RBI rate cut : వడ్డీ రేట్లను కట్ చేసిన ఆర్బీఐ- జీడీపీ వృద్ధి రేటు అంచనా పెంపు..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఫలితంగా రెపో రేటు 25 బేసిస్ పాయింట్లు తగ్గి 5.25శాతానికి చేరింది. ఈ మేరకు మానిటరీ పాలసీ సమావేశం అనంతరం ఆర్బీఐ గవర్నర్ కీలక ప్రకటన చేశారు.
వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారం ఉదయం ప్రకటించింది. ఫలితంగా రెపో రేటు 5.5శాతం నుంచి 5.25శాతానికి దిగొచ్చింది. ఈ మేరకు మూడు రోజుల ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ సమావేశం అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు.

ద్రవ్యోల్బణం 4శాతం కంటే చాలా తక్కువగా ఉన్నందున, శుక్రవారం ఆర్బీఐ తన బెంచ్‌మార్క్ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 5.25%కి తీసుకువస్తుందని బ్లూమ్‌బెర్గ్ సర్వే చేసిన 44 మంది ఆర్థికవేత్తల్లో ఎక్కువ మంది అంచనా వేశారు. అయితే భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతుండటం, రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే 90 స్థాయి కంటే దిగువకు పడిపోయి రికార్డు కనిష్టానికి చేరడం వంటి కారణాల వల్ల ఆర్బీఐ రేట్లను యథాతథంగా ఉంచే అవకాశం కూడా ఉందని సిటీ గ్రూప్ ఇంక్, స్టాండర్డ్ చార్టర్డ్ పీఎల్‌సీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి సంస్థలు అంచనా వేశాయి.
చివరికి ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్టు నిర్ణయించింది.
ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ కీలక నిర్ణయాలు..
డిసెంబర్ 3 నుంచి 5 వరకు జరిగిన ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశంలో భారతదేశ కేంద్ర బ్యాంక్ తీసుకున్న ముఖ్య నిర్ణయాల వివరాలు:
ఆర్బీఐ బెంచ్‌మార్క్ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 5.25%కి చేసింది.
మానిటరీ పాలసీ వైఖరిని తటస్థంగా కొనసాగించింది.
భారతదేశ జీడీపీ వృద్ధి రేటును గతంలో అంచనా వేసిన 6.8% నుంచి 7.3%కి పెంచింది!
ఎఫ్వై26లో భారతదేశ ద్రవ్యోల్బణం రేటును గతంలో అంచనా వేసిన 2.6% నుంచి 2%కి తగ్గించింది.
గత రెండు ద్రవ్య విధాన సమావేశాల్లో రెపో రేటును మార్చకుండా ఉంచిన ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా, గత నెలలో రెపో రేటు తగ్గింపులకు "ఖచ్చితంగా అవకాశం ఉంది" అని చెప్పారు. అయితే, అప్పటి నుంచి వెలువడిన అధికారిక డేటా ప్రకారం.. అమెరికా విధించిన 50శాతం సుంకాలను ఎదుర్కొంటూ కూడా భారత ఆర్థిక వ్యవస్థ స్థితిస్థాపకతను ప్రదర్శిస్తుందని వెల్లడైంది. మరోవైపు, రూపాయి విలువ భారీగా పడిపోయింది.
దీని ఫలితంగా, ఆర్బీఐ రెపో రేటు కోత అంచనాలు మసకబారినట్లుగా కనిపిస్తున్నాయని, కేంద్ర బ్యాంక్ సుదీర్ఘ విరామం దశలోకి ప్రవేశిస్తున్నట్లు అనిపిస్తోందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్, ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యుడు సౌమ్య కాంతి ఘోష్ పేర్కొన్నారు.
గత ఎంపీసీ సమావేశం జరిగినప్పటి నుంచి రూపాయి విలువ పడిపోవడం శుక్రవారం నాటి నిర్ణయాన్ని మరింత ఊహించలేనిదిగా చేసింది! భారతదేశం-యూఎస్ వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో, ఈ వారం డాలర్‌కు 90 స్థాయిని దాటేసింది.
ఫ్లాట్‌గా స్టాక్ మార్కెట్..
ఆర్బీఐ మొనేటరీ పాలసీ సమావేశం నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి. ఉదయం 10 గంటలకు నిఫ్టీ50 20 పాయింట్ల నష్టంతో 26,007 వద్ద ట్రేడ్ అవుతోంది. బ్యాంక్ నిఫ్టీ 126 పాయింట్లు పెరిగి 59,414 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ 47 పాయింట్ల నష్టంతో 85,219 వద్ద ట్రేడ్ అవుతోంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


