Jharkhand Protests : జంతర్ మంతర్ రిపీట్! ఝార్ఖండ్​లో విద్యార్థులపై లాఠీ ఛార్జ్..

Jharkhand Student Protest live : రిక్రూట్‌మెంట్ పరీక్షల లీకేజీలపై రాంచీలో విద్యార్థులు చేపట్టిన ఝార్ఖండ్ అసెంబ్లీ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బారికేడ్లను బద్దలుకొట్టిన ఆందోళనకారులపై పోలీసులు లాఠీఛార్జ్ చేసి, వాటర్ కెనాన్లను ప్రయోగించారు.

Published on: Aug 10, 2026, 13:42:57 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఝార్ఖండ్‌లో రిక్రూట్‌మెంట్ పరీక్షల పేపర్ లీకులు, అవకతవకలకు వ్యతిరేకంగా, పరీక్షా విధానంలో సమూల సంస్కరణలు కోరుతూ విద్యార్థులు సోమవారం తలపెట్టిన అసెంబ్లీ ముట్టడి రాంచీలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బారికేడ్లను దాటుకుని అసెంబ్లీ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన విద్యార్థులను అడ్డుకునేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. అంతేకాకుండా వాటర్ కెనాన్లను ప్రయోగించి వారిని చెదరగొట్టారు. కాగా కొందరు ఆ వాటర్ కెనాన్ల దాడి మధ్యలోనే డ్యాన్సులు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.

ఝార్ఖండ్​ రాంచీలో ఉద్రిక్త పరిస్థితులు..
ఝార్ఖండ్​ రాంచీలో ఉద్రిక్త పరిస్థితులు..

సోమవారం ఝార్ఖండ్​లోని ఘటన.. గత నెలలో దిల్లీలో జరిగిన జంతర్ మంతర్ నిరసనల పరిస్థితులను గుర్తుకు చేస్తోంది. జులై 20న జరిగిన 'పార్లమెంట్ చలో' మార్చ్​లో విద్యార్థులపై పోలీసులు లాఠీ ఛార్జ్​ చేసిన విషయం తెలిసిందే.

ఇక తాజాగా.. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వేలాది మంది విద్యార్థులు రైళ్లు, బస్సులు, ఇతర వాహనాల్లో ఉదయమే రాజధానికి చేరుకున్నారు. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా నగరంలోని ప్రధాన చౌరాస్తాలు, సున్నిత ప్రాంతాల్లో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. రాంచీలోని చాలా పాఠశాలలను మూసివేశారు. సరిహద్దుల్లో వాహనాలను తనిఖీ చేస్తూ విద్యార్థులు రాజధానికి రాకుండా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. వేలాదిగా విద్యార్థులు చలో అసెంబ్లీ నిరసన కార్యక్రమానికి తరలివెళ్లారు.

అదే సమయంలో మరోవైపు సీఎం హేమంత్ సోరేన్ నివాసం ఎదుట బీజేపీ నేతలు కూడా నిరసన చేపట్టారు.

ఈ నేపథ్యంలో మధ్యాహ్నం నాటికి పరిస్థితి ఉద్రిక్తతంగా మారడంతో పోలీసులు నిరసనకారులపై లాఠీ ఛార్జ్​ చేశారు.

ఆందోళనకు అసలు కారణాలు..

ఝార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (జేపీఎస్సీ), ఝార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (జేఎస్‌ఎస్‌సీ) నిర్వహించిన రిక్రూట్‌మెంట్ పరీక్షల్లో పేపర్ లీక్ కావడమే ఈ ఆందోళనలకు ప్రధాన కారణం. గత 16 రోజులుగా ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘాలతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ పలుమార్లు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. నిన్న జరిగిన ఆరో విడత చర్చలు కూడా ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదు.

పరీక్షల్లో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలంటూ విద్యార్థులు పట్టుబట్టారు.

నిరసనకారుల డిమాండ్లలో 98 శాతం అంగీకరించామని, ఆందోళన విరమించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అయితే తాము రద్దు చేయాలని కోరిన 13 పరీక్షల్లో కేవలం మూడింటిని మాత్రమే ప్రభుత్వం రద్దు చేసిందని విద్యార్థులు వాదించారు. అదే సమయంలో సీబీఐ విచారణ డిమాండ్‌పై వెనక్కి తగ్గేది లేదని జేపీఎస్సీ-జేఎస్‌ఎస్‌సీ రిఫార్మ్స్ మంచ్ నేత రవీంద్ర పాశ్వాన్ స్పష్టం చేశారు.

ఈ ఆందోళనలో భాగంగా ఆరుగురు విద్యార్థులు నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు.

మరోవైపు నిన్న సీఐడీ సమన్ల నేపథ్యంలో జేపీఎస్సీకి చెందిన ముగ్గురు సభ్యులు రాజీనామా చేయడం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. అంతకుముందు జేపీఎస్సీ ఛైర్మన్ ఎల్ ఖియాంగ్టే కూడా జూలై 22న రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

రిక్రూట్‌మెంట్ పరీక్షల్లో తప్పులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఇప్పటికే హామీ ఇచ్చినప్పటికీ, విద్యార్థులు మాత్రం సీబీఐ విచారణే లక్ష్యంగా ఆందోళనను కొనసాగిస్తున్నారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More