హైదరాబాద్: భారతీయులకు మొదటి నుంచి స్థిరాస్తి (రియల్ ఎస్టేట్) రంగంలో పెట్టుబడులు పెట్టడం అత్యంత సురక్షితమైన ఆనవాయితీగా వస్తోంది. అయితే, రాబోయే రోజుల్లో దేశీయంగా ప్రాపర్టీ ధరలు గతంలో ఎన్నడూ చూడని రీతిలో భారీగా పెరిగే అవకాశం ఉందని ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ (CA) సార్థక్ అహుజా విశ్లేషించారు. అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, నిబంధనల్లో మార్పులు, టెక్నాలజీ రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పుల కారణంగా 2027 నాటికి భారత రియల్ ఎస్టేట్ మార్కెట్ విస్ఫోటనం చెందే స్థాయిలో పుంజుకుంటుందని ఆయన చేసిన విశ్లేషణ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

దేశీయంగా రియల్ ఎస్టేట్ రంగానికి భారీ డిమాండ్ పెరగడానికి, ధరలు ఆకాశాన్నంటడానికి గల మూడు ప్రధాన కారణాలను సార్థక్ అహుజా వివరించారు.
స్టాక్ మార్కెట్ లబోదిబో.. గోల్డ్ ఫండ్స్‌పై పరిమితులు
సాంప్రదాయ ఆర్థిక పెట్టుబడి మార్గాల నుంచి ఇన్వెస్టర్లు తప్పుకోవడమే మొదటి కారణంగా అహుజా పేర్కొన్నారు. ఇటీవల స్టాక్ మార్కెట్లలో చోటుచేసుకుంటున్న పతనాలతో చంచలత్వం (Volatility) పెరగడం, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితుల కారణంగా రీటైల్, సంస్థాగత ఇన్వెస్టర్లు సురక్షితమైన ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు.
"స్టాక్ మార్కెట్లు పడిపోతున్నాయి. ఈ పతనం నుంచి మార్కెట్లు కోలుకోవడానికి 2027 చివరి వరకు సమయం పడుతుందనే ఆందోళన ఇన్వెస్టర్లలో నెలకొంది" అని అహుజా పేర్కొన్నారు.
మరోవైపు, పసిడి (Gold) రూపంలో ఉన్న ప్రత్యామ్నాయంపైనా ఆంక్షలు ఉన్నాయి. "బంగారం దిగుమతులను నియంత్రించేందుకు వీలుగా 'గోల్డ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్' (Gold Fund of Funds) లలో కొత్త పెట్టుబడులను స్వీకరించవద్దని ఫండ్ హౌస్‌లను సెబీ (SEBI) ఆదేశించింది" అని ఆయన గుర్తుచేశారు. ఈ రెండు ప్రధాన పెట్టుబడి మార్గాలు ఇబ్బందుల్లో పడటంతో, ఇన్వెస్టర్లకు భౌతికంగా కనిపించే ఏకైక నమ్మకమైన ఆస్తిగా రియల్ ఎస్టేట్ మాత్రమే కనిపిస్తోందని ఆయన స్పష్టం చేశారు.
అమెరికా ఇమ్మిగ్రేషన్ కఠినతరం.. ఎన్‌ఆర్‌ఐల చూపు స్వదేశం వైపు
రెండో ప్రధాన కారణం.. పాశ్చాత్య దేశాలలో, ముఖ్యంగా అమెరికాలో మారిన వలస విధానాలు. అమెరికాలోని టెక్ కంపెనీల్లో పనిచేస్తున్న ఎన్ఆర్ఐలకు గ్రీన్ కార్డ్ జారీని నిలిపివేసే దిశగా చర్యలు చేపట్టడంతో అక్కడి భారతీయులలో భవిష్యత్తుపై తీవ్ర అనిశ్చితి నెలకొంది.
