ఇన్సూరెన్స్ పాలసీ కమిషన్లలో మార్పు: ఐఆర్డీఏఐ ప్రతిపాదనలపై ఆర్బీఐ ఫోకస్

బీమా పంపిణీ విధానంలో ఐఆర్డీఏఐ ప్రతిపాదించిన భారీ సంస్కరణలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దృష్టి సారించింది. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలపై పడే ప్రభావాన్ని అంచనా వేస్తున్నామని, ఈ ముసాయిదాపై త్వరలోనే తమ అభిప్రాయాలను వెల్లడిస్తామని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టం చేశారు.

Published on: Oct 7, 2026, 16:57:20 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

బీమా సంస్థల ఉత్పత్తుల పంపిణీ విధానంలో బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) భారీ సంస్కరణలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ ప్రతిపాదనలు బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల (ఎన్బీఎఫ్సీ) పై చూపించే ప్రభావాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిశితంగా సమీక్షిస్తోంది. ఐఆర్డీఏఐ తీసుకురావాలనుకుంటున్న మార్పులపై తాము ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని, అయితే తమ అభిప్రాయాలను త్వరలోనే వారితో పంచుకుంటామని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టం చేశారు.

ఇన్సూరెన్స్ పాలసీ కమిషన్లలో మార్పు: ఐఆర్డీఏఐ ప్రతిపాదనలపై ఆర్బీఐ ఫోకస్
ఇన్సూరెన్స్ పాలసీ కమిషన్లలో మార్పు: ఐఆర్డీఏఐ ప్రతిపాదనలపై ఆర్బీఐ ఫోకస్

బీమా పంపిణీకి అయ్యే నిర్వహణ వ్యయాలపై (ఈఓఎం) కఠిన పరిమితులు విధించడం, కమీషన్లపై తిరిగి ఒక పద్ధతిని తీసుకురావడం, పంపిణీ వ్యవస్థను సరళీకరించడం వంటి కీలక మార్పులను ఐఆర్డీఏఐ పరిశీలిస్తోంది.

నిర్ణయం వారిదే.. మాది సలహా మాత్రమే

ఈ మార్పుల విషయంలో ఆర్బీఐ, ఐఆర్డీఏఐ కలిసి పనిచేస్తాయా అన్న ప్రశ్నకు గవర్నర్ మల్హోత్రా సమాధానం ఇచ్చారు. ఇది పూర్తిగా బీమా నియంత్రణ సంస్థ పరిధిలోని అంశమని ఆయన తేల్చి చెప్పారు. విధాన సమీక్ష నిర్ణయాల అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన పలు విషయాలు వెల్లడించారు.

"బీమా ఉత్పత్తుల పంపిణీ ఎలా జరగాలన్నది ఆ నియంత్రణ సంస్థ నిర్ణయించాల్సిన అంశం. ఈ ప్రతిపాదనలపై మేం ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. కానీ, మా అభిప్రాయాలను కచ్చితంగా వారికి తెలియజేస్తాం" అని ఆయన పేర్కొన్నారు.

బ్యాంకుల ఫీజు ఆదాయంపై ప్రభావం

ఐఆర్డీఏఐ తెచ్చిన ఈ కొత్త ప్రతిపాదనలు బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల వ్యాపారంపై గణనీయమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. రుణాలకు అనుసంధానించిన బీమా ఉత్పత్తుల విక్రయాల ద్వారా ఈ సంస్థలు భారీగా ఫీజుల రూపంలో ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి. తాజా ప్రతిపాదనల ప్రకారం కమీషన్ల చెల్లింపులకు కళ్లెం పడితే, క్రెడిట్, లైఫ్ ఇన్సూరెన్స్ వంటి ఉత్పత్తుల విక్రయం ద్వారా వచ్చే ఆదాయం భారీగా పడిపోతుంది. అలాగే, రుణాలతో పాటు తప్పనిసరిగా బీమా అంటగట్టే విధానాన్ని నిషేధించాలన్న ప్రతిపాదన కూడా బ్యాంకుల బీమా విక్రయాల వేగాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది.

వినియోగదారుల ప్రయోజనాలకే పెద్దపీట

బీమా విక్రయాలపై బ్యాంకులు పొందే కమీషన్లలో భారీ కోత విధించాలన్న నిర్ణయంపైనా సంజయ్ మల్హోత్రా స్పందించారు. ఇవి ఇంకా ముసాయిదా దశలోనే ఉన్నాయని, తుది నిర్ణయం తీసుకునే ముందు ఐఆర్డీఏఐ వాటాదారులందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటుందని ఆయన వివరించారు.

"కొనుగోలుదారులపై ఆర్థిక భారం తగ్గించడం, తప్పుదోవ పట్టించి బీమా విక్రయించడాన్ని (మిస్-సెల్లింగ్) అరికట్టడమే ప్రధాన లక్ష్యంగా ఈ ప్రతిపాదనలు తెచ్చినట్లు కనిపిస్తోంది. పరిశ్రమతో పాటు వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఐఆర్డీఏఐ సరైన నిర్ణయం తీసుకుంటుంది" అని మల్హోత్రా ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రతిపాదనల్లోని ముఖ్యాంశాలు

సెప్టెంబర్ 23న ఐఆర్డీఏఐ విడుదల చేసిన ముసాయిదా పత్రంలో నిర్వహణ వ్యయాల (ఈఓఎం) తగ్గింపునకు ఐదేళ్ల ప్రణాళికను సూచించింది. దీని ప్రకారం జీవిత బీమా సంస్థలు తమ ఈఓఎంను రెండేళ్లలో ప్రీమియంలో 15 శాతానికి, ఐదేళ్లలో 12.5 శాతానికి తగ్గించుకోవాలి. సాధారణ బీమా సంస్థలైతే ఈ పరిమితులను వరసగా 25 శాతం, 20 శాతంగా సాధించాల్సి ఉంటుంది. అలాగే, బీమా ఉత్పత్తిని బట్టి పంపిణీ సంస్థలకు చెల్లించే తొలి ఏడాది కమీషన్ పరిమితిని 5 శాతం నుంచి 20 శాతం మధ్య ఉండేలా ముసాయిదాలో ప్రతిపాదించారు.

ఈ ముసాయిదాపై వాటాదారులు తమ అభిప్రాయాలను తెలియజేసేందుకు అక్టోబర్ 25 వరకు ఐఆర్డీఏఐ గడువు విధించింది.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More