Royal Enfield Classic 350 : సరికొత్తగా క్లాసిక్ 350- రాయల్ ఎన్‌ఫీల్డ్ లవర్స్ కోసం కొత్త ఫీచర్స్..
Royal Enfield Classic 350 : రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న 2026 క్లాసిక్ 350 మోడల్ సరికొత్త అప్‌డేట్లతో మార్కెట్లోకి వచ్చింది. బైక్ ఐకానిక్ రెట్రో లుక్‌ను మార్చకుండా, రైడర్ల సౌకర్యాన్ని పెంచే రెండు అద్భుతమైన ఫీచర్లను కంపెనీ ఇందులో జోడించింది. పూర్తి వివరాలు..
భారతీయ రోడ్లపై 'రాయల్ ఎన్‌ఫీల్డ్' బైక్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా యువతలో, లాంగ్ రైడ్స్ వెళ్లే బైకర్లలో క్లాసిక్ 350 మోడల్‌కు ఒక ప్రత్యేకమైన సెంటిమెంట్ ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని పట్టణాలు, నగరాల్లో ఈ బైక్ ఇచ్చే గంభీరమైన 'దుగ్ దుగ్' శబ్దం వినపడని రోడ్డు ఉండదంటే అతిశయోక్తి కాదు. ఈ విపరీతమైన క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని, రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ తన బెస్ట్ సెల్లింగ్ బైక్ అయిన 'క్లాసిక్ 350'ను 2026 వెర్షన్‌కు అనుగుణంగా సరికొత్త రైడర్-ఫోకస్డ్ ఫీచర్లతో అప్‌డేట్ చేసింది.

ఈ 2026 రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని అధికారిక రాయల్ ఎన్‌ఫీల్డ్ డీలర్‌షిప్‌లలో అందుబాటులోకి వచ్చింది. దీని ప్రారంభ ధరను రూ. 1,87,434 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. పాత లుక్‌ను అలాగే ఉంచుతూనే, రోజువారీ ప్రయాణాల్లో రైడర్లకు మరింత సులువైన డ్రైవింగ్ అనుభూతిని ఇచ్చేందుకు కంపెనీ రెండు కీలక మార్పులు చేసింది.
2026 రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350- అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్ జోడింపు!
ఈ 2026 మోడల్‌లో వచ్చిన అతిపెద్ద మెకానికల్ మార్పు ‘అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్’ ఫీచర్. నగరాల్లో పీక్ అవర్స్ ట్రాఫిక్‌లో బైక్ నడపడం ఒక పెద్ద టాస్క్. పదే పదే క్లచ్ నొక్కడం వల్ల రైడర్ల చేతులు నొప్పులు పుడుతుంటాయి. ఈ కొత్త స్లిప్పర్ క్లచ్ టెక్నాలజీ వల్ల క్లచ్ లివర్ చాలా తేలికగా మారుతుంది. దీనివల్ల స్టాప్-అండ్-గో ట్రాఫిక్‌లో బైక్ రైడింగ్ సులభతరం అవ్వడమే కాకుండా, లాంగ్ టూరింగ్ వెళ్లేటప్పుడు అలసట చాలా వరకు తగ్గుతుంది. ఇప్పటికే ఇదే క్లచ్ సిస్టమ్‌ను మెటియోర్ 350లో వాడారు, అక్కడ దీనికి కస్టమర్ల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
దీనితో పాటు, వేగంగా వెళ్తున్నప్పుడు అగ్రెసివ్‌గా గేర్లు డౌన్‌షిఫ్ట్ చేసినప్పుడు వెనుక చక్రం లాక్ అవ్వకుండా ఈ స్లిప్పర్ ఫంక్షన్ కాపాడుతుంది. దీనివల్ల గేర్ల మార్పిడి చాలా స్మూత్‌గా సాగుతుంది, ఎలాంటి రోడ్డు కండిషన్లలోనైనా రైడర్‌కు బైక్‌పై పూర్తి నియంత్రణ, ఆత్మవిశ్వాసం లభిస్తాయి.
2026 రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350- జర్నీలో మొబైల్ ఛార్జింగ్ టెన్షన్ లేదు!
లాంగ్ రైడ్స్ వెళ్లే వారికి స్మార్ట్‌ఫోన్ ద్వారా జీపీఎస్ నావిగేషన్ వాడుకోవడం ఒక అలవాటు. అయితే జర్నీ మధ్యలో బ్యాటరీ అయిపోతే వచ్చే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఈ సమస్యకు పరిష్కారంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈ బైక్‌లో సరికొత్త ‘యూఎస్‌బీ టైప్-సీ ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్’ను అమర్చింది. ప్రయాణంలో ఉన్నప్పుడే స్మార్ట్‌ఫోన్లు లేదా ఇతర గ్యాడ్జెట్లను వేగంగా ఛార్జ్ చేసుకోవడానికి ఇది వీలు కల్పిస్తుంది. రోజువారీ ఆఫీస్ ప్రయాణాలకు, సుదూర ప్రాంతాల ట్రిప్పులకు ఇది ఎంతో ఉపయోగకరమైన అప్‌గ్రేడ్.
పవర్‌ఫుల్ జే-సిరీస్ ఇంజిన్ యథాతథం..
ఫీచర్లు మారినప్పటికీ, బైక్ గుండెకాయ లాంటి ఇంజిన్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలాంటి మార్పులు చేయలేదు. ఇదివరకు ఉన్న నమ్మకమైన 349సీసీ, సింగిల్-సిలిండర్, ఎయిర్-ఆయిల్ కూల్డ్ జే-సిరీస్ ఇంజిన్‌నే ఇందులోనూ కొనసాగించారు. ఈ మోటార్ అందించే లో-ఎండ్ టార్క్, స్మూత్ పవర్ డెలివరీ రైడర్‌కు రిలాక్స్‌డ్ డ్రైవింగ్ ఫీల్‌ను ఇస్తాయి.
ఈ ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో అనుసంధానించి ఉంటుంది. క్లాసిక్ 350 మోడల్ బెస్ట్ సెల్లర్‌గా నిలవడానికి కారణమైన ఆ కంఫర్టబుల్ రైడింగ్ పోశ్చర్, బ్యాలెన్స్‌డ్ ఛాసిస్, డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ సేఫ్టీ సెటప్ ఈ కొత్త వేరియంట్లలోనూ కొనసాగుతున్నాయి.
2026 రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350- కాలాతీత డిజైన్.!
లుక్ పరంగా చూస్తే, రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ బ్రాండ్ హెరిటేజ్ స్టైలింగ్‌ను ఏమాత్రం మార్చలేదు. దీని సిగ్నేచర్ టియర్-డ్రాప్ షేప్ ఫ్యూయల్ ట్యాంక్, క్లాసిక్ రౌండ్ హెడ్‌ల్యాంప్, వింటేజ్ క్రోమ్ ఫినిషింగ్స్ అలాగే ఉన్నాయి. బైక్ లుక్ మార్చితే దాని పాతతనం పోతుందని భావించే వింటేజ్ ప్రియులకు ఇది గుడ్ న్యూస్. కాలంతో పాటు వచ్చే ఆధునిక అవసరాలను తీరుస్తూనే, బైక్, ఒరిజినల్ క్యారెక్టర్‌ను టైమ్‌లెస్ అప్పీల్‌ను కాపాడటమే ఈ 2026 అప్‌డేట్ ముఖ్య ఉద్దేశమని రాయల్ ఎన్‌ఫీల్డ్ స్పష్టం చేసింది.
ప్రస్తుతానికి ఈ బైక్ మొత్తం 9 ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో లభిస్తోంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


