...
...
Next Story

డెబిట్, క్రెడిట్ కార్డుల నిబంధనలు ఏకీకృతం.. ఆర్బీఐ కొత్త ఫ్రేమ్‌వర్క్

డెబిట్, క్రెడిట్, ప్రీపెయిడ్ కార్డుల లావాదేవీలపై ఉన్న 25 సర్క్యులర్లను ఆర్బీఐ ఒకే నియంత్రణ చట్రంలోకి తెచ్చింది. 2026 నవంబరు 27న జారీ చేసిన ఈ మార్గదర్శకాలు వెంటనే అమల్లోకి వచ్చాయి. కార్డుల భద్రత, టోకనైజేషన్, ఎండీఆర్ పరిమితుల వంటి అంశాలను ఇందులో పొందుపరిచారు.

Published on: Nov 27, 2026, 19:48:07 IST
Advertisement

డెబిట్, క్రెడిట్, ప్రీపెయిడ్ కార్డుల లావాదేవీలకు సంబంధించిన నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరింత సులభతరం చేసింది. ఇప్పటివరకు అమల్లో ఉన్న 25 సర్క్యులర్లను కలిపి ఒకే నియంత్రణ చట్రంలోకి తెచ్చింది. వివిధ సందర్భాల్లో జారీ చేసిన అనేక ఆదేశాలను వేర్వేరుగా చూడాల్సిన అవసరం లేకుండా ఈ చర్య తీసుకుంది.

డెబిట్, క్రెడిట్ కార్డుల నిబంధనలు ఏకీకృతం.. ఆర్బీఐ కొత్త ఫ్రేమ్‌వర్క్
డెబిట్, క్రెడిట్ కార్డుల నిబంధనలు ఏకీకృతం.. ఆర్బీఐ కొత్త ఫ్రేమ్‌వర్క్

దేశంలో డిజిటల్ చెల్లింపులు వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో నిబంధనల అమలులో స్పష్టత కోసం ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. 'రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (డిజిటల్ చెల్లింపులు – కార్డు ఆధారిత లావాదేవీలు) మార్గదర్శకాలు, 2026' పేరుతో 2026 నవంబరు 27న వీటిని విడుదల చేసింది.

కార్డు వినియోగదారులకు ఈ నోటిఫికేషన్ ద్వారా కొత్తగా లావాదేవీల పరిమితులు, అదనపు ధ్రువీకరణ నిబంధనలు లేదా కొత్త సదుపాయాలు ఏమీ ప్రకటించలేదు. ఇప్పటికే ఉన్న నియమాలను ఒకే పత్రంలోకి చేర్చి, అందరికీ సులభంగా అందుబాటులో ఉండేలా రూపొందించారు.

జారీ చేసిన రోజు నుంచే ఈ మార్గదర్శకాలు అమల్లోకి వచ్చాయి. బ్యాంకులు, బ్యాంకేతర సంస్థలతో సహా చెల్లింపు వ్యవస్థ నిర్వాహకులు, భాగస్వాములకు ఇవి వర్తిస్తాయి.

ఐదు ప్రధాన అంశాల చుట్టూ నిబంధనలు

ఇప్పటివరకు ఉన్న సూచనలను ఆర్బీఐ ఐదు విస్తృత అంశాలుగా విభజించింది. భద్రత నుంచి ఛార్జీల వరకు కీలక నిబంధనలను ఇందులో పొందుపరిచారు.

  • కార్డు భద్రత, ధ్రువీకరణ: ఈఎంవీ చిప్ ఆధారిత కార్డులు, కార్డు లావాదేవీల వద్ద పిన్, బయోమెట్రిక్ ధ్రువీకరణ నిబంధనలను యథాతథంగా ఉంచారు. రూ.5,000 వరకు అర్హత కలిగిన కాంటాక్ట్‌లెస్ లావాదేవీలకు అదనపు ధ్రువీకరణ నుంచి ఉన్న మినహాయింపును కూడా ఇందులో చేర్చారు.
  • కార్డు వినియోగ నియంత్రణలు: ఆన్‌లైన్, అంతర్జాతీయ, కాంటాక్ట్‌లెస్ చెల్లింపులతో సహా వివిధ లావాదేవీల మార్గాలను యాక్టివేట్ లేదా డీయాక్టివేట్ చేసుకునే సౌకర్యాన్ని ఖాతాదారులకు బ్యాంకులు కల్పించాలి. లావాదేవీల పరిమితులను మార్చుకునే అవకాశం కూడా వినియోగదారులకు ఉండాలి.
  • క్రెడిట్ కార్డు నెట్‌వర్క్ ఎంపిక: అర్హత కలిగిన క్రెడిట్ కార్డు జారీ సంస్థలు వినియోగదారులకు కార్డు నెట్‌వర్క్ ఎంచుకునే అవకాశం ఇవ్వాలన్న నిబంధనను చేర్చారు. అయితే 10 లక్షలు లేదా అంతకంటే తక్కువ యాక్టివ్ కార్డులు ఉన్న సంస్థలకు, సొంతంగా గుర్తింపు పొందిన కార్డు నెట్‌వర్క్‌లు నడిపే సంస్థలకు ఇది వర్తించదు.

టోకనైజేషన్, మర్చంట్ డిస్కౌంట్ రేట్లు

కొత్త మార్గదర్శకాల జారీతో కార్డు చెల్లింపులకు సంబంధించిన పాత 25 ఆర్బీఐ సర్క్యులర్లను రద్దు చేశారు. 2011 నుంచి 2024 మధ్య కార్డు భద్రత, ధ్రువీకరణ, టోకనైజేషన్, కార్డు డేటా నిల్వపై ఆంక్షలు, ఎండీఆర్, క్రెడిట్ కార్డు నెట్‌వర్క్ ఏర్పాట్లపై ఇచ్చిన ఆదేశాలు వీటిలో ఉన్నాయి.

అయితే పాత సర్క్యులర్ల కింద ఇచ్చిన ఆమోదాలు, చర్యలు, గుర్తింపులు యథాతథంగా చెల్లుబాటు అవుతాయి. వాటిని కొత్త ఏకీకృత మార్గదర్శకాల కింద మంజూరు చేసినట్లుగా పరిగణిస్తారు. పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ చట్టం, 2007లోని సెక్షన్ 18, సెక్షన్ 10(2) కింద ఈ ఆదేశాలను ఆర్బీఐ జారీ చేసింది.

 

ABOUT THE AUTHOR

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks