'రిజర్వేషన్ హఠావో ఆందోళన్' వైరల్: ఇన్‌స్టాగ్రామ్‌లో 50 లక్షల మందికి పైగా ఫాలోవర్లు

సోషల్ మీడియా వేదికగా 'రిజర్వేషన్ హఠావో ఆందోళన్' పేరిట జరుగుతున్న ప్రచారం తీవ్ర రూపం దాల్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 55 లక్షల మందికి పైగా ఫాలోవర్లను సంపాదించుకున్న ఈ డిజిటల్ ఉద్యమంపై ప్రత్యేక కథనం.

Published on: Jul 28, 2026, 16:00:37 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కాక్రోచ్ జనతా పార్టీ (CJP) డిజిటల్ వేదికగా పెద్ద ఎత్తున ఆందోళన చేసిన తదనంతర పరిణామాల్లో ఇప్పుడు సోషల్ మీడియాలో మరో తీవ్రమైన అంశంపై ప్రచారం వేగంగా విస్తరిస్తోంది. 'రిజర్వేషన్ హఠావో ఆందోళన్' (RHA) పేరుతో కొద్దిరోజుల క్రితం ప్రారంభమైన ఒక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఏకంగా 55 లక్షల (5.5 మిలియన్లు) ఫాలోవర్ల మార్కును దాటేసింది.

'రిజర్వేషన్ హఠావో ఆందోళన్' వైరల్: ఇన్‌స్టాగ్రామ్‌లో 50 లక్షల మందికి పైగా ఫాలోవర్లు
'రిజర్వేషన్ హఠావో ఆందోళన్' వైరల్: ఇన్‌స్టాగ్రామ్‌లో 50 లక్షల మందికి పైగా ఫాలోవర్లు

reservationhataomovement అనే ఐడీతో నడుస్తున్న ఈ ఖాతాలో ఇప్పటివరకు 100కు పైగా పోస్టులను ఉంచారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ ఖాతా కేవలం భారత సైన్యం (Indian Army) అధికారిక ఖాతాను మాత్రమే ఫాలో అవుతోంది. తమకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని, ఇది పూర్తిగా పౌరుల మద్దతుతో సాగుతున్న స్వచ్ఛంద ఉద్యమమని ఖాతా నిర్వాహకులు ప్రకటించారు. అయితే ఈ ఉద్యమం వెనుక ఉన్న ముఖ్య సూత్రధారి ఎవరనేది ఇప్పటివరకు వెల్లడి కాలేదు.

'ప్రతిభకే ప్రాధాన్యం' - డిమాండ్లు ఏంటి?

బి.ఆర్. అంబేద్కర్ ఇచ్చిన "చదువుకో-పోరాడు-సమకూరు" (Educate-Agitate-Organize) పిలుపుతో పాటు "కులాలు వేరైనా మనుషులంతా ఒక్కటే, దేశ ప్రగతియే మా లక్ష్యం" అనే అర్థం వచ్చేలా ఉన్న వ్యాక్యాన్ని ప్రొఫైల్ వివరాల్లో చేర్చారు.

రిజర్వేషన్ల వ్యవస్థ వల్ల ప్రతిభ (Merit) తీవ్రంగా దెబ్బతింటోందని, సమాజంలో కుల వ్యత్యాసాలు మరింత పెరుగుతున్నాయని ఈ గ్రూప్ వాదిస్తోంది. పోటీతత్వం తగ్గడం వల్ల విద్యా ప్రమాణాల నాణ్యత పడిపోతోందని ఆందోళన వ్యక్తం చేస్తూ, కులానికి బదులుగా కేవలం ప్రతిభ ఆధారంగానే సమాన అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తోంది.

సమాజంలో కుల వివక్షను పూర్తిగా రూపుమాపడమే ప్రభుత్వ లక్ష్యమైతే, రోజువారీ అధికారిక లావాదేవీలలోనూ లేదా ప్రభుత్వ ప్రక్రియలలోనూ కుల గుర్తింపును అడగడం, గుర్తించడం తక్షణమే నిలిపివేయాలని ఉద్యమ నిర్వాహకులు తమ ప్రణాళికలో స్పష్టం చేశారు.

సీజేపీ, E20 జనతా పార్టీల వరుసలో..

ఇటీవల అభిజీత్ దిప్కే నేతృత్వంలో వ్యంగ్యాత్మకంగా ప్రారంభమైన 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) దేశవ్యాప్తంగా పెద్ద సంచలనమే సృష్టించింది. వివిధ పోటీ పరీక్షల్లో అక్రమాలపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద యువత చేపట్టిన నిరసనలకు ఈ డిజిటల్ ఉద్యమమే వేదికగా నిలిచింది. ఆ నిరసనల పరిణామాల క్రమంలోనే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

అదే తరహాలో 'E20 జనతా పార్టీ' పేరిట మరో ఖాతా కూడా సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పర్యవేక్షణలో అమలవుతున్న 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ (E20) విధానాన్ని వ్యతిరేకిస్తూ ఈ ఖాతా ప్రచారం నిర్వహిస్తోంది.

ముడిచమురు దిగుమతుల భారాన్ని తగ్గించడం, వాహన ఉద్గారాలను అదుపు చేయడం, చెరకు, జొన్న రైతులకు మెరుగైన ఆదాయం అందించడమే E20 లక్ష్యమని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. అయితే పాత వాహనాలు ఈ ఇంధనానికి అనుకూలంగా ఉండవని, ఇంజిన్ మైలేజ్ తగ్గడంతో పాటు ఇథనాల్ తయారీకి ఎక్కువ నీటి వినియోగం అవసరమవుతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More