Upcoming cars in July : జులైలో కార్ల జాతర! టెక్టాన్ నుంచి ఎంజీ ఎస్​యూవీ వరకు, అదిరే ఎంట్రీలు..

ఆటోమొబైల్ రంగానికి 2026 జూలై నెల ఎంతో కీలకం కానుంది. మారుతి బ్రెజ్జా, రెనాల్ట్ క్విడ్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లతో పాటు నిస్సాన్, జేఎస్‌డబ్ల్యూ-ఎంజీ కంపెనీల నుంచి సరికొత్త ఎస్‌యూవీలు ఈ నెలలో లాంచ్ లేదా డెబ్యూ కాబోతున్నాయి.

Published on: Jun 30, 2026, 12:18:18 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆటోమొబైల్ రంగానికి జూన్ నెల అప్‌డేటెడ్ టయోటా ఇన్నోవా క్రిస్టా, మెర్సిడెస్-బెంజ్ ఎస్-క్లాస్ ఫేస్‌లిఫ్ట్, మారుతీ వ్యాగన్​ఆర్ ఫ్లెక్స్-ఫ్యూయల్ వంటి మోడళ్లతో జోష్ తెచ్చింది. ఇక 2026 ద్వితీయార్థంలోకి అడుగుపెడుతూ జులై నెల కూడా అదే వేగాన్ని కొనసాగించనుంది. ఈ నెలలో మార్కెట్లోకి విడుదల కావడానికి పలు క్రేజీ కార్లు సిద్ధంగా ఉన్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాము..

నిస్సాన్ టెక్టాన్ ఎస్​యూవీ ఇదిగో..
నిస్సాన్ టెక్టాన్ ఎస్​యూవీ ఇదిగో..

2026 రెనాల్ట్ క్విడ్ ఫేస్‌లిఫ్ట్..

(లాంచ్ తేదీ: జులై 3)

మారుతీ సుజుకీ ఆల్టో కే10కు గట్టి పోటీగా వచ్చిన రెనాల్ట్ క్విడ్ మొదటిసారి 2015లో లాంచ్ అయింది. ఆ తర్వాత 2019లో ఒక ఫేస్‌లిఫ్ట్ వచ్చింది. ప్రస్తుత మోడల్ దాదాపు ఏడేళ్లుగా మార్కెట్లో ఉండటంతో దీనికి కొత్త రూపు ఇవ్వడానికి రెనాల్ట్ సిద్ధమైంది. జులై 3న ఈ ఎంట్రీ లెవెల్ హ్యాచ్‌బ్యాక్ సరికొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో రాబోతోంది. లీకైన సమాచారం ప్రకారం.. దీనికి అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న డస్టర్ తరహాలోనే 'వై' షేప్ ఎల్‌ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లు, కొత్త బంపర్లు, టెయిల్ లైట్లు ఇస్తున్నారు. భద్రత కోసం స్టాండర్డ్‌గా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, పెద్ద టచ్‌స్క్రీన్, కొత్త స్టీరింగ్ వీల్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి అప్‌డేట్స్ ఉండనున్నాయి. ప్రస్తుతమున్న 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌నే ఇందులోనూ కొనసాగించనున్నారు.

ప్రస్తుత ధర రూ. 4.30 లక్షల నుంచి రూ. 5.88 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉండగా, కొత్త ఫేస్‌లిఫ్ట్ ధర కొద్దిగా పెరిగే అవకాశం ఉంది.

నిస్సాన్ టెక్టాన్..

(డెబ్యూ తేదీ: జులై 9)

డస్టర్ మోడల్‌కు నిస్సాన్ వెర్షన్‌గా వస్తున్న 'టెక్టాన్' ఎస్‌యూవీపై మార్కెట్లో భారీ అంచనాలు ఉన్నాయి. నిస్సాన్ ఇప్పటికే దీనికి సంబంధించిన టీజర్లను విడుదల చేసింది. ఇందులో ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, స్టైలిష్ అల్లాయ్ వీల్స్, సి-షేప్ టెయిల్ లైట్లు ఉండనున్నాయి. ఈ కారులో రెండు ఇంజిన్ ఆప్షన్లు ఇస్తున్నారు. 1-లీటర్ టర్బో-పెట్రోల్, అలాగే మరింత పవర్‌ఫుల్ 1.3-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్లతో ఇది రానుంది. రెండింటికీ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ప్రాణాధారం కాగా, 1.3 లీటర్ ఇంజిన్‌కు మాత్రం 7-స్పీడ్ డీసీటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ లభిస్తుంది.

నిస్సాన్ టెక్టాన్ ఎక్స్​షోరూం ధర రూ. 10.49 లక్షల నుంచి రూ. 18.69 లక్షల మధ్య ఉండే ఛాన్స్ ఉంది. ఇది మార్కెట్లోకి వస్తే టాటా సియెర్రా, హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి కార్లకు గట్టి పోటీ ఇస్తుంది.

జేఎస్‌డబ్ల్యూ-ఎంజీ కొత్త ఎస్‌యూవీ..

(డెబ్యూ తేదీ: జులై 16)

వూలింగ్ స్టార్‌లైట్ 560 మోడల్ ఆధారంగా జేఎస్‌డబ్ల్యూ-ఎంజీ ఇండియాలో ఓ సరికొత్త ఎస్‌యూవీని తీసుకువస్తోంది. మార్చిలోనే దీని డిజైన్ పేటెంట్ ఫైల్ చేశారు. 4,745 ఎంఎం పొడవు ఉండే ఈ 7-సీటర్ కారులో 12.8 ఇంచుల భారీ టచ్‌స్క్రీన్, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జర్ వంటి లగ్జరీ ఫీచర్లు ఉన్నాయి. గ్లోబల్ మార్కెట్లో ఇది ప్లగ్-ఇన్ హైబ్రిడ్, ఎలక్ట్రిక్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. హైబ్రిడ్ వెర్షన్ ఏకంగా 1,000 కిలోమీటర్లకు పైగా మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. మరి ఇండియాలోకి ఏ ఇంజిన్ వేరియంట్ వస్తుందనేది జులై 16న క్లారిటీ రానుంది. ఇది మహీంద్రా ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ, టాటా సఫారీ వంటి వాటికి ప్రత్యామ్నాయంగా నిలవనుంది.

మారుతీ సుజుకీ బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్..

(డెబ్యూ తేదీ: జులై 23)

భారతీయులు ఎంతగానో ఇష్టపడే కాంపాక్ట్ ఎస్‌యూవీ 'మారుతీ సుజుకీ బ్రెజ్జా' సరికొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ జులై 23న డెబ్యూ కానుంది. దీని బంపర్లు, అల్లాయ్ వీల్స్ డిజైన్ మారనున్నాయి. లోపల 9 ఇంచుల స్క్రీన్ స్థానంలో పెద్దదైన 10.1 ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ రాబోతోంది. సీఎన్జీ వేరియంట్‌లో బూట్ స్పేస్ (డిక్కీ స్థలం) పెంచడానికి విక్టోరిస్ తరహా అండర్ బాడీ ట్యాంక్ సెటప్ ఇచ్చే అవకాశం ఉంది.

అయితే, అన్నింటికంటే పెద్ద మార్పు ఈ ఎస్​యూవీ ఇంజిన్‌లోనే జరగబోతోంది! బ్రెజ్జా చరిత్రలోనే మొదటిసారిగా ఇందులో 1.0 లీటర్ టర్బో-పెట్రోల్ బూస్టర్‌జెట్ ఇంజిన్‌ను పరిచయం చేయనున్నారు. ఈ చిన్న టర్బో ఇంజిన్ వల్ల కారుపై పడే జీఎస్టీ పన్ను 40 శాతం నుంచి ఏకంగా 18 శాతానికి తగ్గుతుంది. దీనివల్ల బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ టర్బో వేరియంట్ల ధరలు కస్టమర్లకు మరింత అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

వీటితో పాటు 2026 టయోటా హీలక్స్, హోండా జెడ్​ఆర్​-వీ, స్కోడా కొడియాక్ ఆర్​ఎస్​ వంటి మోడళ్లు సైతం జులైలోనే లాంచ్​ అయ్యే అవకాశం ఉంది. వీటి ఎంట్రీ తేదీలను ఆయా సంస్థలు ప్రకటించాల్సి ఉంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More