...
...
Next Story

Jio IPO : ఇంకొన్ని రోజుల్లో జియో ఐపీఓ ఓపెన్.. ఇప్పుడు రిలయన్స్ షేర్లు కొనొచ్చా? బెనిఫిట్స్ ఉంటాయా?

జియో ప్లాట్‌ఫార్మ్స్ మెగా ఐపీఓ అక్టోబర్ 21న ప్రారంభం కానున్న నేపథ్యంలో మాతృ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్​ఐఎల్) షేర్లు విపణిలో హాట్ టాపిక్‌గా మారాయి. ఇప్పుడు ఆర్‌ఐఎల్ షేర్లు కొనడం లాభదాయకమేనా? టార్గెట్ ప్రైజ్ ఎంత? విశ్లేషకుల సమగ్ర నివేదిక మీకోసం..

Published on: Oct 16, 2026, 12:20:48 IST
Advertisement

భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అత్యంత భారీ పబ్లిక్ ఇష్యూగా నిలవనున్న 'జియో ప్లాట్‌ఫార్మ్స్' ఐపీఓ దలాల్ స్ట్రీట్‌లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్​ఐఎల్) అనుబంధ డిజిటల్ విభాగమైన జియో ఐపీఓ అక్టోబర్ 21న ప్రారంభమై అక్టోబర్ 23 వరకు సబ్‌స్క్రిప్షన్ కోసం తెరుచుకోనుంది. ఇష్యూ ధరల శ్రేణిని ఒక్కో ఈక్విటీ షేరుకు రూ. 1,065 నుంచి రూ. 1,119 గా ఖరారు చేశారు. ఈ మెగా ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 28,755 కోట్ల నుంచి రూ. 30,213 కోట్ల వరకు నిధులను సేకరించాలని ప్రణాళికలు రచించింది.

జియో ఐపీఓ వేళ ఇప్పుడు రిలయన్స్ షేర్లు కొనొచ్చా? (AI generated image)
జియో ఐపీఓ వేళ ఇప్పుడు రిలయన్స్ షేర్లు కొనొచ్చా? (AI generated image)

ఈ నేపథ్యంలో జియో ఐపీఓకు ముందు పేరెంట్ కంపెనీ రిలయన్స్ షేర్లు కొనుగోలు చేస్తే బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయా? అని మదుపర్లు ఆలోచిస్తున్నారు. దీని గురుంచి స్టాక్ మార్కెట్ నిపుణుల విశ్లేషణను ఇక్కడ తెలుసుకోండి..

జియో ఐపీఓ- రికార్డు డేట్ గడువు..

జియో ప్లాట్‌ఫార్మ్స్ తమ ఉద్యోగులకు ఒక్కో షేరుపై రూ. 54 చొప్పున డిస్కౌంట్ ప్రకటించడంతో పాటు మాతృ సంస్థ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈక్విటీ వాటాదారుల కోసం ప్రత్యేకంగా రూ. 2,500 కోట్ల విలువైన షేర్ల కోటాను కేటాయించింది. అయితే, ఈ షేర్‌హోల్డర్ కేటగిరీ కింద దరఖాస్తు చేసుకోవడానికి అర్హత ఇచ్చే రికార్డు తేదీ అక్టోబర్ 14, 2026 నాటికే ముగిసింది!

దీనితో ఇప్పుడు కొత్తగా రిలయన్స్ షేర్లు కొనుగోలు చేసే వారికి ఈ ప్రత్యేక కేటాయింపు వర్తించదు.

రూ. 1,300 ప్లస్ టార్గెట్ - కొనుగోలుకు నిపుణుల మొగ్గు!

కాంతిలాల్ ఛగన్‌లాల్ సెక్యూరిటీస్ రీసెర్చ్ అండ్ బిజినెస్ డెవలప్‌మెంట్ వీపీ మహేష్ ఎం ఓఝా రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు సమీప కాల భవిష్యత్తుపై సానుకూలంగా స్పందించారు.

మరొకవైపు, ఎస్‌ఎంసీ గ్లోబల్ సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ సీమా శ్రీవాస్తవ మదుపరులకు జాగ్రత్తలు సూచించారు. జియో ఐపీఓ వస్తోందన్న ఒక్క ఆసక్తితోనే రిలయన్స్ షేర్లను కొనుగోలు చేయడం వల్ల స్వయంచాలకంగా భారీ లాభాలు వస్తాయనుకోవడం సరికాదని తెలిపారు. ఐపీఓ వార్తలు, అంచనాల వల్ల రిలయన్స్ షేరు ధర ఇదివరకే పెరిగిపోయి ఉండే అవకాశం ఉన్నందున, రికార్డు గరిష్ఠాల వద్ద తొందరపడి షేర్లను కొనుగోలు చేయకూడదని హెచ్చరించారు.

"ఇప్పటికే వాటాలు కలిగి ఉన్న మదుపరులు కేవలం ఐపీఓపైనే కాకుండా రిలయన్స్ ఇండస్ట్రీస్ మొత్తం వ్యాపార దృక్పథం, వాల్యూయేషన్ల ఆధారంగానే షేర్లను తమ వద్ద ఉంచుకోవాలా వద్దా అనే నిర్ణయం తీసుకోవాలి. కొత్తగా పెట్టుబడి పెట్టాలనుకునే వారు ఒకేసారి కాకుండా దశలవారీగా కొనుగోలు చేయడం శ్రేయస్కరం. స్వల్పకాలిక మదుపరులు లిస్టింగ్ ముందు లేదా తర్వాత మార్కెట్లో వచ్చే హెచ్ఛుతగ్గులు, ప్రాఫిట్ బుకింగ్ అవకాశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి," అని సీమా శ్రీవాస్తవ స్పష్టం చేశారు.

వ్యాపార పునాదులే అసలైన బలం!

జియో ఐపీఓ ద్వారా సేకరించే నిధుల్లో సింహభాగాన్ని తమ ప్రధాన టెలికాం సబ్సిడీ సంస్థ అయిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ పాత రుణాల చెల్లింపునకు వినియోగించనుంది. ఇది కంపెనీ వడ్డీ భారాన్ని తగ్గించి లాభదాయకతను పెంచుతుంది. అయినప్పటికీ, ఆర్‌ఐఎల్ ఆధీనంలో ఉన్న రిటైల్, ఆయిల్-టు-కెమికల్స్ (ఓ2సీ), న్యూ ఎనర్జీ వ్యాపారాల పనితీరు కూడా మాతృ సంస్థ షేరు భవిష్యత్‌ను నిర్దేశిస్తాయి. కాబట్టి సొంత ఆర్థిక స్థితిగతులు, రిస్క్ సామర్థ్యాన్ని బట్టి ఇన్వెస్టర్లు సరైన నిర్ణయం తీసుకోవడం మంచిది.

రిలయన్స్ షేరు ధర, జియో ఐపీఓ జీఎంపీ..

ఇక శుక్రవారం ట్రేడింగ్ సెషన్​లో రిలయన్స్ షేర్లు 0.42శాతం నష్టాలతో రూ. 1,210 వద్ద కొనసాగుతున్నాయి. ఇక జియో ఐపీఓ జీఎంపీ (గ్రే మార్కెట్​ ప్రీమియం) రూ. 225 వద్ద ఉంది. గురువారంతో పోల్చితే ఇది రూ. 5 తక్కువ. బుధవారం జియో ఐపీఓ జీఎంపీ రూ. 200 వద్ద ఉండేది.

(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ఐపీఓ లేదా స్టాక్​లో ఇన్వెస్ట్​ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్​ని సంప్రదించడటం శ్రేయస్కరం.)

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks