Royal Enfield Flying Flea C6 : రాయల్ ఎన్‌ఫీల్డ్ తొలి ఎలక్ట్రిక్ బైక్ బుక్​ చేశారా? బిగ్ అప్డేట్..

Royal Enfield electric bike : ప్రముఖ టూవీలర్ దిగ్గజం రాయల్ ఎన్‌ఫీల్డ్ తన సరికొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ‘ఫ్లయింగ్ ఫ్లీ సీ6’ డెలివరీలను భారత్‌లో అధికారికంగా ప్రారంభించింది. బెంగళూరు నగరంలో తొలి విడత డెలివరీలు జరుగుతున్నాయి. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Jun 21, 2026, 09:59:14 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రేమికులకు సరికొత్త ఎలక్ట్రిక్ అనుభూతిని పరిచయం చేస్తూ.. కంపెనీ తన ప్రతిష్టాత్మక ఈవీ ప్రయాణంలో కీలక అడుగు వేసింది! మార్కెట్​లో ఎంతో కాలంగా ఆసక్తి రేకెత్తిస్తున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ సీ6 ఎలక్ట్రిక్ బైక్ డెలివరీలను సంస్థ అధికారికంగా ప్రారంభించింది. భారత దేశ సిలికాన్ వ్యాలీ బెంగళూరులో ఈ బైక్ మొదటి విడత డెలివరీలు షురూ అయ్యాయి. కేవలం బైక్ అందించడమే కాకుండా, వినియోగదారులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండేందుకు నగరంలో ప్రత్యేకంగా ఒక డెడికేటెడ్ ఈవీ సపోర్ట్ నెట్‌వర్క్‌ను కూడా కంపెనీ ఏర్పాటు చేసింది. దీనివల్ల ఈ ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేయడం అనేది కస్టమర్లకు మరింత సులభం, అనుకూలంగా మారనుంది.

రాయల్​ ఎన్​ఫీల్డ్​ తొలి ఎలక్ట్రిక్​ బైక్​..
రాయల్​ ఎన్​ఫీల్డ్​ తొలి ఎలక్ట్రిక్​ బైక్​..

నగరంలోని బీటీఎం లేఅవుట్​లో ఒక ప్రధాన హబ్ సర్వీస్ సెంటర్‌ను రాయల్ ఎన్‌ఫీల్డ్ ఏర్పాటు చేసింది. బైక్‌లో వచ్చే క్లిష్టమైన సాంకేతిక సమస్యల పరిష్కారం, భారీ మెయింటెనెన్స్ పనులను ఈ హబ్ చూసుకుంటుంది. దీనితో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చిన్న చిన్న సర్వీస్ పాయింట్ల ద్వారా రోజువారీ సాధారణ సర్వీసింగ్ సేవలను అందిస్తారు.

బైక్ యజమానులకు మరింత మెరుగైన అనుభవాన్ని అందించడానికి రాయల్ ఎన్‌ఫీల్డ్ తన పాత డీలర్ నెట్‌వర్క్‌ను చక్కగా వాడుకుంటోంది. ప్రస్తుతం ఉన్న షోరూమ్‌లు, సర్వీస్ సెంటర్లలోనే 'షాప్-ఇన్-షాప్' (షోరూమ్‌లోనే ప్రత్యేక విభాగం) పద్ధతిలో ఈ ఫ్లయింగ్ ఫ్లీ బైకులను ప్రదర్శిస్తున్నారు. దీనికోసం విడిగా ఎలాంటి భారీ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయకుండానే కంపెనీ తన పరిధిని వేగంగా విస్తరిస్తోంది. అదనపు భద్రత కోసం వినియోగదారులకు 24 గంటల పాటు రోడ్‌సైడ్ అసిస్టెన్స్ సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నారు.

రాయల్​ ఎన్​ఫీల్డ్​ తొలి ఎలక్ట్రిక్ బైక్- ధర, బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్..

ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన రాయల్​ ఎన్​ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ సీ6 బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 2.79 లక్షలుగా ఉంది. అయితే, కస్టమర్లపై ప్రారంభ పెట్టుబడి భారాన్ని తగ్గించడానికి రాయల్ ఎన్‌ఫీల్డ్ వినూత్నమైన 'బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్' (బీఏఏఎస్) ప్రోగ్రామ్‌ను కూడా తీసుకొచ్చింది. ఈ ప్లాన్ కింద ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ధర రూ. 1.99 లక్షలు మాత్రమే ఉంటుంది, కాకపోతే బ్యాటరీకి సంబంధించిన బిల్లును విడిగా చెల్లించాల్సి ఉంటుంది. బైక్ కొనేటప్పుడు ఒకేసారి అంత డబ్బు పెట్టలేని వారికి ఈ ఆప్షన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

రాయల్​ ఎన్​ఫీల్డ్​ ఫ్లయింగ్ ఫ్లీ సీ6- మైలేజ్, పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే?

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ సీ6 బైక్‌లో 3.91 కిలోవాట్ అవర్ సామర్థ్యం గల శక్తివంతమైన బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. ఈ బైక్ ఒకే ఒక్క పూర్తి ఛార్జింగ్‌పై గరిష్టంగా 154 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఇందులో ఉపయోగించిన పర్మనెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటార్ 15.4కేడబ్ల్యూ పవర్, 60ఎన్​ఎం టాప్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ మోటార్ సాయంతో బైక్ కేవలం 3.7 సెకన్లలోనే 0 నుంచి 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. అలాగే దీని గరిష్ట వేగం గంటకు 115 కిలోమీటర్లుగా ఉంది.

పట్టణాల్లో సులభంగా ప్రయాణించేలా కేవలం 124 కిలోల బరువుతో ఈ బైక్‌ను ఎంతో తేలికగా, సన్నగా డిజైన్ చేశారు. దీనికి అమర్చిన పెద్ద 19-ఇంచుల వీల్స్, 90-సెక్షన్ సన్నని టైర్లు సిటీ ట్రాఫిక్‌లో బైక్‌ను సులభంగా కంట్రోల్ చేయడానికి సహాయపడతాయి. ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో 3.5-ఇంచుల గుండ్రటి కలర్ టీఎఫ్‌టీ డిస్‌ప్లే, మనకు నచ్చినట్లు అడ్జస్ట్ చేసుకోగలిగే రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్, 5 విభిన్న రైడింగ్ మోడ్స్, లీన్-సెన్సిటివ్ ట్రాక్షన్ కంట్రోల్, డ్యూయల్ చానల్ ఏబీఎస్ వంటి అధునాతన సేఫ్టీ ఫీచర్లను అందించారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More