలు పెంతాయి. దేశ రాజధాని దిల్లీలో సీఎన్జీ ధర రూ. 2 పెరిగింది. ఫలితంగా ఇప్పుడు అక్కడ కేజీ సీఎన్జీ ధర రూ. 77.59గాను, ముంబైలో రూ. 82.27గాను, హైదరాబాద్‌లో రూ. 97గాను ఉంది.
నాలుగేళ్ల స్తబ్ధతకు తెర..
ప్రభుత్వ రంగ చమురు సంస్థలు దాదాపు నాలుగేళ్ల తర్వాత ఇంధన ధరలను సవరించడం ఇదే తొలిసారి. 2022 ఏప్రిల్ నుంచి ధరల్లో పెద్దగా మార్పులు లేవు. కేవలం 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు మార్చి నెలలో మాత్రం పెట్రోల్, డీజిల్‌పై రూ. 2 తగ్గించారు. అయితే, ఇప్పుడు అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో పెంపు తప్పనిసరి అయింది.
ధరలు ఎందుకు పెరిగాయి?
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం, హర్ముజ్ జలసంధి వద్ద నెలకొన్న దిగ్బంధం వల్ల అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు ఆకాశాన్నంటాయి. పెట్రోలియం ఉత్పత్తుల ధరల సవరణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ఈ వారంలోనే సూచనప్రాయంగా తెలిపారు.
5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో చమురు కంపెనీలు గత 11 వారాలుగా ధరలను స్థిరంగా ఉంచినప్పటికీ, ముడిచమురు కొనుగోలు ఖర్చులు పెరగడంతో భారీ నష్టాలను చవిచూస్తున్నాయని పీటీఐ వెల్లడించింది. కార్యకలాపాలు ఆర్థికంగా భారంగా మారడంతో, ఆ భారాన్ని ప్రజలపై పాక్షికంగా వేయక తప్పలేదని కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


