మనస్పర్థలకు స్వస్తి పలుకుదాం: తండ్రి, అన్నతో రాజీకి ప్రిన్స్ హ్యారీ సిద్ధం

బ్రిటిష్ రాజకుటుంబంతో ఉన్న పాత విభేదాలను మరచిపోయి, తండ్రి కింగ్ చార్లెస్ 3, అన్న ప్రిన్స్ విలియంతో తిరిగి కలవాలని ప్రిన్స్ హ్యారీ ఆకాంక్షించారు. గాయాలు మాన్పడానికి గతం వదిలేయడమే ఏకైక మార్గమని న్యూయార్క్‌లో జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆయన స్పష్టం చేశారు.

Published on: Oct 21, 2026, 17:54:38 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

బ్రిటిష్ రాజకుటుంబంలో గత కొన్నేళ్లుగా సాగుతున్న తీవ్ర మనస్పర్థలకు ముగింపు పలకాలని డ్యూక్ ఆఫ్ సస్సెక్స్ ప్రిన్స్ హ్యారీ కోరుకుంటున్నారు. తన తండ్రి కింగ్ చార్లెస్ 3, పెద్దన్న ప్రిన్స్ విలియంతో ఉన్న విభేదాలను తొలగించుకుని, వారితో తిరిగి సత్సంబంధాలను నెలకొల్పుకోవడమే తనకు అత్యంత ప్రాధాన్య అంశమని ఆయన వెల్లడించారు. న్యూయార్క్‌ వేదికగా ప్రముఖ 'జీక్యూ' (GQ) మేగజైన్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో 42 ఏళ్ల ప్రిన్స్ హ్యారీ తన మనసులోని ఆవేదనను, భావోద్వేగాలను పంచుకున్నారు.

ప్రిన్స్ హారీ, మేఘన్
ప్రిన్స్ హారీ, మేఘన్

ఈ బంధాలు మళ్లీ నిలవాలనే కోరుకుంటున్నా

రాజకుటుంబంలో కలతలు, విభేదాలపై స్పందిస్తూ హ్యారీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "కొందరు ఈ సంబంధాలు సర్దుమణగకూడదని కోరుకుంటున్నారు. కానీ నేను మాత్రం కుటుంబం మళ్లీ కలవాలనే గట్టిగా కోరుకుంటున్నాను. ప్రపంచంలో ఇప్పటికే ఎన్నో సమస్యలు, అలజడులు ఉన్నాయి. ఇలాంటి సమయంలో మనస్పర్థలు వీడి కుటుంబంతో రాజీ పడటమే అత్యంత కీలకమైన విషయం" అని ఆయన పేర్కొన్నారు.

అన్నదమ్ముల మధ్య గొడవలు, తల్లిదండ్రులు-పిల్లల మధ్య బంధాలు తెగిపోవడం అనేది ప్రతి సగటు కుటుంబంలోనూ కనిపించే సాధారణ విషయమేనని హ్యారీ అభిప్రాయపడ్డారు. తానూ అందరిలాంటి సగటు మనిషినేనని వ్యాఖ్యానించారు.

"మా రాజకుటుంబం ఎదుర్కొంటున్న ఈ పరిస్థితులను ప్రపంచం గమనిస్తోంది. మేము ఈ సమస్యలను ఎలా పరిష్కరించుకుంటామో చూసి, సామాన్య ప్రజలు కూడా తమ సొంత కుటుంబాల్లో ఉన్న విభేదాలను చక్కదిద్దుకునేందుకు ప్రేరణ పొందుతారని ఆశిస్తున్నాను" అని ఆయన తెలిపారు.

మానసిక గాయాలు శాశ్వతంగా ఉండిపోతాయి

కుటుంబంలో ఏర్పడిన ఈ తీవ్రమైన రచ్చ మళ్లీ మానుతుందా? అని అడిగిన ప్రశ్నకు హ్యారీ సానుకూలంగా సమాధానమిచ్చారు. "గతంలో జరిగిన ఘటనల వల్ల ఏర్పడే గాయాల మచ్చలు శరీరంపైన, మనసుపైన శాశ్వతంగా ఉండిపోతాయి. కానీ వాటిని మనం చూసే కోణం, మన ఆలోచనా విధానమే ఇక్కడ కీలకం. గతాన్ని వదిలేసి ముందుకు సాగాలని నేను అందరికీ సూచిస్తాను. గతం మన రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంటే దాన్ని వదులుకోవడం కష్టమే. కానీ ప్రపంచంలోనూ, మనుషుల జీవితాల్లోనూ ఇప్పటికే కావాల్సినంత డ్రామా ఉంది. కాబట్టి కుటుంబ సభ్యులతో ఈ వివాదాలను ఇలాగే కొనసాగించడంలో అర్థం లేదు" అని ప్రిన్స్ హ్యారీ స్పష్టం చేశారు.

అయితే, హ్యారీ చేసిన వ్యాఖ్యలు ఆయన అన్నపైగానీ, రాజకుటుంబ సభ్యులపైగానీ వేసిన విమర్శలు కావు అని, కేవలం సాధారణ కుటుంబ బంధాలను ఉద్దేశించి మాట్లాడినవని ఆయన ప్రతినిధి 'ది గార్డియన్' పత్రికకు స్పష్టత ఇచ్చారు.

రాజకుటుంబంలో రాజుకున్న వివాదాల నేపథ్యం

ప్రిన్స్ హ్యారీ, ఆయన భార్య మేఘన్ మార్కెల్ 2020లో బ్రిటిష్ రాజకుటుంబ అధికారిక బాధ్యతల నుంచి వైదొలగాలని నిర్ణయించుకోవడంతో ఈ వివాదం మొదలైంది. స్వేచ్ఛగా జీవించాలనే ఉద్దేశంతో వారు బ్రిటన్ వదిలి అమెరికాకు మకాం మార్చారు.

అనంతరం 2021లో ప్రముఖ వ్యాఖ్యాత ఓప్రా విన్‌ఫ్రేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజకుటుంబంపై వారు చేసిన ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా పెను దుమారం రేపాయి. తమ కొడుకు ఆర్చీ పుట్టకముందే, అతడి చర్మం రంగు గురించి రాజకుటుంబంలో చర్చలు జరిగాయంటూ చేసిన వ్యాఖ్యలు రాజభవన పునాదులను కదిలించాయి. దీనికితోడు 2023లో హ్యారీ రాసిన 'స్పేర్' (Spare) పుస్తకంలో అన్న విలియంతో జరిగిన శారీరక దాడి, గొడవల వివరాలను బహిర్గతం చేయడంతో విభేదాలు పరాకాష్ఠకు చేరాయి.

మళ్లీ బ్రిటన్‌కు తిరిగొచ్చిన హ్యారీ దంపతులు

అయితే, గతంలో తీవ్ర వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచిన హ్యారీ, మేఘన్ దంపతులు ఈ ఏడాది ప్రారంభంలో తిరిగి బ్రిటన్‌కు మకాం మార్చారు. బిబిసి న్యూస్ కథనం ప్రకారం... తమ పిల్లలు ఆర్చీ, లిలిబెట్‌లు ఇక్కడే బ్రిటన్ పాఠశాలలకు వెళ్తున్నారని, మళ్లీ తమ సొంత దేశానికి తిరిగి రావడం ఎంతో సంతోషంగా ఉందని డ్యూక్ ఆఫ్ సస్సెక్స్ ఇటీవలే హర్షం వ్యక్తం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో కుటుంబంతో కలిసిపోవడానికి హ్యారీ సుముఖత చూపడం ప్రాధాన్యత సంతరించుకుంది.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More