PM Modi : ‘మా నాన్నకి షుగర్ తగ్గించమని చెప్పండి మోదీజీ’.. యువకుడి రిక్వెస్ట్! స్పందించిన ప్రధాని
Yuvraj Dua viral video : తమ మాట వినని తండ్రికి ప్రధాని మోదీ ద్వారా ఆరోగ్య సూత్రాలు చెప్పించాలని ఓ యువకుడు చేసిన ప్రయత్నం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై స్వయంగా స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఆ తండ్రికి ( దేశ ప్రజలందరికీ) పంచదార వాడకం తగ్గించాలని విజ్ఞప్తి చేస్తూ ఒక స్పెషల్ మెసేజ్ ఇచ్చారు.
సోషల్ మీడియాలో విభిన్నమైన కంటెంట్‌తో ఆకట్టుకునే యువరాజ్ దువా అనే ఇన్‌ఫ్లుయెన్సర్ చేసిన ఒక వినూత్న విన్నపం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 'షుగర్ కమ్ కర్వా దో పాపా కీ' (మా నాన్నగారికి పంచదార వాడకం తగ్గించమని చెప్పండి) అనే క్యాప్షన్‌తో ఆయన ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే అభ్యర్థించారు! ఈ మేరకు ఆయన పోస్ట్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ రీల్ ప్రధాని మోదీ దృష్టిని సైతం ఆకర్షించింది.

ప్రధానికి వెరైటీ రిక్వెస్ట్!
ఈ వీడియోలో యువరాజ్ దువా చాలా భిన్నంగా ఒక విషయాన్ని వివరించారు. తన తండ్రి ప్రధాని మోదీకి వీరాభిమాని అని, ప్రధాని చెప్పే ప్రతి మాటను ఆయన ఒక "ఆదేశం"లా భావిస్తారని యువరాజ్ పేర్కొన్నారు. "ఇంట్లో వాళ్లం ఎంత మొత్తుకున్నా నాన్నగారు పంచదార తగ్గించడం లేదు. అదే మోదీ ఒక్క మాట చెబితే, నాన్నగారు తప్పకుండా ఆరోగ్యకరమైన అలవాట్లను పాటిస్తారు," అని ఆయన విన్నవించారు.
భారతీయ తండ్రుల ప్రేమ జాబితాలో కుటుంబ సభ్యులు రెండవ స్థానంలో ఉంటే, మోదీ మొదటి స్థానంలో ఉంటారని ఆయన వ్యాఖ్యానించారు.
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోని ఇక్కడ చూడండి :
ప్రధాని మోదీ స్పందన..
యువరాజ్ చమత్కారానికి ముగ్ధుడైన ప్రధాని మోదీ, ఆ వీడియోను తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో రీ-షేర్ చేశారు. యువరాజ్ అభ్యర్థనపై స్పందిస్తూ.. "యువరాజ్ కోరిక మేరకు, నేను తన తండ్రిని ( ఇంకా మిగతా అందరినీ) పంచదార వాడకాన్ని తగ్గించాలని కోరుతున్నాను. ఆరోగ్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి," అని రాశారు.
ముందస్తు ఆరోగ్య జాగ్రత్తలపై ప్రధాని సూచనలు:
మరో పోస్ట్‌లో ఆరోగ్య సంరక్షణ గురించి ప్రధాని ప్రస్తావించారు:
ఊబకాయం ముప్పు: "అధికంగా పంచదార తీసుకోవడం వల్ల అనేక వ్యాధులు దరిచేరుతాయి. ముఖ్యంగా ఊబకాయం ముప్పు పొంచి ఉంటుంది," అని హెచ్చరించారు.
యోగా ప్రాముఖ్యత: పౌరులందరూ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంతో పాటు 'యోగా'ను తమ జీవితంలో భాగంగా చేసుకోవాలని, ఫిట్‌గా ఉండటానికి అది అద్భుతమైన మార్గమని సూచించారు.
నెటిజన్ల రియాక్షన్..
ప్రధాని తన వీడియోను షేర్ చేయడంతో యువరాజ్ ఆశ్చర్యానికి గురయ్యారు. "ఇది అసలు ఊహించలేదు.. నా వీడియో ఎక్కడికి చేరుకుందో చూడండి, ఇదంతా ఒక కలలా ఉంది," అని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
నెటిజన్లు కూడా దీనిపై ఆసక్తికరంగా స్పందిస్తున్నారు.
"మీ నాన్నగారికి మోదీ క్లియరెన్స్ ఇచ్చేశారు.. ఇక ఆయన చాలా గర్వపడతారు", "మీ రీల్‌కు ఏకంగా గవర్నమెంట్ అప్రూవల్ లభించింది," అంటూ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.
“దీనిని మనం జోక్‌గా చూస్తుంటాము. కానీ మోదీజీకి ముందు దేశం ఎలా ఉండేదో మన తల్లిదండ్రులకు, వారి తల్లిదండ్రులకు మాత్రమే తెలుసు. దేశాభివృద్ధిలో మోదీ తెచ్చిన మార్పులు మన యువతకు తెలియదు,” అని ఇంకొకరు అభిప్రాయపడ్డారు.
మోదీ చెప్పేంత వరకు ఎదురుచూడకుండా.. పంచదార వినియోగాన్ని తగ్గించడానికి ఇక్కడ కొన్ని ప్రాక్టికల్ చిట్కాలు ఉన్నాయి:
1. తీపి పానీయాలకు స్వస్తి చెప్పండి
మనం తీసుకునే అదనపు పంచదారలో అధిక భాగం పానీయాల నుంచే వస్తుంది.
సోడాలు, ఎనర్జీ డ్రింక్స్: వీటిలో విపరీతమైన చక్కెర ఉంటుంది. వీటి స్థానంలో నిమ్మరసం లేదా కొబ్బరినీళ్లు తీసుకోండి.
కాఫీ, టీ: అలవాటు ప్రకారం వేసుకునే పంచదార పరిమాణాన్ని రోజురోజుకూ తగ్గిస్తూ రండి. వీలైతే పంచదార లేకుండా తాగడం అలవాటు చేసుకోండి.
2. 'దాగి ఉన్న' చక్కెరను గుర్తించండి
చాలా ప్యాక్ చేసిన ఆహార పదార్థాల్లో మనకు తెలియకుండానే చక్కెర ఉంటుంది.
సూప్‌లు, బ్రెడ్, సాస్‌లు, సలాడ్ డ్రెస్సింగ్స్‌లో చక్కెర ఎక్కువగా ఉంటుంది.
ప్యాకెట్ వెనుక ఉండే కంటెంట్ లిస్ట్‌లో Sucrose, High Fructose Corn Syrup, Dextrose, Maltose అని ఉంటే అది చక్కెర అని అర్థం.
3. సహజసిద్ధమైన తీపిని ఎంచుకోండి
తీపి తినాలనిపించినప్పుడు ప్రాసెస్ చేసిన స్వీట్లకు బదులు ప్రకృతి సిద్ధమైన వాటిని ఎంచుకోండి.
తాజా పండ్లు: పండ్లలో ఉండే ఫైబర్ వల్ల చక్కెర నెమ్మదిగా రక్తంలోకి చేరుతుంది.
డ్రై ఫ్రూట్స్: ఖర్జూరం లేదా కిస్మిస్ వంటివి తక్కువ పరిమాణంలో తీసుకోవచ్చు.
4. ప్రోటీన్, హెల్తీ ఫ్యాట్స్ పెంచండి
ఆహారంలో ప్రోటీన్ (పప్పు ధాన్యాలు, గుడ్లు, పనీర్), ఆరోగ్యకరమైన కొవ్వులు (బాదం, వాల్‌నట్స్) ఎక్కువగా ఉంటే ఆకలి త్వరగా వేయదు. దీనివల్ల మధ్యమధ్యలో స్వీట్లు లేదా జంక్ ఫుడ్ తినాలనే కోరిక తగ్గుతుంది.
5. తగినంత నిద్ర, ఒత్తిడి తగ్గింపు
నిద్ర సరిగ్గా లేకపోయినా లేదా ఎక్కువ ఒత్తిడికి గురైనా మన శరీరం తక్షణ శక్తి కోసం చక్కెరను కోరుకుంటుంది. రోజుకు 7-8 గంటల నిద్ర, ప్రధాని మోదీ సూచించినట్లుగా యోగా లేదా ధ్యానం చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉండి, ఆహారపు అలవాట్లపై నియంత్రణ పెరుగుతుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


