రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 కొత్త ఎడిషన్ లాంచ్.. భారత్‌లో 25 బైక్‌లే

ప్రముఖ బైక్ తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ సరికొత్త లిమిటెడ్ ఎడిషన్ 'షాట్‌గన్ 650 x రఫ్ క్రాఫ్ట్స్' బైక్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా కేవలం 100 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉండగా, భారత మార్కెట్‌కు 25 బైక్‌లను కేటాయించారు. దీని ఎక్స్-షోరూమ్ ధరను రూ. 5.75 లక్షలుగా నిర్ణయించారు.

Published on: Jul 15, 2026, 17:50:09 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ ప్రియులకు, ముఖ్యంగా మోటార్ సైకిల్ కలెక్టర్లకు కంపెనీ అదిరిపోయే వార్త చెప్పింది. తన మోడళ్లలో అత్యంత అరుదైన, పరిమిత సంఖ్యలో లభించే 'షాట్‌గన్ 650 x రఫ్ క్రాఫ్ట్స్' (Shotgun 650 x Rough Crafts) ఎడిషన్ రిజిస్ట్రేషన్లను ప్రారంభించింది. తైవాన్‌కు చెందిన ప్రసిద్ధ కస్టమ్ వర్క్‌షాప్ 'రఫ్ క్రాఫ్ట్స్' భాగస్వామ్యంతో ఈ బైక్‌ను సరికొత్త హంగులతో క్లాసిక్ లుక్‌లో తీర్చిదిద్దారు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 కొత్త ఎడిషన్ లాంచ్.. భారత్‌లో 25 బైక్‌లే
రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 కొత్త ఎడిషన్ లాంచ్.. భారత్‌లో 25 బైక్‌లే

పరిమిత సంఖ్యలోనే లభ్యం

ఈ సరికొత్త మోడల్‌ను రాయల్ ఎన్‌ఫీల్డ్ సాధారణ బైక్‌లలా భారీ సంఖ్యలో విక్రయించడం లేదు. కేవలం బైక్ కలెక్టర్లను లక్ష్యంగా చేసుకుని పరిమిత సంఖ్యలోనే ఉత్పత్తి చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 100 యూనిట్లను మాత్రమే తయారు చేస్తుండగా.. భారత్, ఐరోపా, అమెరికా, ఏషియా పసిఫిక్ (APAC) ప్రాంతాలకు తలో 25 బైక్‌ల చొప్పున కేటాయించారు. అంటే మన దేశంలో కేవలం 25 మందికి మాత్రమే ఈ బైక్ సొంతం చేసుకునే అవకాశం దక్కుతుంది. ప్రతి బైక్‌పై దాని ప్రత్యేక నంబర్ ఉంటుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్ గన్ 650
రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్ గన్ 650

జూలై 30న భారత్‌లో విక్రయాలు

ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జూలై 27 నుంచి జూలై 30, 2026 మధ్య వేర్వేరు సమయాల్లో ఈ బైక్ విక్రయాలు సాగనున్నాయి. అన్ని ప్రాంతాల కంటే చివరగా భారత మార్కెట్లో జూలై 30న రాత్రి 7 గంటలకు (IST) ఆన్‌లైన్ విక్రయాలు ప్రారంభమవుతాయి.

ఈ బైక్‌ను కొనుగోలు చేయాలనుకునే వారు జూలై 15 నుంచి జూలై 30 లోపు రాయల్ ఎన్‌ఫీల్డ్ అధికారిక యాప్‌లోని 'డ్రాప్ జోన్' (Drop Zone) లేదా అధికారిక వెబ్‌సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. జూలై 30న సేల్ విండో ఓపెన్ అయినప్పుడు ముందుగా బుక్ చేసుకున్న మొదటి 25 మంది కస్టమర్లకే ఈ బైక్ లభిస్తుంది.

'క్యాలిబర్ రాయల్' స్పూర్తితో డిజైన్

రఫ్ క్రాఫ్ట్స్ సంస్థకు చెందిన విన్‌స్టన్ యే రూపొందించిన ఐకానిక్ కస్టమ్ బైక్ 'క్యాలిబర్ రాయల్' (Caliber Royale) ఆధారంగా ఈ సరికొత్త షాట్‌గన్ 650ని డిజైన్ చేశారు. సరికొత్త లుక్‌తో మెరిసిపోతున్న ఈ బైక్‌లో గ్లోస్ జెట్ బ్లాక్, మ్యాట్ స్టెల్త్ బ్లాక్ కలర్ ఫినిషింగ్‌ను అందించారు. దీనికి అదనంగా గోల్డ్ లీఫ్ స్ట్రైప్స్, గ్రే కలర్ డీటెయిలింగ్ బైక్‌కు మరింత ప్రీమియం లుక్‌ను తీసుకువచ్చాయి. ఇంధన ట్యాంక్‌పై ప్రత్యేక నంబర్‌తో పాటు, అసలైన కస్టమ్ బైక్‌ తరహాలోనే బ్రాస్ (ఇత్తడి) కొల్లాబరేషన్ బ్యాడ్జ్‌ను అమర్చారు.

కాలిబర్ రాయల్
కాలిబర్ రాయల్

బైక్‌లోని ఇతర ప్రధాన ఆకర్షణలు:

  • బ్లాక్ బార్-ఎండ్ మిర్రర్స్
  • క్విల్టెడ్ లెదర్ సీట్లు
  • కాంట్రాస్ట్-కట్ అలాయ్ వీల్స్
  • గోల్డెన్ కలర్ ఫ్రంట్ ఫోర్క్ ట్యూబ్స్

వీటితో పాటు ఈ బైక్‌ను కొనుగోలు చేసే వారికి రఫ్ క్రాఫ్ట్స్ వ్యవస్థాపకుడు విన్‌స్టన్ యే స్వయంగా సంతకం చేసిన క్యాలిబర్ రాయల్ స్కెచ్‌తో కూడిన గోల్డ్-ఆన్-బ్లాక్ ఆర్ట్‌వర్క్‌ను ఉచితంగా అందిస్తారు.

కస్టమైజేషన్‌కు కేరాఫ్ అడ్రస్

రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 మోడల్ కస్టమైజేషన్‌కు ఎంతో అనువుగా ఉంటుందని, అందుకే ఈ భాగస్వామ్యం సాధ్యమైందని కంపెనీ పేర్కొంది.

"షాట్‌గన్ 650 కస్టమ్-ఫస్ట్ ఫిలాసఫీకి ఈ సరికొత్త ఎడిషన్ ఒక అద్భుతమైన ఉదాహరణ. రఫ్ క్రాఫ్ట్స్ సిగ్నేచర్ స్టైల్ అయిన బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్, క్యాలిబర్ రాయల్ డిజైన్ ఈ బైక్‌కు ఆకర్షణీయమైన రూపాన్ని ఇచ్చాయి. ఈ లిమిటెడ్ ఎడిషన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా రైడర్లకు ఒక సరికొత్త కళాఖండాన్ని అందిస్తున్నందుకు గర్వంగా ఉంది" అని రాయల్ ఎన్‌ఫీల్డ్ కస్టమ్ & మోటార్ స్పోర్ట్స్ హెడ్ ఆండ్రియన్ జాన్ సెల్లర్స్ పేర్కొన్నారు.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More