Regime change : ‘భారత్​లో బంగ్లాదేశ్​ తరహా రెజీమ్ ఛేంజ్​కు కుట్ర.. అధికార మార్పిడి అస్సలు జరగదు’!

భారతదేశాన్ని బలహీనపరిచేందుకు విదేశీ శక్తులు తీవ్రంగా యత్నిస్తున్నాయని, అయితే అలాంటి కుట్రలు ఎప్పటికీ నెరవేరవని ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. నాగపూర్‌లో జరిగిన విజయదశమి ఉత్సవాల్లో ఈ మేరకు ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Published on: Oct 20, 2026, 10:45:23 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) అధినేత మోహన్ భాగవత్ విజయదశమి పర్వదినం సందర్భంగా నాగపూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ దేశంలో జరుగుతున్న పరిణామాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ సాధిస్తున్న వేగవంతమైన ప్రగతిని అడ్డుకోవడమే లక్ష్యంగా విదేశీ శక్తులు విచ్ఛిన్నకర కుట్రలు పన్నుతున్నాయని, అయితే ఆ ప్రయత్నాలు ఎప్పటికీ ఫలించవని తేల్చిచెప్పారు. కేవలం ప్రభుత్వాలు లేదా అధికార మార్పిడి జరిగినంత మాత్రాన సమాజంలో పరిస్థితులు మారిపోవని వ్యాఖ్యానించారు.

ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భాగవత్ (@RSSorg)
ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భాగవత్ (@RSSorg)

‘పశ్చిమ దేశాల నుంచి ముంచుకొస్తున్న తుఫాను..’

పశ్చిమ దేశాల నుంచి భారత్‌ వైపు ఒక సాంస్కృతిక, సామాజిక తుఫాను ముంచుకొస్తోందని మోహన్ భాగవత్ హెచ్చరించారు. భారతీయ సంస్కృతి, సామాజిక వ్యవస్థలు, జాతీయ భద్రతను సహించలేని కొన్ని శక్తులు దేశాన్ని అభివృద్ధి పథం నుంచి పక్కదారి పట్టించాలని చూస్తున్నాయని ఆరోపించారు. ఫ్రాన్స్, నేపాల్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో అధికార మార్పిడి పేరిట విదేశీ శక్తులు ఏ విధంగా జోక్యం చేసుకున్నాయో ఆయన ఉదాహరణగా పేర్కొన్నారు. భారతదేశంలో కూడా స్వార్థ ప్రయోజనాలు, అధికార దాహం ఉన్న కొందరు వ్యక్తులు ఈ విదేశీ కుట్రలకు బాహాటంగా సహకరిస్తున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు.

‘నిరసనలతో మార్పు రాదు.. పరిష్కారం సమాజం నుంచే!’

ప్రస్తుతం ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా, ఓటర్ల జాబితాల సవరణ (ఎస్​ఐఆర్) అక్రమాలపై జరుగుతున్న ఆందోళనలను పరోక్షంగా ప్రస్తావిస్తూ భాగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ సమస్యా కేవలం నిరసనలు, వీధి ఆందోళనల ద్వారా పరిష్కారం కాదని, నిజమైన మార్పు సమాజం అంతర్గత బలం నుంచే రావాలని స్పష్టం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం లేదా ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే ఆందోళనలు దేశంలో ఉద్రిక్తతలు, అరాచకం, రక్షణ వ్యవస్థలకు విఘాతం కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.

'రెజీమ్ ఛేంజ్' వివాదంపై స్పష్టత!

సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్ ఇటీవల దిల్లీ నిరసనలపై వ్యాఖ్యానిస్తూ, ఇవి కేవలం ఎన్నికల సంస్కరణల కోసం కాదు.. అధికార మార్పిడి (రెజీమ్ ఛేంజ్) కోసం జరుగుతున్న పోరాటమని పేర్కొనడం తీవ్ర రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ గట్టి కౌంటర్ ఇచ్చారు.

"అధికారంలో ప్రభుత్వం మారినంత మాత్రాన వ్యవస్థలు మారిపోవు. గతంలోనూ ఇది జరగలేదు, భవిష్యత్తులోనూ జరగదు," అని స్పష్టం చేశారు.

శరవేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్‌ను దెబ్బతీయడమే లక్ష్యంగా ఆర్‌ఎస్‌ఎస్, దేశీయ వ్యవస్థలపై దాడులు జరుగుతున్నాయని, ఈ తరుణంలో పౌరులంతా అప్రమత్తంగా ఉండి దేశంలో శాంతిభద్రతలను కాపాడుకోవాలని మోహన్ భాగవత్ పిలుపునిచ్చారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More