ఐస్‌క్రీమ్ మార్కెట్‌లోకి రిలయన్స్.. ప్రారంభ ధర పది రూపాయలే

ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (ఆర్‌సీపీఎల్) 'బాంబే క్రీమరీ' పేరుతో కొత్త ఐస్‌క్రీమ్ బ్రాండ్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. స్వచ్ఛమైన పాల క్రీమ్‌తో తయారయ్యే ఈ ప్రీమియం ఐస్‌క్రీమ్‌లు కేవలం రూ. 10 నుంచే లభించనున్నాయి.

Published on: Sep 1, 2026, 17:28:02 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారతీయ వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులను అందుబాటు ధరల్లో అందించడమే లక్ష్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ రంగాలోకి దిగింది. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) ఎఫ్‌ఎమ్‌సీజీ విభాగమైన రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (ఆర్‌సీపీఎల్), 'బాంబే క్రీమరీ' (Bombay Creamery) పేరుతో తన కొత్త ప్రీమియం ఐస్‌క్రీమ్ బ్రాండ్‌ను దేశీయ మార్కెట్‌లో ఆవిష్కరించింది.

ఐస్‌క్రీమ్ మార్కెట్‌లోకి రిలయన్స్.. ప్రారంభ ధర పది రూపాయలే
ఐస్‌క్రీమ్ మార్కెట్‌లోకి రిలయన్స్.. ప్రారంభ ధర పది రూపాయలే

రూ. 10లకే రియల్ డైరీ ఐస్‌క్రీమ్

బాంబే క్రీమరీని ఒక అందుబాటు ధరలోని ప్రీమియం డైరీ బ్రాండ్‌గా ఆర్‌సీపీఎల్ నిలుపుతోంది. కృత్రిమ పదార్థాలకు దూరంగా, కేవలం స్వచ్ఛమైన పాల క్రీమ్ (Real Dairy Cream)తోనే ఈ ఐస్‌క్రీమ్‌లను తయారు చేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. వినియోగదారులకు గ్లోబల్ క్వాలిటీ ఐస్‌క్రీమ్‌ను సరసమైన ధరలకే అందించాలనే సంకల్పంతో ఈ అడుగు వేసింది.

ఈ బ్రాండ్ కింద కోన్స్ (Cones), కప్స్ (Cups), టబ్స్ (Tubs), బార్స్ (Bars), స్టిక్స్ (Sticks) వంటి వివిధ రకాల ఉత్పత్తులు లభించనున్నాయి. వీటి ప్రారంభ ధరను కేవలం రూ. 10గా నిర్ణయించారు. ఈ నిర్ణయంతో సాధారణ వినియోగదారులకు కూడా స్వచ్ఛమైన పాలతో చేసిన ఐస్‌క్రీమ్‌లు సులభంగా అందుబాటులోకి రానున్నాయి.

త్వరలోనే దేశవ్యాప్తంగా

సెప్టెంబర్ 1న ఈ కొత్త బ్రాండ్‌ను కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఐస్‌క్రీమ్ రంగంలోకి దీర్ఘకాలిక వ్యూహంతో అడుగుపెడుతున్నట్లు తెలిపింది. ప్రారంభంలో 'బాంబే క్రీమరీ' ఉత్పత్తులను పశ్చిమ భారతదేశంలో అందుబాటులోకి తెస్తున్నారు. ఆ తర్వాత దశలవారీగా దేశవ్యాప్తంగా విక్రయాలు ప్రారంభించనున్నారు. ఆర్‌సీపీఎల్ కలిగిన విస్తృతమైన పంపిణీ వ్యవస్థ, రిటైల్ నెట్‌వర్క్ ఈ బ్రాండ్ వేగవంతమైన వృద్ధికి దోహదపడనున్నాయి.

"మిల్క్ ప్రొడక్ట్స్ విషయంలో ఎలాంటి షార్ట్‌కట్‌లు ఉండకూడదనే ఒకే ఒక్క సూత్రంతో బాంబే క్రీమరీని తీర్చిదిద్దాం. ఆర్‌సీపీఎల్ కేవలం ఐస్‌క్రీమ్ విభాగంలోకి ప్రవేశించడం మాత్రమే కాదు, నాణ్యతకు కట్టుబడి పని చేస్తోంది. నిజమైన పాల క్రీమ్‌తో తయారైన బాంబే క్రీమరీ, ప్రతి భారతీయ కుటుంబానికి అందుబాటు ధరలోనే నిజమైన రుచిని అందిస్తుంది" అని రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ డైరెక్టర్ టి. కృష్ణకుమార్ పేర్కొన్నారు.

ఆర్‌సీపీఎల్ ప్రధాన ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియో

రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (ఆర్‌సీపీఎల్) స్వల్ప కాలంలోనే ఆహారం, పానీయాలు, పర్సనల్ కేర్, గృహ అవసరాల విభాగాల్లో తన ఉనికిని చాటుకుంది.

పానీయాలు: 'కాంపా కోలా' బ్రాండ్ కింద కోలా, ఆరెంజ్, లెమన్ ఫ్లేవర్లు విక్రయిస్తోంది.

ఆహార ధాన్యాలు: 'ఇండిపెండెన్స్' బ్రాండ్ పేరుతో సన్‌ఫ్లవర్ ఆయిల్, గోధుమ పిండి, ప్యాకేజ్డ్ తాగునీటిని అందిస్తోంది. 'ఉధమ్', 'మనా' బ్రాండ్ల ద్వారా పప్పు ధాన్యాలు, బియ్యం సరఫరా చేస్తోంది.

ఇతర ఆహార పదార్థాలు: 'SiL' ద్వారా నూడుల్స్, సాస్‌లు, జామ్‌లు; 'మాలిబాన్' ద్వారా బిస్కెట్లు, కాన్ఫెక్షనరీ ఉత్పత్తులను విక్రయిస్తోంది.

పర్సనల్ కేర్: గ్లిమ్మర్, ప్యూరిక్, గెట్ రియల్ సోప్‌లతో పాటు బ్రిల్‌క్రీమ్, టోనీ అండ్ గై వంటి హెయిర్ కేర్ బ్రాండ్లు ఆర్‌సీపీఎల్ కింద ఉన్నాయి.

హోమ్ కేర్: డోజో (డిష్‌వాషింగ్), ఎంజో (డిటర్జెంట్), హోమ్‌గార్డ్ (ఫ్లోర్, టాయిలెట్ క్లీనర్లు) గృహ అవసరాలను తీరుస్తున్నాయి.

ఆర్‌సీపీఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఈషా అంబానీ వ్యవహరిస్తున్నారు. కంపెనీ వ్యూహాత్మక విస్తరణ, పెట్టుబడులను ఆమె పర్యవేక్షిస్తున్నారు.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More