New SUV : మారుతీ సుజుకీ ఫ్రాంక్స్‌కు చెక్ పెట్టేందుకు హ్యుందాయ్ సరికొత్త ఎస్‌యూవీ! టర్బో ఇంజిన్​తో..

భారత మార్కెట్ కోసం హ్యుందాయ్ సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీని సిద్ధం చేస్తోంది. టెస్టింగ్‌లో దొరికిన ఈ కారు అత్యాధునిక ఫీచర్లు, సరికొత్త 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో మారుతి ఫ్రాంక్స్, టొయోటా టైజర్ వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

Published on: Jun 9, 2026, 10:45:35 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Hyundai Upcoming SUV India : భారతదేశంలో ఎస్‌యూవీలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే ఇక్కడి మార్కెట్​లో తన పట్టును మరింత బలోపేతం చేసుకోవడానికి ప్రముఖ కార్ల తయారీ సంస్థ ‘హ్యుందాయ్’.. సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ ప్రాజెక్ట్‌పై వేగంగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఈ కారుకు సంబంధించిన రోడ్ టెస్టింగ్ పనులు జోరుగా సాగుతున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో లీకైన కొన్ని స్పై షాట్స్ ఈ ఎస్​యూవీపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

హ్యుందాయ్ నుంచి కొత్త ఎస్​యూవీ..
హ్యుందాయ్ నుంచి కొత్త ఎస్​యూవీ..

హ్యుందాయ్ కార్ల లైనప్‌లో ఈ సరికొత్త క్రాస్ఓవర్ ఎస్‌యూవీ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకోనుంది. ఇది ఎక్స్‌టర్ మోడల్‌కు పైన, ప్రస్తుతం మార్కెట్​లో ఉన్న వెన్యూ కారుకు సమాంతరంగా మార్కెట్​లోకి రానుంది. ముఖ్యంగా ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్​లో భారీ డిమాండ్ ఉన్న మారుతీ సుజుకీ ఫ్రాంక్స్, టయోటా టైజర్, రెనాల్ట్ కైగర్ వంటి పాపులర్ కార్లకు గట్టి పోటీ ఇచ్చేలా హ్యుందాయ్ దీనిని డిజైన్ చేస్తోంది.

అంతేకాదు, టెస్టింగ్​లో కనిపించిన మోడల్​.. అంతర్జాతీయంగా అందుబాటులో ఉన్న హ్యుందాయ్ బేయాన్ అనే ఎస్​యూవీని పోలి ఉంది.

ఈ కొత్త ఎస్‌యూవీ లుక్ ఎలా ఉంది?

టెస్టింగ్ సమయంలో ఈ కారు బాడీ మొత్తం నల్లటి కవర్‌తో కప్పి ఉంచినప్పటికీ, దీనికి సంబంధించిన కొన్ని కీలకమైన ఎక్స్‌టీరియర్ వివరాలు బయటకు వచ్చాయి.

ఫ్రంట్ డిజైన్: ఈ కారు ముందు భాగంలో స్ప్లిట్-హెడ్‌ల్యాంప్ సెటప్‌ను అందించారు. ఇందులో స్లిమ్​గా ఉండే ఎల్‌ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్స్ పైభాగంలో ఉండగా, ప్రధాన లైటింగ్ యూనిట్లను బంపర్‌కు కొంచెం కింది భాగంలో అమర్చారు. ఈ తరహా డిజైన్ ప్రస్తుతం మనం హ్యుందాయ్ వెన్యూ కారులో చూస్తున్న లుక్‌ను పోలి ఉంది.

అడాస్ సేఫ్టీ ఫీచర్: విదేశాల్లో గతంలో టెస్టింగ్ చేసిన సమయంలో కనిపించిన వివరాల ప్రకారం, ఈ కారుకు కింద నల్లటి క్లాడింగ్‌తో కూడిన రగ్గడ్ బంపర్ డిజైన్ ఉంటుంది. అంతేకాదు, ఈ ప్రోటోటైప్ కార్లలో ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లతో పాటు రేడార్ మాడ్యూల్ కూడా కనిపించాయి. దీన్ని బట్టి చూస్తే ఈ కొత్త కారులో అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (అడాస్) వంటి అధునాతన సేఫ్టీ ఫీచర్లు ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

సైడ్ అండ్ రియర్ ప్రొఫైల్: పక్క నుంచి చూసినప్పుడు ఈ క్రాస్ఓవర్ డిజైన్ అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయించే గ్లోబల్-స్పెక్ ‘హ్యుందాయ్ బేయాన్’ మోడల్‌ను గుర్తుకు తెస్తోంది. సరికొత్త డిజైన్‌తో కూడిన అలాయ్ వీల్స్, కారుకు స్పోర్టీ లుక్ ఇచ్చే సిల్వర్ రూఫ్ రైల్స్ ఇందులో స్పష్టంగా కనిపిస్తున్నాయి. వెనుక భాగంలో కూడా ఫ్రంట్ డిజైన్‌కు మ్యాచింగ్ అయ్యేలా స్ప్లిట్-లైటింగ్ థీమ్‌ను కంటిన్యూ చేశారు. అలాగే రియర్ పార్కింగ్ సెన్సార్లు, రివర్సింగ్ కెమెరాలను అమర్చారు. ఈ సెగ్మెంట్‌లోని మిగతా కొత్త కార్లతో పోటీ పడాలంటే హ్యుందాయ్ ఇందులో 360-డిగ్రీ కెమెరా సిస్టమ్‌ను కూడా ఇచ్చే అవకాశం ఉంది.

సరికొత్త పవర్‌ఫుల్ టర్బో ఇంజిన్!

ఈ ఎస్‌యూవీలో అన్నింటికంటే పెద్ద హైలైట్ దాని ఇంజిన్ కానుంది. ఈ మోడల్ ద్వారా హ్యుందాయ్ సరికొత్త 1.2-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌ను భారత మార్కెట్​లోకి పరిచయం చేయబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం మార్కెట్​లో ఉన్న 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ కంటే ఇది అత్యుత్తమ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అలాగే పెద్దదైన 1.5-లీటర్ టర్బో ఇంజిన్ కంటే మెరుగైన మైలేజీని అందిస్తుంది.

ఇక బడ్జెట్ ధరలో వచ్చే కారు లోయర్ వేరియంట్లలో మాత్రం ప్రస్తుతం వెన్యూ, i20 ఎన్ లైన్ మోడళ్లలో వాడుతున్న నమ్మకమైన 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌నే కొనసాగించే అవకాశం ఉంది.

మార్కెట్​లోకి ఎప్పుడు రావచ్చు? ధర ఎంత ఉండొచ్చు?

అంతర్జాతీయ మోడల్ 'బేయాన్' స్ఫూర్తితో రూపుదిద్దుకుంటున్న ఈ సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ 2027 ఆర్థిక సంవత్సరం రెండొవ త్రైమాసికంలో (FY2027 Q2) భారత మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే 2026 చివరినా లేదా 2027 తొలినాళ్లల్లో అని అర్థం చేసుకోవచ్చు. దీని ధరను కూడా వినియోగదారులకు అందుబాటులో ఉండేలా, దాదాపు ప్రస్తుత హ్యుందాయ్ వెన్యూ ధరల శ్రేణికి దగ్గరగానే కంపెనీ నిర్ణయించవచ్చని మార్కెట్ వర్గాల అంచనా.

ఈ మోడల్​ లాంచ్​, ధరపై సంస్థ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More