Himalayan 440 : రాయల్​ ఎన్​ఫీల్డ్ లవర్స్​కి బిగ్ అప్డేట్! ఇంకొన్ని రోజుల్లో కొత్త బైక్ లాంచ్..

రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ సెప్టెంబర్ 4న కొత్త హిమాలయన్ 440 బైక్‌ను విడుదల చేయనుంది. స్క్రమ్ 440, హిమాలయన్ 450 మోడళ్ల మధ్య ఈ బైక్ మార్కెట్లోకి రానుంది. ఈ నేపథ్యంలో ఈ బైక్​కి సంబంధించి ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Aug 15, 2026, 16:20:33 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రముఖ మోటార్ సైకిల్ తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ తన అడ్వెంచర్ లైనప్‌ను మరింత విస్తరిస్తోంది. ఇందులో భాగంగా.. ఆర్​ఈ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'హిమాలయన్ 440' బైక్‌ను సెప్టెంబర్ 4న విడుదల చేయనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది.

రాయల్​ ఎన్​ఫీల్డ్ హిమాలయన్ 440..
రాయల్​ ఎన్​ఫీల్డ్ హిమాలయన్ 440..

బ్రాండ్ లైనప్‌లో ఇప్పటికే ఉన్న స్క్రమ్ 440. హై-ఎండ్ హిమాలయన్ 450 మోడళ్ల మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చేందుకు ఈ బైక్‌ను తీసుకొస్తున్నారు. హిమాలయన్ 450 మోడల్ కంటే ఇది సరసమైన ధరలో లభించడంతో పాటు, తక్కువ సాంకేతిక సంక్లిష్టతలతో సామాన్య రైడర్లకు ఈ రాయల్​ ఎన్​ఫీల్డ్ హిమాలయన్ 440 మరింత చేరువ కానుంది. అదే సమయంలో హిమాలయన్ సిరీస్‌కు ఉండే రఫ్‌ అండ్ టఫ్ స్వభావాన్ని ఇది పూర్తిగా కలిగి ఉంటుంది.

రాయల్​ ఎన్​ఫీల్డ్ హిమాలయన్ 440- ఇంజిన్, పనితీరు..

ఈ కొత్త హిమాలయన్ 440 బైక్ అప్‌డేటెడ్ స్క్రమ్ 440 ప్లాట్‌ఫారమ్ ఆధారంగా రూపుదిద్దుకుంది. ఈ బైక్​లో ఎల్​ఎస్440 ఇంజిన్‌ను ఉపయోగించారు. స్క్రమ్ మోడల్‌లో ఈ సింగిల్ సిలిండర్ మోటార్ 6,250 ఆర్‌పీఎమ్ వద్ద 25.4 హెచ్‌పీ పవర్​ని, 4,000 ఆర్‌పీఎమ్ వద్ద 34 ఎన్ఎమ్ టార్గ్‌ను అందిస్తుంది. పాత హిమాలయన్ 411 మోడల్‌తో పోలిస్తే సిలిండర్ బోర్ కొంచెం ఎక్కువగా ఉండటం వల్ల పవర్ అవుట్‌పుట్ స్వల్పంగా మెరుగ్గా ఉంది. ఇంజిన్ పరంగా పెద్దగా మార్పులు ఉండవని, గతంలో హిమాలయన్ 411, స్క్రమ్ 411 ఒకే రకమైన ఇంజిన్‌ను పంచుకున్న మాదిరిగానే ఇది కూడా కొనసాగుతుందని అంచనాలు ఉన్నాయి.

రాయల్​ ఎన్​ఫీల్డ్ హిమాలయన్ 440- వీల్స్, సస్పెన్షన్..

స్క్రమ్ 440 మోడల్‌తో పోలిస్తే ఈ రాయల్​ ఎన్​ఫీల్డ్ కొత్త బైక్ వీల్స్, సస్పెన్షన్ సెటప్ కాస్త భిన్నంగా ఉండనుంది. రోడ్ల మీద ఎక్కువగా తిరిగే స్క్రమ్ మోడల్ 19 ఇంచుల ముందు వీల్, 17 ఇంచుల వెనుక వీల్ ఆప్షన్‌తో వస్తుంది. అయితే హిమాలయన్ 440 మాత్రం పాత 411 మోడల్ మాదిరిగానే ఆఫ్‌రోడింగ్‌కు అనుకూలమైన 21 ఇంచుల ఫ్రంట్ వీల్‌ను కలిగి ఉంటుందని సమాచారం. దీనికి ట్యూబ్డ్ వైర్-స్పోక్ రిమ్స్‌ను అమర్చే అవకాశం ఉంది. అలాగే ముందు భాగంలో సస్పెన్షన్ ట్రావెల్ 200 ఎంఎంకి పెరిగే అవకాశం ఉంది. ఈ మార్పుల వల్ల కఠినమైన రోడ్లపై డ్రైవింగ్ చేయడం మరింత సులభమవుతుంది.

రాయల్​ ఎన్​ఫీల్డ్ హిమాలయన్ 440- సాధారణ ఫీచర్లు, ధర వివరాలు..

హిమాలయన్ 450 మోడల్ మాదిరిగా ఇందులో పూర్తి కలర్ టీఎఫ్‌టీ డిస్‌ప్లే, టర్న్-బై-టర్న్ నావిగేషన్, యూఎస్‌డీ ఫ్రంట్ ఫోర్క్ లేదా సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్ వంటి అధునాతన హంగులు ఉండకపోవచ్చు. దీనికి బదులుగా పాత 411 మోడల్​లానే.. ఎలాంటి సంక్లిష్టతలు లేని సింపుల్ ఫీచర్లను ఇష్టపడే రైడర్లను ఈ బైక్ ఆకట్టుకోనుంది.

సంక్లిష్టమైన ఎలక్ట్రానిక్స్ కంటే మన్నిక, వాడుకలో సులభంగా ఉండే ప్రాథమిక ఇన్‌స్ట్రుమెంటేషన్‌ను ఈ రాయల్​ ఎన్​ఫీల్డ్ హిమాలయన్ 440 అందించనున్నారు.

ప్రస్తుతం మార్కెట్లో స్క్రమ్ 440 ధర రూ. 2.25 లక్షల నుంచి రూ. 2.32 లక్షల మధ్య ఉండగా, హిమాలయన్ 450 ధర రూ. 3.08 లక్షల నుంచి రూ. 3.40 లక్షల వరకు ఉంది. ఈ రెండు మోడళ్ల మధ్య సరిగ్గా సరిపోయేలా హిమాలయన్ 440 ధరను నిర్ణయించే అవకాశం ఉంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More