Reliance share price : రిలయన్స్​ షేర్లు ఎందుకు పడుతున్నాయి? ఇప్పుడు కొనొచ్చా?

అమెరికా-వెనెజువెలా ఉద్రిక్తతల నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు మంగళవారం మార్కెట్​లో దాదాపు 4 శాతం మేర పతనమయ్యాయి. మరి ఇప్పుడు రిలయన్స్​ షేర్లను కొనొచ్చా? వద్దా? నిపుణుల సూచనలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Jan 6, 2026, 11:11:05 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దేశీయ స్టాక్ మార్కెట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్​ఐఎల్​) షేర్లు మంగళవారం ట్రేడింగ్‌లో ఇన్వెస్టర్లను కలవరపెడుతున్నాయి. క్రితం సెషన్‌లో దాదాపు 1 శాతం నష్టపోయిన రిలయన్స్​.. నేటి ఉదయం ట్రేడింగ్‌లో, ఒకానొక దశలో ఏకంగా 4 శాతం వరకు పతనమైంది. దీనికి కారణం ఏంటి? ఈ కరెక్షన్​లో రిలయన్స్​ని కొనొచ్చా? వద్దా? నిపుణులు ఏమంటున్నారు? ఇక్కడ తెలుసుకోండి..

రిలయన్స్​ స్టాక్​ని ఇప్పుడు కొనొచ్చా?
రిలయన్స్​ స్టాక్​ని ఇప్పుడు కొనొచ్చా?

రిలయన్స్​ స్టాక్​ ప్రైజ్​..

మార్కెట్ విలువ పరంగా దేశంలోనే అతిపెద్ద కంపెనీ అయిన రిలయన్స్ షేర్లపై గత రెండు రోజులుగా తీవ్ర ఒత్తిడి కనిపిస్తోంది. బీఎస్ఈలో క్రితం ముగింపు రూ. 1,577.45 తో పోలిస్తే, నేడు రూ. 1,575.55 వద్ద స్వల్ప నష్టంతో ప్రారంభమైన రిలయన్స్.. ఒక దశలో రూ. 1,517.60 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది.

ఇక ఉదయం 11 గంటల సమయంలో రిలయన్స్​ షేరు ధర 3.6శాతం పతనమై రూ. 1522 వద్ద కొనసాగుతోంది.

అంతర్జాతీయ పరిణామాల సెగ..

ప్రపంచంలోనే అత్యధిక ముడి చమురు నిల్వలు ఉన్న వెనెజువెలాలో శనివారం అమెరికా దాడులు చేయడం, ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను అదుపులోకి తీసుకోవడం వంటి పరిణామాలు గ్లోబల్ మార్కెట్లను కుదిపేశాయి. ఈ ఉద్రిక్తతలు పెరిగి ముడి చమురు ధరల్లో అస్థిరత ఏర్పడితే, రిలయన్స్ వంటి చమురు శుద్ధి కంపెనీల లాభాల మార్జిన్లపై ప్రభావం పడుతుందనే ఆందోళన ఇన్వెస్టర్లలో వ్యక్తమవుతోంది.

మరోవైపు, రష్యా నుంచి చమురుతో (భారత్​పై అమెరికా సుంకాలు ఉన్నాయి) వస్తున్న మూడు ఓడలు జామ్‌నగర్ రిఫైనరీకి చేరుకుంటున్నాయన్న వార్తలను రిలయన్స్ తీవ్రంగా ఖండించింది. ఇవన్నీ అబద్ధాలని, గత మూడు వారాలుగా రష్యా నుంచి ఎటువంటి చమురు దిగుమతులు చేసుకోలేదని, జనవరిలో కూడా అటువంటి ప్రణాళికలు లేవని కంపెనీ స్పష్టం చేసింది.

రిలయన్స్​ షేర్లు డౌన్​- ఇప్పుడు కొనొచ్చా?

గత ఏడాది సెన్సెక్స్ 9 శాతం వృద్ధి చెందితే.. రిలయన్స్ షేర్లు ఏకంగా 29 శాతం పెరిగి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించాయి. నిన్ననే (జనవరి 5) ఈ షేరు రూ. 1,611.20 వద్ద ఆల్-టైమ్ గరిష్టాన్ని తాకి కూల్​ఆఫ్​ అయ్యింది.

ఈ నేపథ్యంలో రిలయన్స్​ షేరులో ప్రస్తుత పతనం తాత్కాలికమేనని మెజారిటీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

"అమెరికా-వెనెజువెలా ఉద్రిక్తతలు రిలయన్స్‌పై స్వల్పకాలిక ప్రభావాన్ని మాత్రమే చూపుతాయి. రిలయన్స్ కేవలం చమురుపైనే ఆధారపడకుండా జియో, రిటైల్ వంటి రంగాల్లో బలంగా ఉన్న విషయం తెలిసిందే. చమురు ధరలు పెరిగితే భారీ రిఫైనరీ సామర్థ్యం ఉన్న రిలయన్స్‌కు అది కలిసొచ్చే అవకాశం కూడా ఉంది," అని ఎస్ఎంసీ గ్లోబల్ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ సీమా శ్రీవాస్తవ విశ్లేషించారు. రిఫైనరీ మార్జిన్లు పెరిగే అవకాశం ఉందని, పెట్రోకెమికల్ రంగంలో స్వల్ప ఒత్తిడి ఉన్నప్పటికీ కంపెనీ ఎగుమతుల ద్వారా దాన్ని అధిగమించగలదని ఆమె పేర్కొన్నారు.

రెలిగేర్ బ్రోకింగ్‌కు చెందిన అజిత్ మిశ్రా సైతం రిలయన్స్​ షేరు పట్ల ఆశాభావం వ్యక్తం చేశారు.

"వార్తల వల్ల వచ్చే ఒడిదుడుకులను దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు ఒక అవకాశంగా తీసుకోవాలి. ప్రస్తుత ధరల వద్ద రిలయన్స్ షేర్లను కొనుగోలు చేయవచ్చు (బై కాల్​). అతి త్వరలోనే ఇది రూ. 1,625 స్థాయిని చేరుకుంటుందని భావిస్తున్నాం. జియో వినియోగదారుల పెరుగుదల, ఏఆర్పీయూ మెరుగుపడటం వంటివి కంపెనీ వృద్ధికి ప్రధాన ఇంజిన్లుగా పనిచేస్తాయి," అని ఆయన వివరించారు.

మొత్తానికి, మార్కెట్ దిగ్గజం రిలయన్స్ ప్రస్తుత పతనాన్ని భయంగా కాకుండా, మంచి స్టాక్‌ను తక్కువ ధరకు పొందే అవకాశంగా చూడాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.

రిలయన్స్​ స్టాక్​ టెక్నికల్​ ఎనాలసిస్​..

“రిలయన్స్​ స్టాక్​ 9-డీఎంఏ, 20-డీఎంఏ దిగువన ట్రేడ్​ అవుతోంది. 50-డీఎంఏని టెస్ట్​ చేస్తోంది. రూ.1520- రూ. 1530 వద్ద 50 డీఎంఏ, వీడబ్ల్యూఏపీ ఉన్నాయి. ఇది కీలక సపోర్ట్​గా ఉంది. దీని దిగువకు పడితే రిలయన్స్​ స్టాక్​ రూ. 1480- రూ. 1460కి వెళ్లొచ్చు. అక్కడ 100డీఎంఏ ఉంది. మొత్తం మీద చూసుకుంటే రిలయన్స్​ స్టాక్​ పాజిటివ్​ ట్రెండ్​లోనే ఉంది. కానీ షార్ట్​ టర్మ్​లో మాత్రం రేంజ్​ బౌండ్​- వీక్​గా ఉండొచ్చు. రూ. 1570- రూ. 1590 వద్ద రెసిస్టెన్స్​ ఉంది. అది దాటితే కొనుగోళ్లు జోరు కనిపంచవచ్చు,” అని స్వస్తిక ఇన్వెస్ట్​మార్ట్​ సీనియర్​ టెక్నికల్​ ఎనలిస్ట్​ పర్వేశ్​ గౌర్​ తెలిపారు.

(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా స్టాక్​లో ఇన్వెస్ట్​ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్​ ఫైనాన్షియల్​ అడ్వైజర్​ని సంప్రదించడం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More