Nissan Tekton : అదరగొట్టిన నిస్సాన్ కొత్త ఎస్​యూవీ- త్వరలోనే ‘టెక్టాన్’ గ్లోబల్​ ఎంట్రీ..

Nissan Tekton India launch : ప్రముఖ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ తన అప్‌కమింగ్ మిడ్‌సైజ్ ఎస్‌యూవీ 'టెక్టాన్' టీజర్‌ను విడుదల చేసింది. జులై 9న ఈ కారు ప్రపంచవ్యాప్తంగా పరిచయం కానుంది. పవర్‌ఫుల్ లుక్స్, టర్బో ఇంజిన్‌తో ఈ కారు రాబోతోంది. పూర్తి వివరాలు..

Published on: Jun 19, 2026, 09:08:31 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారత ఆటోమొబైల్ మార్కెట్​లో అత్యంత ప్రజాదరణ పొందుతున్న మిడ్‌సైజ్ ఎస్‌యూవీ విభాగంలోకి జపాన్ కార్ల దిగ్గజం 'నిస్సాన్' ఒక సరికొత్త పవర్‌ఫుల్ కారుతో ఎంట్రీ ఇవ్వబోతోంది! ఈ నేపథ్యంలోనే తమ అప్‌కమింగ్ ఎస్‌యూవీ ‘టెక్టాన్’కు సంబంధించిన సరికొత్త, అత్యంత స్పష్టమైన టీజర్‌ను కంపెనీ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఈ సరికొత్త మోడల్‌ని జులై 9వ తేదీన ముంబై వేదికగా ప్రపంచవ్యాప్తంగా మొదటిసారి ప్రదర్శించనున్నట్లు నిస్సాన్ అధికారికంగా ప్రకటించింది. ఈ కారును కస్టమర్లు ఎలా చూడాలని కంపెనీ కోరుకుంటుందో కూడా స్పష్టం చేసింది. నిస్సాన్ తన పాపులర్ గ్లోబల్ మోడల్ ఆధారంగా దీనిని “బేబీ పాట్రోల్” అని అభివర్ణించింది.

నిస్సాన్ టెక్టాన్..
నిస్సాన్ టెక్టాన్..

తాజాగా విడుదలైన టీజర్ ఈ సరికొత్త మిడ్‌సైజ్ ఎస్‌యూవీని కంపెనీ ఫ్లాగ్‌షిప్ మోడల్ అయిన 'నిస్సాన్ పాట్రోల్'తో ముడిపెడుతోంది. అంటే, ఆ పెద్ద లగ్జరీ కారుకున్న రగ్గడ్ లుక్, విజువల్ ఐడెంటిటీని ఈ చిన్న కారులోకి కూడా తీసుకురావాలని నిస్సాన్ భావిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మిడ్‌సైజ్ ఎస్‌యూవీలతో పోలిస్తే, టెక్టాన్ కారును మరింత దృఢంగా, నిటారుగా ఉండే బాడీ లాంగ్వేజ్‌తో ఒక పవర్‌ఫుల్ ఆప్షన్‌గా నిలబెట్టాలనేది కంపెనీ ప్లాన్.

డిజైన్ ఎలా ఉండబోతోంది?

ఈ టీజర్ ద్వారా కారు డిజైన్‌కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన వివరాలు బయటకు వచ్చాయి. ఈ కారు బోల్డ్ ప్రొపోర్షన్స్ (ఆకట్టుకునే కొలతలు) పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఎస్​యూవీ ముందు భాగంలో పెద్ద గ్రిల్, హారిజాంటల్ లైటింగ్ ఎలిమెంట్స్, వెడల్పైన స్టాన్స్ (రోడ్ గ్రిప్ లుక్) కనిపిస్తున్నాయి. కారు బోనెట్‌పై స్పష్టంగా కనిపించేలా ‘TEKTON’ అనే లెటరింగ్‌ను నిస్సాన్ ఉంచింది. అలాగే, కారు ముందు భాగంలో ఒక చివర నుంచి మరో చివరకు సాగే ఎల్‌ఈడీ లైటింగ్ ఎలిమెంట్, మధ్యలో వెలిగిపోయే నిస్సాన్ లోగోతో అనుసంధానమై ఉండటం విశేషం.

