Today bank holiday : నేడు రక్షాబంధన్- మరి బ్యాంకులకు సెలవు ఉందా? ఇక్కడ తెలుసుకోండి..
పలు ప్రాంతీయ పండుగలు, విశిష్ట దినాల కారణంగా ఆగస్టు 28న దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెలవు ప్రకటించింది. అయితే హైదరాబాద్, దిల్లీ వంటి నగరాల్లో బ్యాంకులు యథాతథంగా పనిచేస్తాయి.
మీరు ఇవాళ ఏదయినా పనిపై బ్యాంకు బ్రాంచ్‌కు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే ముందుగా ఆర్బీఐ విడుదల చేసిన హాలిడే క్యాలెండర్‌ను తనిఖీ చేయడం చాలా అవసరం. మన దేశంలో బ్యాంకు సెలవులనేవి అన్ని రాష్ట్రాల్లో ఒకేలా ఉండవు. ఆయా రాష్ట్రాల సంస్కృతి, ప్రాంతీయ పండుగలను బట్టి ఆర్బీఐ సెలవులను ఖరారు చేస్తుంది. ఈ క్రమంలోనే ఆగస్టు 28న (శుక్రవారం) దేశవ్యాప్తంగా పలు కీలక నగరాల్లో బ్యాంకులకు సెలవు లభించింది.

తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటి? ఎక్కడెక్కడ బంద్?
రక్షాబంధన్, పంగ్-లాబ్‌సోల్, ఈద్-ఏ-మిలాద్ తర్వాతి శుక్రవారం, శ్రీనారాయణ గురు జయంతి, అయ్యన్‌కాళి జయంతి వంటి సందర్భాలను పురస్కరించుకుని పలు రాష్ట్రాల్లో స్థానిక సెలవు అమల్లో ఉంది. దీనితో అహ్మదాబాద్, భోపాల్, డెహ్రాడూన్, గ్యాంగ్‌టక్, జమ్మూ, జైపూర్, కాన్పూర్, కొచ్చి, లక్నో, రాయ్‌పూర్, షిమ్లా, శ్రీనగర్, తిరువనంతపురం నగరాల్లో శుక్రవారం బ్యాంకింగ్ సేవలు నిలిచిపోయాయి.
అయితే తెలుగు రాష్ట్రాల ప్రజలకు, వ్యాపారులకు ఊరట లభించింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంతో పాటు ముంబై, దిల్లీ, బెంగళూరు, ఛండీగఢ్ వంటి ప్రధాన మెట్రో నగరాల్లో నేడు బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయి.
సెలవు ఉన్న ప్రాంతాల్లో నగదు డిపాజిట్లు, విత్‌డ్రాలు, చెక్కుల క్లియరెన్స్ వంటి ప్రత్యక్ష సేవలు బ్రాంచీలలో లభించవు. కాకపోతే యూపీఐ, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఏటీఎం వంటి డిజిటల్ సేవలు ఎలాంటి అంతరాయం లేకుండా 24 గంటలూ అందుబాటులో ఉంటాయి.
రేపు (ఆగస్టు 29) బ్యాంకులు తెరిచి ఉంటాయా?
చాలామందికి నెలలో ఐదో శనివారం వస్తే బ్యాంకులు పనిచేస్తాయా లేదా అన్న సందేహం ఉంటుంది. నియమాల ప్రకారం ఆర్బీఐ కేవలం 2వ, 4వ శనివారాలలో మాత్రమే బ్యాంకింగ్ రంగానికి సెలవు ఇస్తుంది. ఆగస్టు 29వ తేదీ.. ఈ నెలలోని '5వ శనివారం' కావడం వల్ల దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు సాధారణ పనివేళల్లో తెరిచి ఉంటాయి.
బ్యాంకుల పనివేళలు ఎలా ఉన్నాయి?
దేశంలోని వివిధ బ్యాంకులు వేర్వేరు సమయాల్లో సేవలు అందిస్తున్నాయి:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా: ఉదయం 10:00 గంటల నుంచి సాయంత్రం 4:00 గంటల వరకు పనిచేస్తాయి.
ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్, కోటక్ మహీంద్రా, యస్ బ్యాంక్: ఉదయం 9:30 నుంచి సాయంత్రం 3:30 లేదా 4:30 గంటల వరకు కస్టమర్ సేవలు అందిస్తాయి.
బ్యాంక్ ఆఫ్ బరోడా: ఉదయం 9:45 నుంచి సాయంత్రం 4:45 వరకు నడుస్తుంది.
కెనరా బ్యాంక్: ఉదయం 10:00 నుంచి సాయంత్రం 3:30 వరకు అందుబాటులో ఉంటుంది.
వారానికి 5 రోజుల పనిదినాల కోసం నిరసనలు!
ప్రస్తుతం నెలలో రెండు శనివారాలు సెలవులు ఇస్తుండగా, మిగిలిన శనివారాలను కూడా సెలవులుగా ప్రకటించి వారానికి 5 రోజుల పని విధానాన్ని తక్షణమే అమలు చేయాలని యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) గట్టిగా డిమాండ్ చేస్తోంది.
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఆఫీసులు, ఆర్బీఐ, ఎల్‌ఐసీ, స్టాక్ మార్కెట్లు వారానికి ఐదు రోజులే పనిచేస్తున్నాయని బ్యాంకు ఉద్యోగులు గుర్తుచేస్తున్నారు. శనివారాలు సెలవు ఇస్తే పని ఒత్తిడి తగ్గి ఉద్యోగుల సామర్థ్యం పెరుగుతుందని, కుటుంబంతో గడపడానికి సమయం దొరుకుతుందని వారు చెప్తున్నారు. ఖాతాదారులకు ఇబ్బంది కలగకుండా సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజుకు 40 నిమిషాల అదనపు సమయం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని యూనియన్లు ప్రతిపాదించాయి. తమ డిమాండ్లను పట్టించుకోకపోతే సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో సమ్మెకు దిగుతామని యూనియన్లు ప్రకటించాయి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


