PPF : మెచ్యూరిటీ కంటే ముందే పీపీఎఫ్​ నుంచి డబ్బు విత్​డ్రా చేసుకోవచ్చా? రూల్స్​ ఇవి..

పీపీఎఫ్ ఖాతాపై 7.1% పన్ను రహిత వడ్డీని కేంద్రం కొనసాగిస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో 15 ఏళ్ల మెచ్యూరిటీ కంటే ముందే నగదును ఎలా విత్ డ్రా చేయాలి? లోన్ పొందే మార్గాలు ఏంటి? వంటి పూర్తి సమాచారం మీకోసం..

Published on: Apr 5, 2026, 09:10:34 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రస్తుత ఆర్థిక మార్కెట్‌లో అత్యంత సురక్షితమైన, లాభదాయకమైన స్థిర ఆదాయ మార్గాల్లో 'పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్' (పీపీఎఫ్) అగ్రస్థానంలో ఉంది. 7.1% పన్ను రహిత వడ్డీని అందిస్తున్న ఈ పథకం, ప్రభుత్వ హామీ, కాంపౌండింగ్ (చక్రవడ్డీ) ప్రయోజనంతో దీర్ఘకాలిక పొదుపుకు ఒక అద్భుతమైన సాధనం. అయితే, పీపీఎఫ్ ఖాతాకు 15 ఏళ్ల పీరియడ్ ఉన్నప్పటికీ, మెడికల్ ఎమర్జెన్సీ లేదా పిల్లల చదువుల వంటి అనివార్య కారణాల వల్ల డబ్బును మధ్యలోనే విత్ డ్రా చేసుకోవాల్సిన పరిస్థితులు రావచ్చు.

మెచ్యూరిటీ కంటే ముందే పీపీఎఫ్​ నుంచి డబ్బు విత్​డ్రా చేసుకోవచ్చా?
మెచ్యూరిటీ కంటే ముందే పీపీఎఫ్​ నుంచి డబ్బు విత్​డ్రా చేసుకోవచ్చా?

పీపీఎఫ్ ఖాతాను గడువు కంటే ముందే క్లోజ్ చేయడం ఎలా?

నియమ నిబంధనల ప్రకారం, పీపీఎఫ్ ఖాతాను ఐదు పూర్తి ఆర్థిక సంవత్సరాలు ముగిసిన తర్వాత మాత్రమే కొన్ని ప్రత్యేక పరిస్థితులలో మూసివేయడానికి (ప్రీమెచ్యూర్​ క్లోజర్) అనుమతిస్తారు.

తీవ్రమైన అనారోగ్యం: ఖాతాదారుడు, జీవిత భాగస్వామి, పిల్లలు లేదా ఆధారపడిన తల్లిదండ్రుల వైద్య చికిత్స కోసం.

ఉన్నత విద్య: ఖాతాదారుడు లేదా వారి పిల్లల ఉన్నత చదువుల కోసం (అడ్మిషన్ ధృవీకరణ పత్రాలు సమర్పించాలి).

నివాస స్థితి మార్పు: ఖాతాదారుడి రెసిడెన్సీ స్టేటస్ మారినప్పుడు (ఉదాహరణకు ఎన్ఆర్ఐగా మారినప్పుడు).

ముఖ్య గమనిక - జరిమానా: గడువు కంటే ముందే ఖాతాను క్లోజ్ చేస్తే, అప్పటివరకు పొందిన వడ్డీ రేటులో 1% జరిమానా విధిస్తారు. అంటే మీ ఇన్వెస్ట్‌మెంట్ కాలమంతటికీ వర్తించే వడ్డీ రేటు 1% తగ్గుతుంది. దీనికోసం బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్‌లో పాస్‌బుక్, అవసరమైన పత్రాలతో పాటు ఫామ్-5ను సమర్పించాలి.

పీపీఎఫ్​లో పాక్షిక విత్​డ్రా సదుపాయం..

ఒకవేళ మీరు మీ పీపీఎఫ్​ ఖాతాను పూర్తిగా క్లోజ్ చేయకూడదు అనుకుంటే, పాక్షిక విత్​డ్రా సౌకర్యాన్ని వాడుకోవచ్చు.

ఆరో ఆర్థిక సంవత్సరం నుంచి ఏటా ఒకసారి నగదు తీసుకోవచ్చు.

నాల్గొవ అంతకుముందు సంవత్సరం చివరలో ఉన్న బ్యాలెన్స్ లేదా అంతకుముందు సంవత్సరం చివరలో ఉన్న బ్యాలెన్స్.. ఈ రెండింటిలో ఏది తక్కువైతే దానిలో 50% వరకు విత్ డ్రా చేసుకోవచ్చు.

పీపీఎఫ్ ఖాతాపై రుణం..

పబ్లిక్​ ప్రావిడెంట్ ఫండ్ ఖాతా ప్రారంభించిన మొదటి ఏడాది ముగిసినప్పటి నుంచి, ఐదేళ్లు నిండక ముందే మీరు లోన్ తీసుకోవచ్చు.

పరిమితి: రెండేళ్ల క్రితం ఉన్న బ్యాలెన్స్‌లో గరిష్టంగా 25% వరకు లోన్ పొందవచ్చు.

తిరిగి చెల్లింపు: ఈ రుణాన్ని 36 నెలల్లోపు తిరిగి చెల్లించాలి. వడ్డీ రేటు ప్రస్తుత పీపీఎఫ్ రేటు కంటే 1% ఎక్కువగా ఉంటుంది.

ఒకవేళ 36 నెలల్లోపు చెల్లించకపోతే, వడ్డీ సర్ఛార్జ్ 6%కి పెరుగుతుంది. పాత లోన్ తీర్చే వరకు కొత్త లోన్ ఇవ్వరు.

అకౌంట్ ఎలా తెరవాలి? పరిమితులు ఏంటి?

పీపీఎఫ్ ఖాతాను పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంకుల్లో నేరుగా గానీ, నెట్ బ్యాంకింగ్/మొబైల్ యాప్స్ ద్వారా డిజిటల్ పద్ధతిలో గానీ తెరవవచ్చు.

కనీస డిపాజిట్ ఏటా రూ. 500, గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు.

సెక్షన్ 80సీ కింద రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది. మెచ్యూరిటీ అమౌంట్, వడ్డీ రెండూ పూర్తిగా పన్ను రహితం. 15 ఏళ్ల తర్వాత కూడా ఐదేళ్ల బ్లాకుల చొప్పున అకౌంట్‌ను ఎన్నిసార్లయినా పొడిగించుకోవచ్చు.

మారని చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లు:..

మరోవైపు వరుసగా ఎనిమిదో త్రైమాసికం (ఏప్రిల్ 1, 2026 నుంచి జూన్ 30, 2026 వరకు) కూడా ప్రభుత్వం వడ్డీ రేట్లను మార్చకుండా యథాతథంగా ఉంచింది:

సుకన్య సమృద్ధి యోజన: 8.2%

సీనియర్ సిటిజన్ సేవింగ్స్: 8.2%

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (ఎన్​ఎస్​సీ): 7.7%

కిసాన్ వికాస్ పత్ర: 7.5% (115 నెలల్లో మెచ్యూరిటీ)

మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (ఎంఐఎస్​): 7.4%

పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్: 4%

చివరిసారిగా 2023-24 చివరి త్రైమాసికంలో ప్రభుత్వం ఈ రేట్లను సవరించింది, అప్పటి నుండి స్థిరంగా కొనసాగిస్తోంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More