ఇక గతంలో రోడ్లపై టెస్టింగ్ జరుపుకుంటున్న సమయంలో లీకైన చిత్రాలను పరిశీలిస్తే, ఈ కారు ప్రొడక్షన్ వెర్షన్‌కు సంబంధించిన మరికొన్ని వివరాలు తెలుస్తాయి. మార్కెట్లోని మిగతా కార్ల కంటే ఇది మంచి బాక్సీ సిల్హౌట్ కలిగి ఉంది. ఫ్లాట్ రూఫ్‌లైన్, స్పష్టంగా కనిపించే వీల్ ఆర్చ్‌లు, బాడీ క్లాడింగ్ దీనికి పక్కా రగ్గడ్ ఎస్‌యూవీ లుక్‌ను ఇస్తున్నాయి. ఇవి కాకుండా తలకిందులుగా ఉన్న ఎల్-షేప్ ఎల్‌ఈడీ లైట్లు, వెనుక వైపు ఒకదానికొకటి కనెక్ట్ అయ్యే టెయిల్ ల్యాంప్స్, రూఫ్ రైల్స్, పెద్ద సైజు అలాయ్ వీల్స్ ఇందులో ఉన్నాయి. ఈ మోడల్ త్వరలో రాబోయే ‘రెనాల్ట్ డస్టర్’ ప్లాట్‌ఫారమ్‌పైనే తయారవుతున్నప్పటికీ, డస్టర్ కంటే భిన్నంగా కనిపించేలా నిస్సాన్ దీని ఫ్రంట్, రేర్ డిజైన్లలో చాలా మార్పులు చేసింది.

క్యాబిన్ లోపల ఫీచర్లు ఏముంటాయి?

కారు లోపలి భాగం (ఇంటీరియర్) విషయానికి వస్తే.. ఇది చాలా వరకు డస్టర్ కారులోని కాంపోనెంట్లను పంచుకున్నప్పటికీ, ప్రత్యేకమైన క్యాబిన్ ఫినిషింగ్స్, కొత్త అప్హోల్‌స్టరీ థీమ్స్‌తో రానుంది. ఈ ఎస్‌యూవీలో డ్యూయల్ డిజిటల్ డిస్‌ప్లేలు (ఇన్ఫోటైన్‌మెంట్ అండ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్), వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, పానోరమిక్ సన్‌రూఫ్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉండే అవకాశం ఉంది.

ఇంజిన్ సామర్థ్యం ఎంతో తెలుసా?

నిస్సాన్ టెక్టాన్ కారు పవర్‌ట్రెయిన్ ఆప్షన్లు కూడా డస్టర్ తరహాలోనే ఉండబోతున్నాయి.

దీని బేస్ (తక్కువ) వేరియంట్లలో 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ను అందించవచ్చు. ఇది దాదాపు 99 బీహెచ్​పీ పవర్‌ను, 160 ఎన్​ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.

ఇక టాప్ (హైయర్) వేరియంట్లలో 1.3-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించనున్నారు. ఇది గరిష్టంగా 161 బీహెచ్​పీ పవర్‌ను, 280 ఎన్​ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది. దీనిని మాన్యువల్ మరియు డీసీటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో ఆఫర్ చేయనున్నారు. భవిష్యత్తులో నిస్సాన్ ఇందులో స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌ను కూడా ప్రవేశపెట్టే యోచనలో ఉంది.

భారత మార్కెట్లోకి లాంచ్ అయిన తర్వాత ఈ నిస్సాన్ టెక్టాన్ కారు.. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్, హోండా ఎలివేట్, స్కోడా కుషాక్, ఫోక్స్‌వ్యాగన్ టైగూన్, రెనో డస్టర్, టాటా సియెర్రా వంటి పాపులర్ మిడ్‌సైజ్ ఎస్‌యూవీలతో గట్టిగా పోటీ పడనుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More