రిలయన్స్ లాభాల జోరు: క్యూ2లో ఏకంగా ₹25,548 కోట్ల నికర లాభం
ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ సెప్టెంబరు త్రైమాసికంలో అద్భుత ప్రదర్శన కనబరిచింది. శుద్ధి మార్జిన్లు పుంజుకోవడంతో నికర లాభం 40 శాతం పెరిగి రూ. 25,548 కోట్లకు చేరింది. మార్కెట్ విశ్లేషకుల అంచనాలను మించుతూ రాబడి, ఈబిట్డా నమోదయ్యాయి.
దేశీయ దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) జులై-సెప్టెంబరు (క్యూ2) త్రైమాసికంలో మార్కెట్ అంచనాలను తలకిందులు చేస్తూ భారీ లాభాలను నమోదు చేసింది. అంతర్జాతీయంగా శుద్ధి సామర్థ్యం తగ్గి, రిఫైనింగ్ మార్జిన్లు ఊపందుకోవడమే ఇందుకు ప్రధాన కారణమైంది.
అంచనాలను మించిన లాభాలు, రాబడి
సమీక్షా త్రైమాసికంలో రిలయన్స్ నికర లాభం ఏకంగా 40 శాతం పెరిగి రూ. 25,548 కోట్లకు చేరుకుంది. మార్కెట్ విశ్లేషకులు బ్లూమ్‌బర్గ్ సర్వే ఆధారంగా రూ. 21,368 కోట్ల లాభం రావచ్చునని అంచనా వేయగా, కంపెనీ అంతకంటే దాదాపు 20 శాతం అదనపు లాభాన్ని ఆర్జించింది.
ఇక సమీకృత రాబడి (Consolidated Revenue) గత ఏడాదితో పోలిస్తే పావు శాతానికి పైగా పెరిగి రూ. 3.3 లక్షల కోట్లకు (రూ. 3.3 ట్రిలియన్లు) చేరింది. విశ్లేషకులు ఈ రాబడిని రూ. 3.1 లక్షల కోట్లుగా అంచనా వేశారు.
శుద్ధి మార్జిన్లకు ఇంధన సంక్షోభం తోడు
పశ్చిమాసియా, ఉక్రెయిన్ యుద్ధాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 10 శాతం రిఫైనింగ్ సామర్థ్యం దెబ్బతింది. దీంతో డీజిల్, పెట్రోల్, విమాన ఇంధనం (ఏటీఎఫ్) కొరత ఏర్పడి, క్రూడాయిల్ ధరలకు, ప్రాసెస్ చేసిన ఉత్పత్తుల ధరలకు మధ్య ఉండే వ్యత్యాసం (ఫ్యూయల్ క్రాక్స్) రికార్డు స్థాయికి చేరింది.
రిలయన్స్ తన గుజరాత్ జామ్‌నగర్‌లోని ప్రత్యేక ఆర్థిక మండలి (ఎస్ఈజెడ్) రిఫైనరీ నుంచి పెద్దఎత్తున ఎగుమతులు చేయడంతో పాటు, కేంద్ర ప్రభుత్వం విధించిన విండ్‌ఫాల్ పన్ను పరిధిలోకి రాకపోవడం కంపెనీకి కలిసివచ్చింది. త్వరలోనే తక్కువ ధరకే లభించే వెనిజులా ముడిచమురును శుద్ధి చేసే అవకాశం ఉండటంతో ఈ త్రైమాసికంలోనూ లాభాల మార్జిన్లు మరింత పెరిగే అవకాశం ఉంది.
ఎబిటా పెరుగుదల.. విశ్లేషకుల అభిప్రాయం
కంపెనీ ఎబిటా (EBITDA) 25 శాతం వృద్ధితో రూ. 56,616 కోట్లకు చేరింది. విశ్లేషకుల అంచనా రూ. 51,942 కోట్లుగా ఉంది. అయితే ఎబిటా మార్జిన్ 71 బేసిస్ పాయింట్లు తగ్గి 17 శాతానికి పరిమితమైంది.
"మార్కెట్ అంచనాల కంటే ఫలితాలు చాలా బాగున్నాయి" అని యెస్ సెక్యూరిటీస్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీ రీసెర్చ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ హర్షరాజ్ అగర్వాల్ పేర్కొన్నారు. ఈ త్రైమాసికంలో రిలయన్స్ గ్రాస్ రిఫైనింగ్ మార్జిన్లు (జిఆర్ఎమ్) బ్యారెల్‌కు దాదాపు 20 డాలర్ల స్థాయిని తాకి ఉండవచ్చని, ఇది మునుపటి త్రైమాసికం కంటే 30 శాతం ఎక్కువేనని ఆయన లెక్కింపులు చెబుతున్నాయి.
