...
...
Next Story

రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడనుందా? లోక్‌సభలో బీజేపీ ఎంపీ సంచలన ప్రతిపాదన

లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సబ్‌స్టాంటివ్ మోషన్ ప్రవేశపెట్టారు. రాహుల్ దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని, విదేశీ శక్తులతో చేతులు కలిపారని ఆయన ఆరోపించారు. ఆ వివరాలు ఇవే.

Published on: Feb 12, 2026, 15:39:04 IST
Advertisement

లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీకి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ఆయనపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే గురువారం సంచలన ప్రతిపాదన చేశారు. రాహుల్ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయడమే కాకుండా, ఆయనపై జీవితకాలం ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని కోరుతూ ‘సబ్‌స్టాంటివ్ మోషన్’ (Substantive Motion) దాఖలు చేశారు.

అసలేమిటీ సబ్‌స్టాంటివ్ మోషన్?

రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడనుందా? లోక్‌సభలో బీజేపీ ఎంపీ సంచలన ప్రతిపాదన (Sansad Tv)
రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడనుందా? లోక్‌సభలో బీజేపీ ఎంపీ సంచలన ప్రతిపాదన (Sansad Tv)

సాధారణంగా పార్లమెంటులో ఏదైనా ఒక ముఖ్యమైన అంశంపై సభ నిర్ణయాన్ని లేదా అభిప్రాయాన్ని కోరుతూ ప్రవేశపెట్టే స్వతంత్ర అధికారిక ప్రతిపాదనను ‘సబ్‌స్టాంటివ్ మోషన్’ అంటారు. దీనిపై చర్చ జరిగిన తర్వాత సభ ఒక నిర్దిష్ట నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుంది.

నిషికాంత్ దూబే ఆరోపణలు ఏమిటి?

రాహుల్ గాంధీ వ్యవహారశైలిపై నిషికాంత్ దూబే తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

"జార్జ్ సోరోస్ వంటి శక్తుల అండతో రాహుల్ గాంధీ దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. మన దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా ఆయన తీరు ఉంది. అందుకే ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయడమే కాకుండా, భవిష్యత్తులో మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాల నిషేధం విధించాలని నేను లోక్‌సభలో ప్రతిపాదించాను" అని దూబే వార్తా సంస్థ ఏఎన్ఐ (ANI) తో పేర్కొన్నారు.

అంతకుముందు రోజు సభలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ కేంద్ర ప్రభుత్వంపై చేసిన విమర్శలే ఈ పరిణామాలకు కారణమయ్యాయి. అయితే, ప్రభుత్వం రాహుల్ పై 'ప్రివిలేజ్ మోషన్' (సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం) వేసే ఆలోచనలో లేదని, దానికి బదులుగా ఆయన ప్రసంగంలోని వివాదాస్పద అంశాలను రికార్డుల నుంచి తొలగించాలని కోరాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

రాహుల్ గాంధీ చేసిన విమర్శలు ఇవే..

"ప్రస్తుతం ప్రపంచం ఒక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇంధనం, ఆర్థిక వ్యవస్థలను ఇతర దేశాలు ఆయుధాలుగా వాడుకుంటున్నాయని మీరే స్వయంగా ఒప్పుకుంటున్నారు. కానీ అమెరికా అవే అస్త్రాలను మనపై ప్రయోగిస్తున్నా మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు?" అని రాహుల్ ప్రశ్నించారు.

ముఖ్యంగా ఇంధన భద్రత గురించి మాట్లాడుతూ.. "ఫలానా దేశం నుంచి చమురు కొనకూడదని అమెరికా చెబితే మనం వినాలా? అంటే మన ఇంధన భద్రతను విదేశీ శక్తులు నియంత్రిస్తున్నాయన్నమాట. దీనిపై మీకు సిగ్గుగా అనిపించడం లేదా? మీరు భారత్ ప్రయోజనాలతో రాజీ పడుతున్నారు" అని ఆయన ధ్వజమెత్తారు.

దిగుమతి సుంకాలపై ఆందోళన

భారతదేశంలో సగటు దిగుమతి సుంకాలు (Tariffs) 3 శాతం నుండి ఏకంగా 18 శాతానికి పెరిగాయని, ఇది ఆరు రెట్ల పెరుగుదల అని రాహుల్ గుర్తు చేశారు. ఇదే సమయంలో అమెరికా నుండి వచ్చే దిగుమతులు 46 బిలియన్ డాలర్ల నుంచి 146 బిలియన్ డాలర్లకు పెరిగే అవకాశం ఉందన్నారు. మనకు ఎలాంటి గ్యారంటీలు లభించకుండానే ప్రతి ఏటా సుమారు 100 బిలియన్ డాలర్ల దిగుమతులను పెంచుకోవడానికి ఒప్పుకోవడం హాస్యాస్పదమని ఆయన విమర్శించారు.

రాహుల్ ప్రసంగం సభలో సెగలు పుట్టించగా, దానికి కౌంటర్‌గా బీజేపీ ఈ మోషన్‌ను తీసుకురావడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe