జంతర్ మంతర్ వద్ద జాతీయ జెండా ఎగురవేస్తే నేరమా?: రాహుల్ గాంధీ
శాంతియుతంగా నిరసన తెలుపుతూ జంతర్ మంతర్ వద్ద త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించడం నేరం కాదని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. కాక్రోచ్ జనతా పార్టీ (సిజేపీ) నాయకులను అరెస్ట్ చేసి జైలుకు పంపడాన్ని పిరికిపంద చర్యగా ఆయన అభివర్ణించారు.
న్యూఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతూ జాతీయ జెండా ఎగురవేస్తే అది నేరం కాదని, అందుకోసం యువతను జైల్లో పెట్టడం పిరికిపంద చర్య అని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. ప్రధాన ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ జంతర్ మంతర్ ప్రాంగణంలోకి ప్రవేశించిన కాక్రోచ్ జనతా పార్టీ (సిజేపీ) నాయకులు సౌరవ్ దాస్, అశుతోష్ రంకాలకు ఐదు రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించిన నేపథ్యంలో రాహుల్ గాంధీ ఆ పార్టీకి బహిరంగంగా మద్దతు తెలిపారు.

ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారు: రాహుల్ గాంధీ
ఈ అంశంపై సోషల్ మీడియా వేదిక 'ఎక్స్' (X) ద్వారా స్పందించిన రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. "శాంతియుత నిరసనలో జంతర్ మంతర్ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తే అది నేరం కాదు. దీనికి యువతను జైలుకు పంపడం భీరుత్వ చర్య. విద్యార్థులు, యువత, విలేకరులు, 'ఇండియా' కూటమి.. అందరి జెండాలు వేరైనా లక్ష్యం ఒక్కటే. పౌరులు తమ రాజ్యాంగబద్ధమైన హక్కులను డిమాండ్ చేస్తూ చేపడుతున్న నిరసనలన్నీ ఒక్కటే. జంతర్ మంతర్ భారత ప్రజలది, దానిని మేము తిరిగి సాధించుకుంటాం" అని ఆయన పేర్కొన్నారు.
ఐదు రోజుల జ్యుడీషియల్ కస్టడీ
జంతర్ మంతర్‌ను నిరసన ప్రదేశాల జాబితా నుంచి తొలగిస్తూ ఢిల్లీ పోలీసులు సర్క్యులర్ జారీ చేసిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం సిజేపీ కో-కన్వీనర్లు సౌరవ్ దాస్, అశుతోష్ రంకాతో పాటు మరో 12 మంది నాయకులు నిషేధాన్ని ఉల్లంఘించి జంతర్ మంతర్ చేరుకొని జాతీయ జెండా ఎగురవేశారు.
దీంతో పోలీసులు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా, పార్టీ జాతీయ సంస్థాగత ఇన్చార్జ్ అజింక్యా షిండేలను అదుపులోకి తీసుకున్నారు. బుధవారం ఉదయం మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్‌లోని స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఎదుట వీరిని హాజరుపరచగా, దాస్, రంకాలను ఐదు రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. కాగా, అజింక్యా షిండే వ్యక్తిగత బాండ్ సమర్పించడంతో ఆయనను విడుదల చేశారు.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


