యువకుడిని కిడ్నాప్ చేసి, బీరు సీసాలో మూత్రం తాగించారు- వీడియో తీసి..
భోపాల్‌కు చెందిన సోను అనే 18 ఏళ్ల యువకుడిపై రాజస్థాన్‌లోని ఝాలావాడ్ జిల్లాలో అమానుష దాడి జరిగింది. ప్రేమ వ్యవహారమే కారణమని భావిస్తున్న ఈ ఘటనలో నిందితులు బాధితుడికి మూత్రం తాగించి, ఆ దారుణాన్ని వీడియో తీశారు.
చట్టం కళ్లుగప్పి కొందరు వ్యక్తులు ఎంతటి కిరాతకానికి ఒడిగడతారో చెప్పేందుకు ఈ ఘటనే నిదర్శనం. రాజస్థాన్‌లో వెలుగుచూసిన ఈ అమానుష ఉదంతం ఇప్పుడు మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలను ఉలిక్కిపడేలా చేసింది. సభ్య సమాజం తలదించుకునేలా ఒక యువకుడిని బంధించి, చిత్రహింసలు పెట్టడమే కాకుండా, అత్యంత అవమానకరంగా మూత్రం తాగించిన ఈ ఘటన కలకలం రేపుతోంది.

అసలేం జరిగింది?
భోపాల్‌లోని కోలార్ ప్రాంతానికి చెందిన 18 ఏళ్ల సోనుకు రాజస్థాన్ ఝాలావాడ్ జిల్లా పులోరో గ్రామానికి చెందిన ఒక యువతితో పరిచయం ఉంది. వీరిద్దరి మధ్య ఉన్న సంబంధం కారణంగా.. దాదాపు 15 రోజుల క్రితం ఆ యువతి ఇల్లు వదిలి భోపాల్ చేరుకుని సోనును కలిసింది.
అయితే, కుటుంబ సభ్యులు జోక్యం చేసుకోవడంతో ఆమె తిరిగి రాజస్థాన్‌కు వెళ్లిపోయింది.
ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. తనను కలవడానికి రావాలంటూ ఆ యువతి నుంచి సోనుకు ఫోన్ వచ్చింది. అది తనను చిత్రహింసలు పెట్టడానికి వేసిన పన్నాగమని ఊహించని ఆ యువకుడు, ఆమెను నమ్మి పులోరో గ్రామానికి వెళ్లాడు. తీరా అక్కడికి చేరుకోగానే యువతి కుటుంబ సభ్యులు అతడిని కిడ్నాప్ చేశారు.
మూడు రోజుల నరకం..
సోనును ఒక గదిలో బంధించిన నిందితులు మూడు రోజుల పాటు అతనిపై విచక్షణారహితంగా దాడి చేశారు. కాలితో తన్నుతూ, పిడిగుద్దులు కురిపిస్తూ నరకం చూపించారు.
అంతటితో వారి కోపం తగ్గలేదు! సోనును మానసికంగా కుంగదీయాలనే ఉద్దేశంతో ఒక బీరు సీసాలో మూత్రం నింపి, బలవంతంగా అతని చేత తాగించారు. ఈ పైశాచికత్వాన్నంతటినీ వీడియో తీసి వికృతానందం పొందారు.
వీడియోతో బెదిరింపులు..
ఆ ఘోరమైన వీడియోను నిందితులు భోపాల్‌లోని సోను కుటుంబ సభ్యులకు పంపారు. అది చూసి ఆందోళన చెందిన బాధితుడి కుటుంబం వెంటనే కోలార్ పోలీసులను ఆశ్రయించింది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు.
"ఈ దారుణం రాజస్థాన్‌లో జరిగినట్లు ప్రాథమికంగా గుర్తింము. బాధితుడి ప్రాణాలకు రక్షణ కల్పించడమే మా మొదటి ప్రాధాన్యత. ఇందుకోసం ఒక ప్రత్యేక బృందాన్ని రాజస్థాన్‌కు పంపాము. ప్రస్తుతం రాజస్థాన్ పోలీసులతో నిరంతరం సమన్వయం చేసుకుంటున్నాం. బాధితుడి స్టేట్‌మెంట్ రికార్డ్ చేసి, వీడియోను ఫోరెన్సిక్ పరిశీలనకు పంపాము. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాము," అని ఇన్‌స్పెక్టర్ సంజయ్ సోనీ వెల్లడించారు.
ప్రస్తుతం పోలీసులు నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు. కిడ్నాప్, అక్రమ నిర్బంధం, హత్యాయత్నం, బెదిరింపులతో పాటు అమానవీయ చర్యలకు పాల్పడినందుకు నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయనున్నారు.
ఈ ఘటనలో ఇతర కోణాల్లో కూడా దర్యాప్తు కొనసాగుతోంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