{{/usCountry}}రెండో ప్రధాన కారణం.. పాశ్చాత్య దేశాలలో, ముఖ్యంగా అమెరికాలో మారిన వలస విధానాలు. అమెరికాలోని టెక్ కంపెనీల్లో పనిచేస్తున్న ఎన్ఆర్ఐలకు గ్రీన్ కార్డ్ జారీని నిలిపివేసే దిశగా చర్యలు చేపట్టడంతో అక్కడి భారతీయులలో భవిష్యత్తుపై తీవ్ర అనిశ్చితి నెలకొంది.
{{/usCountry}}"అమెరికాలో భవిష్యత్తుపై స్పష్టత లేకపోవడంతో, మన టెక్కీలు అక్కడ మరింతగా పెట్టుబడులు పెట్టడానికి ఇష్టపడటం లేదు. భవిష్యత్ అవసరాల కోసం, సురక్షితమైన ప్రత్యామ్నాయంగా తమ డబ్బును భారత్‌కు పంపి ఇక్కడ ఇళ్లు కొనుగోలు చేస్తున్నారు. ఇవి వారు తిరిగి వచ్చినా ఉపయోగపడతాయి లేదా అద్దెల ద్వారా రాబడిని అందిస్తూ అసలు మొత్తాన్ని సురక్షితంగా ఉంచుతాయి" అని అహుజా విశ్లేషించారు.
వివిధ నివేదికల ప్రకారం.. 2015-18 కాలంలో భారత రియల్ ఎస్టేట్ డీల్స్‌లో ఎన్‌ఆర్‌ఐల వాటా 7 నుంచి 10 శాతం మాత్రమే ఉండగా, ప్రస్తుతం అది 18 నుంచి 20 శాతానికి చేరింది. ఇది విదేశీ నిధులు దేశీయ స్థిరాస్తి రంగానికి ఏ స్థాయిలో తరలివస్తున్నాయో సూచిస్తోంది.
డేటా సెంటర్ల హడావుడి.. భూముల కొనుగోలుకు కంపెనీల క్యూ
సార్థక్ అహుజా విశ్లేషణలో మూడోd, అత్యంత కీలకమైన అంశం.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్లౌడ్ కంప్యూటింగ్ విప్లవంతో కార్పొరేట్ సంస్థలు డేటా సెంటర్ల కోసం ఎగబడి భూములను కొనుగోలు చేయడం.
కార్పొరేట్ దిగ్గజాలు ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేసుకుంటున్న తీరును వివరిస్తూ.. "అమెజాన్ సంస్థ ముంబై సమీపంలో 10 ఎకరాలు కొనుగోలు చేసింది. టీసీఎస్ (TCS) పూణే సమీపంలో 88 ఎకరాలు, ఆంధ్రప్రదేశ్‌లో 200 ఎకరాల భూమిని సేకరించినట్లు సమాచారం. లోధా గ్రూప్ 1GW సామర్థ్యం కోసం 100 ఎకరాల్లో ప్రణాళికలు రచిస్తోంది" అని ఆయన వెల్లడించారు.
సాధారణ నివాస లేదా వాణిజ్య అవసరాల కంటే డేటా సెంటర్ల కోసం ఉపయోగించే భూమిపై వచ్చే రాబడి (ROI) చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల రాబోయే రోజుల్లో మరింత మంది కార్పొరేట్ దిగ్గజాలు భూముల కొనుగోలుకు పోటీపడతారని, కొన్ని ప్రత్యేక కారిడార్లలో భూముల ధరలు విపరీతంగా పెరిగిపోతాయని అహుజా వివరించారు.
అయితే, ఈ విశ్లేషణ కేవలం తన అధ్యయనంలో తేలిన అంచనా మాత్రమేనని, దీనిని వ్యక్తిగత ఇన్వెస్ట్‌మెంట్ సలహాగా పరిగణించకూడదని అహుజా చివరగా స్పష్టం చేశారు.