సైబర్ మోసాలకు చెక్.. బ్యాంక్ ఖాతాలకు ఆర్‌బీఐ 'స్టాప్ స్విచ్' రక్షణ

డిజిటల్ మోసాల నుంచి ఖాతాదారులను రక్షించేందుకు ఆర్‌బీఐ కొత్త ముసాయిదా నిబంధనలను ప్రతిపాదించింది. అత్యవసర సమయంలో లావాదేవీలను ఆపే 'స్టాప్ స్విచ్', పరిమితుల నియంత్రణ, భారీ బదిలీలకు నమ్మకమైన వ్యక్తి ఆమోదం వంటి కీలక మార్పులను తీసుకురానుంది.

Published on: Nov 23, 2026, 20:57:24 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

దేశంలో డిజిటల్ చెల్లింపుల వినియోగం పెరుగుతున్న కొద్దీ సైబర్ మోసాలు కూడా అదే స్థాయిలో కలకలం రేపుతున్నాయి. ఈ తరహా ఆర్థిక నేరాల నుంచి బ్యాంకు ఖాతాదారులకు రక్షణ కల్పించేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) నడుం బిగించింది. ఖాతాదారుల చేతికే మరింత నియంత్రణ ఇస్తూ, మోసపూరిత డిజిటల్ లావాదేవీలను అడ్డుకునేందుకు కొత్త రక్షణ కవచాలను ప్రతిపాదించింది. అత్యవసర సమయంలో చెల్లింపులను నిలిపివేసే 'స్టాప్ స్విచ్' సదుపాయం, ఖాతాదారులే స్వయంగా నిర్ణయించుకునే లావాదేవీల పరిమితులు, భారీ నగదు బదిలీలకు 'నమ్మకమైన వ్యక్తి' (ట్రస్టెడ్ పర్సన్) ఆమోదం వంటి విప్లవాత్మక మార్పులను తీసుకురానుంది.

సైబర్ మోసాలకు చెక్.. బ్యాంక్ ఖాతాలకు ఆర్‌బీఐ 'స్టాప్ స్విచ్' రక్షణ
సైబర్ మోసాలకు చెక్.. బ్యాంక్ ఖాతాలకు ఆర్‌బీఐ 'స్టాప్ స్విచ్' రక్షణ

బాధ్యతాయుతమైన వ్యాపార నిర్వహణ (రెస్పాన్సిబుల్ బిజినెస్ కండక్ట్) ఆదేశాలకు సవరణలు చేస్తూ ఆర్‌బీఐ ఈ ముసాయిదా నిబంధనలను విడుదల చేసింది. ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ మోసాలను నివారించడంలో బ్యాంకుల జవాబుదారీతనాన్ని పెంచడం కూడా ఈ ప్రతిపాదనల ప్రధాన ఉద్దేశం. ప్రస్తుతం ఇవి ముసాయిదా దశలోనే ఉన్నాయి. వీటిపై ప్రజలు, సంబంధిత వర్గాల అభిప్రాయాలను డిసెంబర్ 14, 2026 వరకు ఆర్‌బీఐ ఆహ్వానిస్తోంది. తుది నిబంధనలు ఖరారైతే, ఈ రక్షణ చర్యలు జులై 1, 2027 నుంచి అమల్లోకి వస్తాయి. బ్యాంకులు కోరుకుంటే అంతకంటే ముందే వీటిని అమలు చేసే వెసులుబాటు ఉంది.

అసలేమిటీ 'స్టాప్ స్విచ్'? ఎలా పనిచేస్తుంది?

తమ బ్యాంకు ఖాతా, లాగిన్ వివరాలు లేదా డిజిటల్ చెల్లింపుల యాక్సెస్ హ్యాకర్ల చేతికి చిక్కిందని ఖాతాదారులు అనుమానించినప్పుడు ఈ 'స్టాప్ స్విచ్' అత్యవసర బ్రేక్‌లా పనిచేస్తుంది. వేర్వేరు చెల్లింపు మార్గాలను బ్లాక్ చేయడానికి బ్యాంకు చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, ఒకే ఒక్క క్లిక్‌తో ఖాతా నుంచి బయటకు వెళ్లే (అవుట్‌గోయింగ్ డెబిట్) అన్ని రకాల లావాదేవీలను తక్షణమే నిలిపివేయవచ్చు.

స్టాప్ స్విచ్ ఆన్ చేసిన తర్వాత ఖాతా నుంచి కొత్తగా నగదు బదిలీ చేయడం, కొత్త పేమెంట్ మాండేట్‌లు సృష్టించడం, స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్లు ఇవ్వడం సాధ్యం కాదు. కొత్త థర్డ్-పార్టీ యాప్‌లలో యూపీఐ (UPI) రిజిస్ట్రేషన్ కూడా ఆగిపోతుంది. అయితే, దీనివల్ల బ్యాంకు ఖాతా పూర్తిగా ఫ్రీజ్ కాదు. ఖాతాలోకి వచ్చే నగదు (ఇన్‌కమింగ్ పేమెంట్స్) యథావిధిగా జమ అవుతుంది. ఇప్పటికే ఉన్న ఆటో-డెబిట్ మాండేట్‌లు, రుణ వాయిదాలు (ఈఎంఐలు), బ్యాంక్ ఛార్జీల వంటి వాటికి ఎలాంటి ఆటంకం కలగదు. ఖాతాదారులు సరైన ధ్రువీకరణ ప్రక్రియ పూర్తి చేసి దీనిని తిరిగి డీయాక్టివేట్ చేసుకోవచ్చు. చెల్లింపులను పునరుద్ధరించే ముందు బ్యాంకులు కొంత కూలింగ్-ఆఫ్ సమయాన్ని లేదా అదనపు భద్రతా చర్యలను అమలు చేసే అవకాశం ఉంది.

లావాదేవీల పరిమితులు మీ చేతుల్లోనే..

బ్యాంకులు విధించే పరిమితులపైనే ఆధారపడకుండా, ఖాతాదారులే తమ అవసరాలకు తగ్గట్టుగా డిజిటల్ లావాదేవీల పరిమితులను మార్చుకునే వెసులుబాటును ఆర్‌బీఐ ప్రతిపాదించింది. ముసాయిదా నిబంధనల ప్రకారం ఒక్కో లావాదేవీకి గరిష్ఠ పరిమితి, నిర్దిష్ట వ్యక్తికి (బెనిఫిషియరీ) రోజువారీ పరిమితి, వివిధ చెల్లింపు మాధ్యమాలకు వేర్వేరుగా రోజువారీ పరిమితులను ఖాతాదారులే సెట్ చేసుకోవచ్చు. అన్ని డిజిటల్ మార్గాలకు కలిపి ఒక ఉమ్మడి రోజువారీ పరిమితిని కూడా పెట్టుకోవచ్చు. రోజులో ఏ సమయంలో ఏ చెల్లింపు మార్గాలు పనిచేయకూడదో సమయ పరిమితిని (టైమ్ విండో) కూడా నిర్ణయించుకోవచ్చు.

ఉదాహరణకు, ఒక వ్యక్తికి రోజుకు గరిష్ఠంగా లక్ష రూపాయలు పంపేందుకు బ్యాంకు అనుమతి ఉన్నా, ఖాతాదారుడు ఆ పరిమితిని రూ.20,000కు తగ్గించుకోవచ్చు. అలాగే ఒక నిర్దిష్ట చెల్లింపు మార్గంలో ఒక్కో లావాదేవీకి రూ.10,000 గరిష్ఠ పరిమితిని విధించుకోవచ్చు. డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, ప్రీపెయిడ్ కార్డులకు కూడా ఈ నియంత్రణలు వర్తిస్తాయి. దేశీయ, అంతర్జాతీయ లావాదేవీలను ఆన్ లేదా ఆఫ్ చేసుకోవడంతో పాటు ఏటీఎం (ATM), పీఓఎస్ (POS), ఆన్‌లైన్, కాంటాక్ట్‌లెస్ చెల్లింపులకు వేర్వేరుగా పరిమితులు పెట్టుకోవచ్చు. కొత్తగా ఖాతా తెరిచే ఖాతాదారులకు డిజిటల్ చెల్లింపుల సదుపాయాలను బ్యాంకులు ప్రారంభంలో నిలిపివేసి (డిసేబుల్) ఉంచాలి. ఖాతాదారులు స్పష్టమైన అనుమతి ఇచ్చి, ధ్రువీకరణ పూర్తి చేసిన తర్వాతే వాటిని యాక్టివేట్ చేయాలి.

భారీ బదిలీలకు 'నమ్మకమైన వ్యక్తి' ఆమోదం తప్పనిసరి

ఆర్‌బీఐ ప్రతిపాదించిన మరో కీలక సంస్కరణ 'ట్రస్టెడ్ పర్సన్ మెకానిజం' (టీపీఎం). దీని ద్వారా ఖాతాదారులు 18 ఏళ్లు నిండిన తమకు అత్యంత నమ్మకమైన వ్యక్తిని నామినేట్ చేసుకోవచ్చు. భారీ మొత్తంలో నగదు బదిలీ చేసేటప్పుడు ఈ వ్యక్తి అదనపు భద్రతా వలయంగా (అథెంటికేషన్) వ్యవహరిస్తారు. ఇది పూర్తిగా స్వచ్ఛంద సదుపాయం. బ్యాంకు శాఖకు వెళ్లి లేదా డిజిటల్ మార్గాల ద్వారా నమ్మకమైన వ్యక్తిని నామినేట్ చేసుకోవచ్చు. అధికారిక గుర్తింపు పత్రాల ద్వారా బ్యాంకులు ఆ వ్యక్తి వివరాలను ధ్రువీకరిస్తాయి. ఎంత మొత్తానికి మించిన లావాదేవీలకు ఆమోదం కావాలో ఖాతాదారులే నిర్ణయించుకోవచ్చు.

ఖాతాదారుడు నిర్ణయించిన పరిమితి దాటి నగదు బదిలీ చేసిన ప్రతిసారీ, ఆ లావాదేవీ మొత్తం, నగదు అందుకునే వ్యక్తి వివరాలు సదరు నమ్మకమైన వ్యక్తికి వెళ్తాయి. ఆ లావాదేవీని ఆమోదించడానికి ఆ వ్యక్తికి ఒక గంట సమయం ఉంటుంది. ఒకవేళ ఆ వ్యక్తి తిరస్కరించినా లేదా గంటలోపు స్పందించకపోయినా ఆ లావాదేవీ రద్దవుతుంది. ఈ సదుపాయాన్ని ప్రారంభించడానికి ఖాతాదారుడు, నామినేట్ అయిన వ్యక్తి ఇద్దరూ స్పష్టమైన సమ్మతి తెలపాలి. దీనిని యాక్టివేట్ చేసే ముందు బ్యాంకులు 24 గంటల కూలింగ్-ఆఫ్ సమయాన్ని పాటించాలి.

అయితే, నమ్మకమైన వ్యక్తికి ఖాతాదారుడి బ్యాలెన్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, పెట్టుబడులు లేదా బీమా వివరాలు ఏవీ కనిపించవు. వారు స్వతంత్రంగా ఎలాంటి లావాదేవీలు జరపలేరు. వారు ఆమోదించిన లేదా తిరస్కరించిన లావాదేవీలకు వారికి ఎలాంటి ఆర్థిక బాధ్యత ఉండదు. యూపీఐ బదిలీలు, వ్యాపార చెల్లింపులు, స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్లు, ఈ-మాండేట్‌లు, ఎన్ఏసీహెచ్ (NACH) చెల్లింపులకు ఈ నిబంధన వర్తించదు.

బ్యాంకుల నిర్లక్ష్యంపై కఠిన కొరడా.. జనవరి 2027 నుంచే అమలు?

ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ మోసాల విషయంలో 'బ్యాంకుల నిర్లక్ష్యం' అనే పదానికి ఆర్‌బీఐ మరింత విస్తృతమైన నిర్వచనాన్ని ప్రతిపాదించింది. నిర్దేశిత ధ్రువీకరణ నిబంధనలు పాటించకపోవడం, తప్పనిసరి లావాదేవీ అలర్ట్‌లు పంపకపోవడం, 24 గంటలూ పనిచేసే మోసాల ఫిర్యాదు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడం, ఖాతాదారుల ఫిర్యాదులపై తక్షణమే స్పందించకపోవడం వంటివి బ్యాంకుల నిర్లక్ష్యం కిందకే వస్తాయి. బ్యాంకు సిస్టమ్ లోపాలు, భద్రతా ఉల్లంఘనలు, బ్యాంకు ఉద్యోగులు లేదా థర్డ్-పార్టీ ఏజెంట్ల కుమ్మక్కు వల్ల జరిగే మోసాలకు కూడా బ్యాంకులే బాధ్యత వహించాల్సి ఉంటుంది.

బ్యాంకుల జవాబుదారీతనాన్ని పెంచే ఈ కఠిన నిబంధనలను జనవరి 1, 2027 నుంచే అమల్లోకి తీసుకురావాలని ఆర్‌బీఐ ప్రతిపాదించింది. వాణిజ్య బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, పేమెంట్స్ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, లోకల్ ఏరియా బ్యాంకులు, సహకార బ్యాంకులన్నింటికీ వేర్వేరు సవరణల ద్వారా ఈ నిబంధనలు వర్తిస్తాయి.

మొత్తంమీద ఆర్‌బీఐ తాజా ప్రతిపాదనలు అమల్లోకి వస్తే, తమ ఖాతా నుంచి నగదు బయటకు వెళ్లే ప్రక్రియపై ఖాతాదారులకు పూర్తి నియంత్రణ లభిస్తుంది. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకున్నప్పుడు తక్షణమే నష్టాన్ని నివారించే శక్తి సామాన్యుడి చేతికి అందుతుంది. అయితే డిసెంబర్ 14 తర్వాత ప్రజాభిప్రాయాలను పరిశీలించి ఆర్‌బీఐ తుది మార్గదర్శకాలను విడుదల చేసిన తర్వాతే ఈ సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.

ABOUT THE AUTHOR

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.