చూస్తుండగానే ఏసీ బస్సులు క్షణాల్లో ఎందుకు కాలిపోతున్నాయ్.. ఈ చిన్న విషయాలే కారణాలు!

కర్నూలు బస్సు ప్రమాద ఘటన ఒక్కసారిగా దేశం ఉలిక్కిపడేలా చేసింది. చూస్తుండగానే బస్సు క్షణాల్లో కాలి బుడిదైపోయింది. 19 మంది సజీవ దహనం అయ్యారు. ఈ ఏసీ స్లీపర్ బస్సులు కాలిపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి.

Updated on: Oct 24, 2025, 15:05:56 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఇటీవలి కాలంలో కాలి బూడిదైనపోయిన బస్సులాంటి వార్తలు ఎక్కువగా వింటున్నాం. బస్సు అగ్ని ప్రమాదానికి గురైతే మరణించేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. గతంలోని ఘటనలు చెప్పే సత్యం కూడా ఇదే. బస్సులో లోపల ఉన్న ప్రయాణికులకు ఒక్కసారిగా ఏం జరుగుతుందో అర్థం కాదు. బయటకు వెళ్లడానికి వీలుపడదు. దీంతో మంటల్లో చిక్కుకుని ఆర్తనాదాలు చేస్తూ ప్రాణాలు పోగొట్టుకుంటారు. ఏసీ బస్సుల్లో ఇలాంటి అగ్నిప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి. దీనికి కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయి.

ఏసీ బస్సులు వెంటనే కాలిపోవడానికి కారణాలు
ఏసీ బస్సులు వెంటనే కాలిపోవడానికి కారణాలు

సాధారణ బస్సులో విద్యుత్ వినియోగం తక్కువే ఉంటుంది. కానీ ఏసీ బస్సుల్లో మాత్రం అధికంగా ఉంటుంది. సుమారు 15 కిలోవాట్లపైనే శక్తి కావాలి. ఈ అధిక విద్యుత్ కారణంగా కేబుల్స్ వేడెక్కుతాయి. దీంతో షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా హైదరాబాద్ నుంచి బెంగళూరు, హైదరాబాద్ నుంచి మంగళూరులాంటి సిటీలకు వెళ్లే బస్సులు ఎక్కువసేపు ప్రయాణం చేస్తాయి. గంటల ప్రయాణం ఉంటుంది.

ఈ సమయంలో ఏసీని ఆపకుండా నడిపితే ప్రమదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ చిన్న తప్పిదంతో ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువ. కంప్రెసర్, కూలింగ్ ఫ్యాన్లు, ఆల్టర్నేట్ వంటి భాగాలు ఓవర్‌లోడ్ అవుతాయి. విద్యుత్ కనెక్షన్స్ బలహీనపడతాయి. గుంతల రహదారుల్లో ప్రయాణం కూడా ప్రమాదాలు జరగడానికి ఒక కారణంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే బలహీనంగా ఉన్న కనెక్షన్లను మరింత బలహీనం అవుతాయి. అధిక వేగంలో ఉన్నప్పుడు వేసే సడెన్ బ్రేకులు కూడా వైరింగ్ బలహీనం కావడానికి కారణం అవుతాయి.

ప్రతీ 2 నుంచి 3 గంటలకు ఒకసారి 15 నుంచి 20 నిమిషాలు ఏసీ ఆపేయాలి. అయితే ఇప్పుడు దాదాపు అన్ని ఏసీ స్లీపర్ బస్సుల్లో కిటికీలు ఉండటం లేదు. కేవలం డ్రైవర్ సీటు దగ్గర మాత్రమే ఉంటుంది. అధిక ఉష్ణోగ్రత ఉన్న సమయంలోనే ఏసీని వాడాలి. అది కూడా విరామం ఇస్తూ ఉపయోగించాలి. అతివేగం, ఏసీని ఎక్కువగా వాడటం, ఫిట్‌నెస్ లేకపోవడంలాంటి కారణాలతో ప్రమాదాలు ఎక్కువగా అవుతాయి. ప్రయాణం ఎక్కువగా ఉన్నప్పుడు బస్సును మధ్యలో కాసేపు ఆపాలి. ఇంజిన్ అధిక వేడి కూడా మంటలు చెలరేగడానికి కారణం అవుతుంది.

బస్సుల్లో ప్లాస్టిక్ భాగాలు, రెగ్జీన్, కాటన్ వంటి మెటీరియల్‌తో సీట్లు తయారై ఉంటాయి. ఇవి వెంటనే అంటుకుని మంటలు వ్యాపిస్తాయి. కొన్నిసార్లు బస్సుల్లోని ఆయిల్ ట్యాంకు, పెట్రోల్, డీజిల్ సరఫరా చేసే పైపులు దెబ్బతినీ లీకవుతాయి. ప్రయాణం చేసి చేసి బస్సు ఇంజిన్ వేడిగా ఉంటుంది. ఆ భాగాలపై ఇంధనం పడి వెంటనే మంటలు చెలరేగుతాయి. బస్సుల్లో టీవీ, బల్బులు, ఫ్యాన్, ఏసీ వంటి పరికరాలకు క్వాలిటీ లేని వైరింగ్ వాడితే కూడా ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More