"వెనిజులా ముడిచమురు అందుబాటులోకి రావడంతో మూడో త్రైమాసికంలో మార్జిన్లు మరింత పెరిగే అవకాశం ఉంది" అని అగర్వాల్ అభిప్రాయపడ్డారు.
"కమోడిటీ మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకులకు గురవుతుండగా, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సరఫరా వ్యవస్థలపై ఒత్తిడి పెంచాయి. ఈ ప్రతికూల పరిస్థితుల్లోనూ మా విభిన్న వ్యాపారాల సమర్థ నిర్వహణ, దేశీయ మార్కెట్ బలం రిలయన్స్ మెరుగైన ప్రదర్శనకు తోడ్పడ్డాయి" అని రిలయన్స్ ఛైర్మన్ ముకేష్ అంబానీ వెల్లడించారు. ఆయిల్-టు-కెమికల్స్ (ఓ2సి) వ్యాపారం అద్భుత ఫలితాలను ఇచ్చిందని, ఫీడ్‌స్టాక్ సేకరణ, ఉత్పత్తుల విక్రయాలను సమర్థంగా నిర్వహించడం వల్ల మార్జిన్లు పెంచుకోగలిగామని తెలిపారు.
ఓ2సి, జియో మెరుపులు.. రిటైల్ మందగమనం
వివిధ వ్యాపార విభాగాల వారీగా ఆర్థిక ఫలితాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
ఓ2సి (O2C) విభాగం: రిఫైనింగ్ విభాగానికి చెందిన ఓ2సి ఎబిటా వార్షిక ప్రాతిపదికన 68 శాతం పెరిగి రూ. 25,203 కోట్లకు చేరింది.
డిజిటల్ సేవలు (జియో ప్లాట్‌ఫామ్స్): ఇటీవల లిస్ట్ అయిన జియో ప్లాట్‌ఫామ్స్ ఉన్న డిజిటల్ సేవల విభాగం ఎబిటా 18 శాతం పెరిగి రూ. 22,223 కోట్లకు చేరింది. సమీక్షా కాలంలో జియో కొత్తగా 9.1 మిలియన్ల (91 లక్షల) నికర చందాదారులను జోడించడంతో మొత్తం కస్టమర్ల సంఖ్య 54.24 కోట్లకు చేరింది. ఒక్కో వినియోగదారుడి నుంచి వచ్చే సగటు రాబడి (ఏఆర్‌పీయూ) 4 శాతం పెరిగి రూ. 218.8 కి చేరింది. ఎయిర్‌టెల్ ఏఆర్‌పీయూ (రూ. 264) తో పోలిస్తే ఇది తక్కువగానే ఉంది.
రిటైల్ విభాగం: ద్రవ్యోల్బణ ప్రభావంతో రిటైల్ విభాగం కొంత నెమ్మదించింది. ఈ విభాగం ఎబిటా 10 శాతం తగ్గి రూ. 6,120 కోట్లకు పడిపోయింది. నష్టాల్లో ఉన్న 525 స్టోర్లను మూసివేసి, కొత్తగా 303 స్టోర్లను ప్రారంభించింది. దీంతో క్యూ2 చివరినాటికి మొత్తం స్టోర్ల సంఖ్య 19,947 కి చేరింది (క్రితం త్రైమాసికం కంటే 222 తక్కువ).
ఆయిల్ అండ్ గ్యాస్: అన్వేషణ, ఉత్పాదకత విభాగం ఎబిటా స్వల్పంగా తగ్గి రూ. 4,901 కోట్లుగా నమోదైంది.
మార్కెట్ ముగింపు వద్ద..
శుక్రవారం బీఎస్ఈ (BSE)లో రిలయన్స్ షేరు ధర 0.44 శాతం తగ్గి రూ. 1,163.55 వద్ద ముగిసింది. కంపెనీ మొత్తం మార్కెట్ విలువ రూ. 15.7 లక్షల కోట్లుగా ఉంది. మార్కెట్ సమయం ముగిసిన తర్వాతే రిలయన్స్ ఈ ఫలితాలను ప్రకటించింది. ఆ రోజు బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 0.42 శాతం లాభంతో ముగిసింది.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


