PPF for minors : పిల్లల పీపీఎఫ్​ డబ్బులను తల్లిదండ్రులు వాడకూడదు! ఈ రూల్స్​ తెలుసుకోండి..

పిల్లల పీపీఎఫ్‌ ఖాతా డబ్బులపై తల్లిదండ్రుల హక్కుల గురించిన ఒక కేసులో దిల్లీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. పిల్లల కోసం దాచిన డబ్బును వ్యక్తిగత అవసరాలకు లేదా మెయింటెనెన్స్ కింద సర్దుబాటు చేయడానికి వీలుడదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో మైనర్ల పీపీఎఫ్​ అకౌంట్​పై ఉన్న రూల్స్​ గురించి ఇక్కడ తెలుసుకోండి..

Published on: Aug 22, 2026, 16:29:28 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పిల్లల పేరిట దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టే ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన వార్త ఇది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) ఖాతా యాజమాన్యం, నిర్వహణ విషయంలో తండ్రీకూతుళ్ల మధ్య తలెత్తిన ఒక లీగల్ వివాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. మెచ్యూరిటీ తర్వాత తన డబ్బు తాను క్లెయిమ్ చేసుకునేలోపే, తండ్రి తన పీపీఎఫ్‌ ఖాతాలోని డబ్బు అంతా డ్రా చేసి క్లోజ్ చేశాడని ఆరోపిస్తూ ఆ కూతురు కోర్టును ఆశ్రయించింది.

పిల్లల పీపీఎఫ్‌ నుంచి తల్లిదండ్రులు డబ్బు తీసుకోవచ్చా?
పిల్లల పీపీఎఫ్‌ నుంచి తల్లిదండ్రులు డబ్బు తీసుకోవచ్చా?

2016లో తన కూతురి చదువు, పోషణ ఖర్చుల కోసం అంటూ తండ్రి రూ.8 లక్షలకు పైగా పీపీఎఫ్‌ డబ్బును విత్‌డ్రా చేసి ఆ ఖాతాను మూసివేశాడు. అయితే ఆ తర్వాత తల్లిదండ్రుల మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోవడంతో ఆ అమ్మాయి తన తల్లితో కలిసి ఉంటోంది. కాలేజీ చదువు కొనసాగించడానికి తండ్రి ఎలాంటి ఆర్థిక సాయం చేయకపోగా, పీపీఎఫ్‌ డబ్బును కూడా స్వాహా చేశాడని ఆమె కోర్టులో పిటిషన్ వేసింది.

కోర్టు తీర్పు, తండ్రి వాదనల తిరస్కరణ..

ఈ కేసు విచారణ సమయంలో తండ్రి వాదిస్తూ.. ఆ డబ్బును కూతురు, భార్యకు చెల్లించాల్సిన మెయింటెనెన్స్ (భరణం) కింద సర్దుబాటు చేయాలని కోరారు. అయితే ఆయన వాదనను దిల్లీ హైకోర్టు పూర్తిగా తోసిపుచ్చింది. పీపీఎఫ్‌ ఖాతా తాలూకు పూర్తి మొత్తాన్ని 8 శాతం వార్షిక వడ్డీతో కలిపి కూతురికి తిరిగి చెల్లించాలని స్పష్టమైన తీర్పునిచ్చింది.

పిల్లల పీపీఎఫ్‌ నుంచి తల్లిదండ్రులు డబ్బు తీసుకోవచ్చా?

కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తల్లిదండ్రులు లేదా సంరక్షకులు మైనర్ పీపీఎఫ్‌ ఖాతా నుంచి డబ్బు విత్‌డ్రా చేయవచ్చని ‘ది విక్టోరియం లెగాలిస్’ (టీవీఎల్) మేనేజింగ్ పార్టనర్ ఆదిత్య చోప్రా తెలిపారు. అయితే ఆ డబ్బును తల్లిదండ్రుల సొంత ఖర్చులకు వాడటానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వీల్లేదని ఆయన స్పష్టం చేశారు!

పిల్లలు మైనర్లుగా ఉన్నప్పుడు ఖాతాను తల్లిదండ్రులు ఆపరేట్ చేసినప్పటికీ, ఆ పొదుపు మొత్తం పూర్తిగా పిల్లల ప్రయోజనం కోసమేనని గుర్తుంచుకోవాలి. పిల్లలకు 18 ఏళ్లు నిండిన తర్వాత ఆ మొత్తాన్ని వారికే పూర్తిగా అప్పగించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.

దిల్లీ హైకోర్టు అడ్వకేట్ అపూర్వ పాండే మాట్లాడుతూ.. "పిల్లల చదువు లేదా సంక్షేమం కోసం వారి పేరిట పెట్టుబడి పెట్టినప్పుడు, తల్లిదండ్రులు కేవలం సంరక్షకులుగా మాత్రమే వ్యవహరిస్తారు. ఆ డబ్బును చట్టపరమైన భరణం బాధ్యతల నుంచి మినహాయించుకోవడానికి లేదా సొంత అవసరాలకు ఉపయోగించడానికి ఎలాంటి హక్కు లేదు," అని పేర్కొన్నారు.

తల్లిదండ్రులు ఏం చేయవచ్చు? ఏం చేయకూడదు?

పిల్లల పీపీఎఫ్‌ ఖాతాను ఆపరేట్ చేయడం, మెచ్యూరిటీ సమయంలో ఖాతాను క్లోజ్ చేసి ఆ మొత్తాన్ని వారికి అందించడం వరకు మాత్రమే తల్లిదండ్రుల పాత్ర పరిమితం.

పిల్లల చదువు, వైద్య చికిత్స లేదా ఇతర సమంజసమైన సంక్షేమ అవసరాల కోసం నిబంధనల ప్రకారం డబ్బును విత్‌డ్రా చేయవచ్చు.

పిల్లల ప్రాథమిక అవసరాలు తీర్చకుండా వదిలేయడానికి వీలేదు. తల్లిదండ్రులు తమ సొంత వనరుల నుంచే మెయింటెనెన్స్ ఖర్చులు భరించాలి.

పిల్లలకు 18 ఏళ్లు నిండగానే సంరక్షకుల పాత్ర పూర్తిగా ముగుస్తుంది. ఆ తర్వాత పీపీఎఫ్‌ ఖాతా నియంత్రణను పూర్తి నిల్వలతో పాటు ఆ యువతీయువకులకు అప్పగించాలి.

ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లల పీపీఎఫ్‌లో డిపాజిట్ చేయవచ్చా?

నిబంధనల ప్రకారం తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి తమ పిల్లల పీపీఎఫ్‌ ఖాతాలో విడివిడిగా రూ.1.5 లక్షల చొప్పున డిపాజిట్ చేయడానికి కుదరదు. ఒక ఆర్థిక సంవత్సరంలో మైనర్ ఖాతాలో మొత్తం కలిపి రూ.1.5 లక్షలకు మించి జమ చేయడానికి నిబంధనలు ఒప్పుకోవు. తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి డిపాజిట్ చేసినా, ఆ మొత్తం రూ.1.5 లక్షల పరిమితిని దాటకూడదు. ఈ నిబంధనను ఉల్లంఘించి జమ చేసే అదనపు మొత్తానికి పన్ను మినహాయింపు లభించదు, వడ్డీ కూడా రాదు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More