పీఎం కేర్స్ స్కాలర్షిప్: ఆధార్ లేకపోయినా లబ్ధి.. కేంద్రం కీలక సవరణలు
పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కాలర్షిప్ లబ్ధిదారులకు ఆధార్ ధ్రువీకరణ నిబంధనలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఆధార్ లేదనే నెపంతో లేదా అథెంటికేషన్ విఫలమైందనే కారణంతో విద్యార్థులకు ఎలాంటి సాయాన్ని నిలిపివేయకూడదని కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకం కింద ప్రత్యేక స్కాలర్షిప్ పొందే పిల్లల ఆధార్ ధ్రువీకరణ నిబంధనలపై కేంద్ర ప్రభుత్వం కీలక స్పష్టత ఇచ్చింది. ఆధార్ కార్డు లేదనే నెపంతో గానీ లేదా వేలిముద్రలు పడక అథెంటికేషన్ విఫలమైందనే కారణంతో గానీ అర్హులైన పిల్లలకు స్కాలర్షిప్ ప్రయోజనాలను నిరాకరించకూడదని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రత్యామ్నాయ గుర్తింపు ప్రక్రియలను నిర్దేశిస్తూ స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసింది.

కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ ఈ నోటిఫికేషన్‌ను అక్టోబర్ 14, 2026న భారత అసాధారణ గెజెట్‌లో (S.O. 5628(E)) ప్రచురించింది. ఆధార్ చట్టం 2016లోని సెక్షన్ 7 కింద ఈ నిబంధనలను జారీ చేశారు. 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువు కొనసాగించేందుకు ఈ పథకం కింద ఆర్థిక సాయం పొందుతున్న విద్యార్థుల గుర్తింపు ధ్రువీకరణకు ఇవి వర్తిస్తాయి.
ఆధార్ లేకపోతే ప్రత్యామ్నాయ పత్రాలు ఇవే
18 ఏళ్ల లోపు వయసున్న పిల్లలకు, 18 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉండి ఇంకా ఆధార్ కేటాయించని లబ్ధిదారులకు వేర్వేరు పత్రాల జాబితాను నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
18 ఏళ్ల లోపు పిల్లలకు ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ నుంచి పొందిన ఎన్రోల్మెంట్ ఐడీ (EID) రశీదుతో పాటు వయస్సును ధ్రువీకరించే పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. జనన ధ్రువీకరణ పత్రం (Birth Certificate), భారతీయ పాస్‌పోర్ట్, లేదా గుర్తింపు పొందిన విద్యాబోర్డు జారీ చేసిన 10వ లేదా 12వ తరగతి మార్కుల జాబితా లేదా సర్టిఫికెట్‌ను వయస్సు ఆధారంగా స్వీకరిస్తారు. నమోదిత చైల్డ్ కేర్ సంస్థల్లో ఉన్న పిల్లలకు, విదేశీ పౌరులైన పిల్లలకు కూడా ప్రత్యేకమైన పత్రాలను అనుమతించారు.
దీనితో పాటు, తల్లిదండ్రులు లేదా చట్టబద్ధమైన సంరక్షకులతో ఉన్న సంబంధాన్ని నిరూపించేందుకు ఫొటోతో కూడిన గుర్తింపు కార్డును ఇవ్వాలి. రేషన్ కార్డు, భారతీయ పాస్‌పోర్ట్, కుల లేదా నివాస ధ్రువీకరణ పత్రాలు, ప్రభుత్వం జారీ చేసిన వైద్య లేదా ఇన్సూరెన్స్ కార్డులను ఇందుకు పరిగణనలోకి తీసుకుంటారు. దత్తత ఆర్డర్లు లేదా చట్టబద్ధమైన సంరక్షకత్వాన్ని తెలిపే ఇతర పత్రాలు కూడా చెల్లుబాటు అవుతాయి.
18 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉండి ఆధార్ లేని లబ్ధిదారులు ఓటర్ గుర్తింపు కార్డు (Voter ID), రేషన్ కార్డు, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, దివ్యాంగుల ధ్రువీకరణ పత్రం (UDID) వంటి పత్రాలతో పాటు ఆధార్ ఎన్రోల్మెంట్ రశీదును సమర్పించవచ్చు.
అథెంటికేషన్ విఫలమైతే ఏం చేయాలి?
బయోమెట్రిక్ వివరాలు స్పష్టంగా పడకపోవడం వంటి సాంకేతిక సమస్యల వల్ల ఆధార్ అథెంటికేషన్ విఫలమయ్యే పరిస్థితులపైనా నోటిఫికేషన్లో స్పష్టత ఇచ్చారు.
ఒక రకమైన బయోమెట్రిక్ విధానం పనిచేయనప్పుడు మరొక బయోమెట్రిక్ పద్ధతిని గానీ, ఓటీపీ (OTP) ఆధారిత అథెంటికేషన్‌ను గానీ ఉపయోగించే వెసులుబాటు కల్పించాలి. ఒకవేళ బయోమెట్రిక్, ఓటీపీ రెండూ సాధ్యం కాకపోతే, ఆఫ్‌లైన్ ధ్రువీకరణ ద్వారా ఆధార్ సంఖ్య ప్రామాణికతను నిర్ధారించి ప్రయోజనాలను అందించవచ్చు. ఆధార్ సెక్యూర్ క్యూఆర్ కోడ్ (QR Code) లేదా పేపర్‌లెస్ ఆఫ్‌లైన్ ఈ-కేవైసీ (e-KYC) పత్రాల ద్వారా ఈ ఆఫ్‌లైన్ ధ్రువీకరణ చేపట్టవచ్చు.
ప్రత్యామ్నాయ పత్రాల పరిశీలన ఎలా?
ఆధార్ సంఖ్య లేని లబ్ధిదారులు సమర్పించిన పత్రాలను సరిచూసేందుకు సామాజిక న్యాయ సాధికారత విభాగం ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తుంది.
ఆ అధికారి 'మైఆధార్' (myAadhaar) పోర్టల్‌లో ఎన్రోల్మెంట్ ఐడీని నమోదు చేసి, అది చెల్లుబాటులో ఉందో లేదో, దరఖాస్తు తిరస్కరణకు గురికాలేదని ధ్రువీకరించుకుంటారు. ఇతర పత్రాలను సరిచూసేందుకు అవసరమైతే ఆయా రికార్డులను నిర్వహించే ప్రభుత్వ శాఖల సాయం కూడా తీసుకుంటారు. ఈ ఆధార్ మార్గదర్శకాలపై లబ్ధిదారులకు స్పష్టమైన అవగాహన కల్పించేలా ప్రచార మాధ్యమాల ద్వారా చర్యలు చేపట్టనున్నారు.
ప్రత్యామ్నాయ ధ్రువీకరణ విధానం ద్వారా ప్రయోజనాలు పొందిన పిల్లల రికార్డులను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తూ, కాలానుగుణంగా ఆడిట్ చేస్తారు. అర్హులైన 18 ఏళ్లు పైబడిన లబ్ధిదారులకు ఎలాంటి అన్యాయం జరగకుండా మినహాయింపుల నిర్వహణ యంత్రాంగాన్ని (Exception-handling mechanism) పక్కాగా అమలు చేయనున్నారు.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


