పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో ఉన్న టెలికాం ఆపరేటర్ వోడాఫోన్ ఐడియాకు భారీ ఊరట! సంస్థ చెల్లించాల్సిన ఏజీఆర్ (అడ్జెస్టెడ్ గ్రాస్ రెవెన్యూ) బకాయిలను తిరిగి లెక్కించే (రీఅసెస్మెంట్) అంశాన్ని పునఃపరిశీలించుకోవడానికి కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సోమవారం అనుమతి ఇచ్చింది. ఫలితంగా సోమవారం ట్రేడింగ్ సెషన్లో వోడాఫోన్ ఐడియా షేరు ధర దూసుకెళ్లింది!
ఈ అంశం కేంద్ర ప్రభుత్వ ‘పాలసీ పరిధి’లోకే వస్తుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ విషయాన్ని కేంద్రం తిరిగి పరిశీలించి, తగిన నిర్ణయం తీసుకోవడానికి ఎటువంటి అడ్డంకి లేదని కూడా కోర్టు స్పష్టం చేసింది.
వోడాఫోన్ ఐడియాకు 'సుప్రీం' రిలీఫ్!
ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వోడాఫోన్ ఐడియా కంపెనీకి ఇది ఒక పెద్ద ఊరట అని చెప్పుకోవాలి. టెలికాం ఆపరేటర్ ఫిర్యాదులను న్యాయపరమైన జోక్యం లేకుండా పరిష్కరించుకోవడానికి, ఏజీఆర్ బకాయిల డిమాండ్‌ను పునఃపరిశీలించుకునేందుకు కేంద్ర ప్రభుత్వానికి కోర్టు అనుమతి ఇచ్చింది.
కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అదనపు సమయాన్ని కోరడంతో ఈ విచారణ వాయిదా పడింది. ప్రధాన న్యాయమూర్తి బీర్ గవాయి ఈ అంశంపై స్పష్టమైన వైఖరిని తెలియజేయాలని మెహతాను ఆదేశించి, విచారణను వాయిదా వేశారు.
వోడాఫోన్ ఐడియా షేరు ధర..
సోమవారం ట్రేడింగ్ సెషన్లో వోడాఫోన్ ఐడియా షేరు రూ. 10.57 దగ్గర ఇంట్రాడే హైని నమోదు చేసి, మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల ప్రాంతంలో రూ. 9.98 (3.74శాతం లాభాల్లో) వద్ద ట్రేడ్ అవుతోంది.
వోడాఫోన్ ఐడియా ఏజీఆర్ కేసు టైమ్‌లైన్..
ఏజీఆర్ అంటే టెలికాం కంపెనీలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన లైసెన్స్ ఫీజులు, స్పెక్ట్రమ్ ఛార్జీలను లెక్కించడానికి ఉపయోగించే ఆదాయ గణాంకం.
{{/usCountry}}ఏజీఆర్ అంటే టెలికాం కంపెనీలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన లైసెన్స్ ఫీజులు, స్పెక్ట్రమ్ ఛార్జీలను లెక్కించడానికి ఉపయోగించే ఆదాయ గణాంకం.
{{/usCountry}}రుణభారం ఎక్కువగా ఉన్న వోడాఫోన్ ఐడియా టెలికాం సంస్థ.. 2016-17 ఆర్థిక సంవత్సరం వరకు తమకు విధించిన రూ. 5,606 కోట్ల అదనపు ఏజీఆర్ బకాయిల డిమాండ్‌ను రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేసింది.
ఈ విషయంపై కంపెనీతో ఒక పరిష్కారానికి రావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం గతంలో తెలిపింది. వోడాఫోన్ ఐడియా మనుగడలో ప్రభుత్వానికి నేరుగా భాగస్వామ్యం ఉందని కోర్డుకు గుర్తుచేసింది.
ప్రభుత్వం వోడాఫోన్ ఐడియా కంపెనీలో దాదాపు 50% వాటాను కలిగి ఉంది.
2020 ఫిబ్రవరి 3 నాటి ‘తగ్గింపు ధృవీకరణ మార్గదర్శకాల’ను అనుసరించి, 2016-17 ఆర్థిక సంవత్సరం వరకు ఉన్న ఏజీఆర్ బకాయిలన్నింటినీ సమగ్రంగా రీ-అసెస్ చేసి సరిచేయాలని డీఓటీని ఆదేశించాలని వోడాఫోన్ ఐడియా 2 కోరింది.
కాగా.. ఏజీఆర్ బకాయిల లెక్కింపులో తప్పులు ఉన్నాయని, వాటిని సరిదిద్దాలని టెలికాం కంపెనీలు దాఖలు చేసిన పిటిషన్‌లను సుప్రీంకోర్టు 2021లో తోసిపుచ్చింది. ఆ ఉత్తర్వులను పునఃసమీక్షించడానికి ఈ ఏడాది ప్రారంభంలో నిరాకరించింది.
సెప్టెంబర్ 2020లో, టెలికాం సేవల ప్రొవైడర్లు తమ ఏజీఆర్ సంబంధిత బకాయిలు రూ. 93,520 కోట్లను చెల్లించడానికి 10 సంవత్సరాల గడువును సుప్రీంకోర్టు నిర్ణయించింది. 2021 మార్చి 31 నాటికి డీఓటీ అంచనా వేసిన మొత్తం బకాయిలలో 10% చెల్లించాలని, మిగిలిన మొత్తాన్ని 2021 ఏప్రిల్ 1 నుంచి 2031 మార్చి 31 వరకు వార్షిక వాయిదాలలో చెల్లించాలని ఆదేశించింది.
ఏజీఆర్ బకాయిల లెక్కింపులో డీఓటీ సరిగ్గానే వ్యవహరిస్తోందని అక్టోబర్ 2019లో సుప్రీంకోర్టు తీర్పును ఇచ్చింది. ఫలితంగా టెలికాం సంస్థల ఏజీఆర్ బకాయిలు భారీగా పెరిగాయి.
గతంలో, ఏజీఆర్ నిర్వచనంలో టెలికాం, నాన్-టెలికాం ఆదాయం (డిపాజిట్ల నుంచి వచ్చే వడ్డీ లేదా ఆస్తుల అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం వంటివి) కూడా ఉండేవి. అయితే 2021లో, ప్రభుత్వం నిబంధనలను సవరించింది. నాన్-టెలికాం ఆదాయాన్ని ఏజీఆర్ లెక్కల నుంచి మినహాయించి, టెలికాం ఆపరేటర్లపై ఆర్థిక భారాన్ని తగ్గించింది.
నేటి వరకు వోడాఫోన్ ఐడియాకు ఒక్క ఏజీఆర్ రూపంలోనే రూ. 83,400 కోట్ల బకాయిలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక మొత్తం అప్పులు రూ. 2లక్షల కోట్లు దాటిపోతాయి.