ఈపీఎఫ్ఓ చందాదారులకు గుడ్‌న్యూస్: రూ. 15 వేల ప్రోత్సాహకం సాధించండిలా
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'పీఎం వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన' ద్వారా కొత్తగా ఉద్యోగంలో చేరిన ఉద్యోగులు రూ.15,000 వరకు ప్రోత్సాహకాన్ని పొందే అవకాశం లభిస్తోంది. రెండు విడతల్లో జమ అయ్యే ఈ ఆర్థిక సాయాన్ని ఎలా పొందాలో, రెండవ విడత కోసం పాటించాల్సిన నిబంధనలను ఈపీఎఫ్ఓ వివరించింది.
సంఘటిత రంగంలో కొత్త ఉద్యోగాల కల్పనను ప్రోత్సహించడంతో పాటు ఉద్యోగులకు ఆర్థికంగా చేయూతనందించేందుకు కేంద్ర ప్రభుత్వం 'ప్రధాన్ మంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన' (PM-VBRY) పథకాన్ని అమలు చేస్తోంది. రూ.99,446 కోట్ల అంచనా వ్యయంతో 2025 ఆగస్టు 1 నుంచి 2027 జూలై 31 వరకు రెండేళ్ల పాటు ఈ పథకం అందుబాటులో ఉంటుంది. ఈ పథకం కింద నెలకు రూ.1 లక్ష వరకు వేతనం పొందే నూతన ఉద్యోగులకు గరిష్ఠంగా రూ.15,000 వరకు నగదు ప్రోత్సాహకాన్ని నేరుగా వారి ఆధార్ సీడెడ్ బ్యాంక్ ఖాతాల్లోకి (DBT రూపంలో) జమ చేస్తున్నారు.

పథకం విభాగాలు.. ఎవరెవరికి ప్రయోజనం?
పీఎం-వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజనను ప్రభుత్వం రెండు ముఖ్య భాగాలుగా విభజించింది.
పార్ట్ A (ఉద్యోగులకు ప్రోత్సాహకం): మొదటిసారిగా ఈపీఎఫ్ఓ (EPFO) పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు గరిష్ఠంగా రూ.15,000 సహాయం అందిస్తారు. ఈ మొత్తాన్ని రూ.7,500 చొప్పున రెండు విడతల్లో చెల్లిస్తారు.
పార్ట్ B (యజమానులకు ఊరట): కొత్తగా ఉద్యోగ అవకాశాలు కల్పించే సంస్థలకు నిరుద్యోగులను చేర్చుకున్నందుకు గాను ఒక్కో ఉద్యోగిపై నెలకు గరిష్ఠంగా రూ.3,000 వరకు రెండేళ్ల పాటు ప్రోత్సాహకం ఇస్తారు. ఒకవేళ ఆ సంస్థ మాన్యుఫ్యాక్చరింగ్ (తయారీ) రంగానికి చెందినదైతే ఈ ప్రయోజనం నాలుగేళ్ల పాటు వర్తిస్తుంది.
అర్హతలు ఇవే
ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందడానికి ఉద్యోగులు కింద పేర్కొన్న నిబంధనలను కలిగి ఉండాలి.
తొలిసారి నమోదు: 2025 ఆగస్టు 1 నుంచి 2027 జూలై 31 మధ్య కాలంలో మొదటిసారిగా ఈపీఎఫ్ఓ నమోదిత సంస్థలో చేరి ఉండాలి. 2025 ఆగస్టు 1కి ముందు ఈపీఎఫ్ఓ లేదా మినహాయింపు పొందిన ట్రస్టుల్లో సభ్యుడిగా ఉండకూడదు.
వేతన పరిమితి: నెలకు పొందే స్థూల వేతనం రూ.1,00,000 మించకూడదు.
సర్వీస్ నిబంధన: అదే సంస్థలో వరుసగా కనీసం 6 నెలల సర్వీసును పూర్తి చేసి ఉండాలి.
ఈ-కేవైసీ: ఆధార్ ఫేస్ అథెంటికేషన్ ద్వారా యుఏఎన్ (UAN) ఖాతాను యాక్టివేట్ చేసుకోవడంతో పాటు బ్యాంక్ ఖాతాకు డిబిటి (DBT) సౌకర్యం అనుసంధానమై ఉండాలి.
రెండవ విడత రూ.7,500 ఎలా పొందాలి?
మొదటి విడత రూ.7,500 ప్రోత్సాహకం 6 నెలల సర్వీస్ పూర్తయ్యాక జమ అవుతుంది. అయితే, మిగిలిన రెండవ విడత రూ.7,500 పొందాలంటే ఉద్యోగి 12 నెలల నిరంతర సర్వీసును పూర్తి చేయడంతో పాటు ఈపీఎఫ్ఓ నిర్వహించే 'ఫైనాన్షియల్ లిటరసీ కోర్సు' (FLC) పూర్తి చేయడం తప్పనిసరి.
ఆర్థిక అవగాహన పెంపొందించే ఈ కోర్సును పూర్తి చేసే విధానాన్ని ఈపీఎఫ్ఓ వివరించింది.
- ముందుగా ఈపీఎఫ్ఓ అధికారిక పోర్టల్ సందర్శించి 'Employee Login' పై క్లిక్ చేయాలి.
- మీ యుఏఎన్ (UAN) నంబర్, పాస్‌వర్డ్‌లతో సైన్ ఇన్ అవ్వాలి.
- ఆధార్ లింక్ అయిన మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీ (OTP) నమోదు చేసి సబ్మిట్ చేయాలి.
- హోమ్ పేజీలో కనిపిస్తున్న 'PMVBRY' ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.
- డ్రాప్‌డౌన్ మెనూ నుంచి 'Financial Literacy Course' ఎంచుకోవాలి (దీనిలో మొత్తం 5 మోడ్యూల్స్ ఉంటాయి. ఒక్కో మోడ్యూల్ చదివి ప్రశ్నలకు జవాబులిస్తే తదుపరి మోడ్యూల్ అన్‌లాక్ అవుతుంది).
- అన్ని మోడ్యూళ్లు, అసెస్‌మెంట్ విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత ఫైనాన్షియల్ లిటరసీ కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ లభిస్తుంది.
- ఈ కోర్సు పూర్తి చేసి 12 నెలల సర్వీస్ క్లియర్ అయిన వెంటనే, రెండవ విడత ప్రోత్సాహకం నేరుగా మీ ఆధార్ లింక్డ్ బ్యాంక్ ఖాతాలోకి చేరుతుంది. పొదుపు అలవాటును పెంచేందుకు ఈ ప్రోత్సాహకంలో కొంత మొత్తాన్ని డిపాజిట్ సాధనాల్లో భద్రపరిచి, ఆ తర్వాత విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించారు.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


