ఒక్క ఛార్జ్‌తో 160 కిమీ రేంజ్.. మార్కెట్లోకి రివోల్ట్ ఆర్‌వీఎక్స్ ఎలక్ట్రిక్ బైక్
ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ల తయారీ సంస్థ రివోల్ట్ మోటార్స్ సరికొత్త 'ఆర్‌వీఎక్స్' (RVX) బైక్‌ను భారత మార్కెట్లోకి తెచ్చింది. ఆకర్షణీయమైన డిజైన్, ఆధునిక ఫీచర్లతో వచ్చిన ఈ సరికొత్త ఈవీ ధర, స్పెసిఫికేషన్ల పూర్తి వివరాలు మీకోసం.
గురుగ్రామ్‌కు చెందిన రివోల్ట్ మోటార్స్ (Revolt Motors) సరికొత్త ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ 'రివోల్ట్ ఆర్‌వీఎక్స్' (Revolt RVX) ను ఆవిష్కరించింది. ఈ సరికొత్త బైక్ ప్రారంభ ధరను రూ. 1.29 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) నిర్ణయించగా, ప్రభుత్వ సబ్సిడీల తర్వాత దీనిని రూ. 1.24 లక్షలకే సొంతం చేసుకోవచ్చు.

దేశ రాజధాని ఢిల్లీలో ఈ బైక్ ధర మరింత తక్కువగా ఉండనుంది. అక్కడ అమలులో ఉన్న ఈవీ పాలసీ సబ్సిడీ వర్తిస్తే కేవలం రూ. 95,000లకే (ఎక్స్-షోరూమ్) లభిస్తుంది. ఒకవేళ వినియోగదారులు తమ పాత పెట్రోల్ బైక్‌ను స్క్రాప్ (రద్దు) చేసి ఈ సరికొత్త ఈవీని కొనుగోలు చేస్తే, కేవలం రూ. 85,000లకే సొంతం చేసుకోవచ్చని కంపెనీ ప్రకటించింది. ఇప్పటికే ఈ బైక్ బుకింగ్స్ ప్రారంభం కాగా, జూలై చివరి వారం నుండి డెలివరీలు ప్రారంభం కానున్నాయి.
రివోల్ట్ మోటార్స్ పోర్ట్‌ఫోలియోలో ఇప్పటికే ఆర్‌వీ1, ఆర్‌వీ1+, ఆర్‌వీ బ్లేజ్‌ఎక్స్, ఆర్‌వీ400 బీఆర్‌జెడ్, ఆర్‌వీ400 మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో బ్లేజ్‌ఎక్స్ సాధారణ ప్రయాణాలకు అనువుగా ఉండే కమ్యూటర్ బైక్ కాగా, ఆర్‌వీ400 పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ మోడల్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఆ జాబితాలోకి సరికొత్త ఫీచర్లతో ఆర్‌వీఎక్స్ వచ్చి చేరింది.
షార్క్ డిజైన్.. అదిరిపోయే ఫీచర్లు
సరికొత్త రివోల్ట్ ఆర్‌వీఎక్స్ ఎలక్ట్రిక్ బైక్‌ను షార్క్ (సొరచేప) శరీరాకృతి నుంచి స్ఫూర్తి పొంది డిజైన్ చేశారు. ఇది ఎలక్ట్రిక్ బ్లూ, పెర్ల్ బ్లాక్, ఎక్లిప్స్ వైట్ అనే మూడు ఆకర్షణీయమైన రంగులలో లభిస్తుంది. రైడర్ల సౌకర్యార్థం ఇందులో ఇన్‌స్టంట్ బూస్ట్ మోడ్, హిల్ హోల్డ్ కంట్రోల్, వాక్ అసిస్ట్, రివర్స్ మోడ్ వంటి ఆధునిక ఫీచర్లను జోడించారు.
కార్బన్ ఫైబర్ ప్యానెల్స్, పొడవైన సీటు, కనెక్టెడ్ టెక్నాలజీ ఈ బైక్ సొంతం. ఈ బైక్ 14 డిగ్రీల వాలు ఉన్న రోడ్లను కూడా సులభంగా ఎక్కగలదు (వెనుక ప్రయాణికుడు ఉంటే ఇది 11 డిగ్రీలకు మారుతుంది). అలాగే పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, నాలుగు విభిన్న శబ్దాలను ఉత్పత్తి చేసే సౌండ్ బాక్స్, ముందు-వెనుక ఎల్‌ఈడీ (LED) లైటింగ్‌ను అమర్చారు.
బ్యాటరీ సామర్థ్యం.. రేంజ్
సస్పెన్షన్ విషయానికి వస్తే ముందు భాగంలో యూఎస్‌డీ (USD) ఫోర్క్, వెనుక భాగంలో మోనోషాక్ అబ్జార్బర్‌ను ఉపయోగించారు. రివోల్ట్ ఆర్‌వీఎక్స్‌లో 3.24 కిలోవాట్ అవర్ (kWh) పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్‌ను అందించారు. ఇది ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే గరిష్టంగా 160 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని కంపెనీ స్పష్టం చేసింది. ఈ బైక్ గరిష్ట వేగం గంటకు 90 కిలోమీటర్లు.
సాధారణ ఛార్జర్ ద్వారా 3 గంటల 30 నిమిషాల్లో బ్యాటరీ 0 నుండి 80 శాతానికి చేరుకుంటుంది. అదే ఫాస్ట్ ఛార్జర్ ఉపయోగిస్తే కేవలం 80 నిమిషాల్లోనే 80 శాతం ఛార్జింగ్ అవుతుంది.
వారంటీ వివరాలు
ఈ బైక్‌పై కంపెనీ 3 సంవత్సరాలు లేదా 40,000 కిలోమీటర్ల స్టాండర్డ్ వారంటీని ఇస్తోంది. వీటితో పాటు అదనపు భద్రత కోసం 8 సంవత్సరాలు లేదా 80,000 కిలోమీటర్ల పొడిగించిన (Extended) వారంటీ ఆప్షన్‌ను కూడా కస్టమర్లకు అందిస్తోంది.
| Revolt RVX: Specifications in a nutshell | |
|---|---|
| Battery | 3.24 kWh portable |
| Range | Up to 160 km |
| Top speed | 90 kmph |
| Standard charging (0%-80%) | 3.30 hours |
| Fast charging (0%-80%) | 80 minutes |
| Suspension | USD fork (Front), Monoshock (Rear) |
| Brake | Discs (Front and rear) |
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


