ఓటర్ లిస్ట్ నుంచి ప్రకాష్ రాజ్ పేరు తొలగింపు: ‘గేమ్ ఆన్’ అంటూ సవాల్

కర్ణాటకలో జరుగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో తన ఓటు హక్కును తొలగించారని ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ఆరోపించారు. బెంగళూరులోనే పుట్టి పెరిగిన తన పేరునే ఓటర్ల జాబితా నుంచి తీసేయడాన్ని ఒక పెద్ద జోక్‌గా ఆయన అభివర్ణించారు.

Published on: Aug 11, 2026, 14:22:49 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కర్ణాటకలో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి తన పేరును తొలగించారని ప్రముఖ బహుభాషా నటుడు, సామాజిక వేత్త ప్రకాష్ రాజ్ వెల్లడించారు. సోషల్ మీడియా వేదిక 'ఎక్స్' (X) ద్వారా ఒక వీడియోను విడుదల చేసిన ఆయన, ఈ పరిణామాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.

ఓటర్ లిస్ట్ నుంచి ప్రకాష్ రాజ్ పేరు తొలగింపు: ‘గేమ్ ఆన్’ అంటూ సవాల్ (Savitha)
ఓటర్ లిస్ట్ నుంచి ప్రకాష్ రాజ్ పేరు తొలగింపు: ‘గేమ్ ఆన్’ అంటూ సవాల్ (Savitha)

"బెంగళూరులో పుట్టి పెరిగిన నాకే ఓటు లేదా?"

తన ఓటు హక్కును తొలగించడంపై ప్రకాష్ రాజ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. "బెంగళూరు నియోజకవర్గంలోనే నేను పుట్టి పెరిగాను. ఇక్కడే పాఠశాల, కళాశాల విద్యను అభ్యసించాను. థియేటర్ ఆర్టిస్ట్‌గా నా ప్రస్థానాన్ని ప్రారంభించాను. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడి నుంచే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశాను. అలాంటిది SIR ప్రక్రియ తర్వాత ఓటు హక్కు కోల్పోయిన 65 లక్షల మందిలో నేను ఒకడినయ్యాను. ఇదో పెద్ద జోక్ లాగా ఉంది" అని ప్రకాష్ రాజ్ ఆవేదన వ్యక్తం చేశారు.

తమ ఓటును తిరిగి పొందడానికి ఇకపై ఏ ఏ కాగితాలు చూపించాలో అర్థం కావడం లేదని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

"మా అధికారాన్ని ఆపలేరు.. గేమ్ ఆన్!"

ఓటు హక్కు పునరుద్ధరణ కోసం పాటించాల్సిన ప్రక్రియ ఏంటో తాను తెలుసుకుంటానని ప్రకాష్ రాజ్ స్పష్టం చేశారు. "ఇప్పటి నుంచే అసలైన ఆట మొదలైంది (Game On). నా ఓటర్ ఐడీని తిరిగి తెచ్చుకోవడానికి ఏ ప్రక్రియ దాటాలో చూస్తాను" అని ఆయన సవాల్ విసిరారు.

పాలకవర్గాన్ని ప్రశ్నిస్తూ, "మీకు ఓటు వేయరనే అనుమానంతో కొందరు పౌరుల ఓటు హక్కును కాలరాసేందుకు మీ అధికారాలను ఉపయోగించుకోవచ్చు. అయితే, అధికార పీఠం నుంచి మిమ్మల్ని కిందకు దించే ప్రజల శక్తిని మీరు ఆపగలరా?" అని ప్రకాష్ రాజ్ నిలదీశారు.

జార్ఖండ్ విద్యార్థుల ఆందోళనపై స్పందన

ఇదే సమయంలో జార్ఖండ్ రాజధాని రాంచీలో అసెంబ్లీ వైపు ప్రదర్శనగా వెళ్తున్న విద్యార్థులపై పోలీసులు ప్రయోగించిన లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ఘటనపై కూడా ప్రకాష్ రాజ్ స్పందించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై దౌర్జన్యం చేయడం సరైంది కాదన్నారు.

"ఈ దౌర్జన్యం ఇక సాగదు. ఇది అహంకారపూరితమైన అధికారాన్ని కూల్చివేసేందుకు మాత్రమే దోహదపడుతుంది" అని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు.

కర్ణాటక SIR టైమ్‌లైన్ సవరణ

కర్ణాటక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో కేంద్ర ఎన్నికల సంఘం (ECI) కొన్ని మార్పులు చేసింది. భారత ఎన్నికల సంఘం ఆగస్టు 7న పంపిన లేఖ ప్రకారం కర్ణాటక డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా ప్రచురణను ఆగస్టు 24కు వాయిదా వేశారు. తుది ఓటర్ల జాబితాను అక్టోబర్ 27న విడుదల చేయనున్నారు. ఈ ఓటర్ల జాబితా సవరణకు అర్హత తేదీగా 2026 అక్టోబర్ 1ని ఖరారు చేశారు.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More