కాక్రోచ్ జనతా పార్టీపై ఆర్‌ఎస్‌ఎస్ తొలి స్పందన: షాక్ అవ్వాల్సిన పనిలేదు.. అది ప్రజాస్వామ్య లక్షణం

సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) పై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) కీలక వ్యాఖ్యలు చేసింది. యువతరం (Gen Z) ఆలోచనలను, భిన్న స్వరాలను అంగీకరించే శక్తి భారత ప్రజాస్వామ్యానికి ఉందని ఆర్‌ఎస్‌ఎస్ నేత సునీల్ అంబేకర్ పేర్కొన్నారు.

Published on: May 30, 2026, 12:29:04 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రస్తుతం ఇంటర్నెట్ దునియాలో హాట్ టాపిక్‌గా మారిన 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) వ్యవహారంపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) ఎట్టకేలకు స్పందించింది. ఈ వ్యంగ్య పూరిత వేదిక (Satirical Outfit) పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్చలు, భిన్న అభిప్రాయాలు సహజమని ఆర్‌ఎస్‌ఎస్ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ స్పష్టం చేశారు.

ఆర్‌ఎస్‌ఎస్ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్
ఆర్‌ఎస్‌ఎస్ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్

ప్రజాస్వామ్యానికి అంతా తట్టుకునే శక్తి ఉంది

ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో అంబేకర్ మాట్లాడుతూ, భారత ప్రజాస్వామ్యం చాలా బలంగా ఉందని అభిప్రాయపడ్డారు. "మనం ఒక చైతన్యవంతమైన సమాజంలో ఉన్నాం. పారదర్శకమైన ఎన్నికలు, స్వతంత్ర మీడియా, ఇప్పుడు సోషల్ మీడియా.. ఇవన్నీ మన ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగాలు. ఇలాంటి ఓపెన్ ఫోరమ్స్‌లో ప్రతిరోజూ చర్చలు జరుగుతుంటాయి. కాబట్టి, భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం కావడాన్ని చూసి మనం షాక్ అవ్వాల్సిన పనిలేదు. వీటిని సాధారణ ప్రక్రియగానే చూడాలి" అని అంబేకర్ వివరించారు.

ఏమిటీ కాక్రోచ్ జనతా పార్టీ (CJP)?

ఇది ఒక రాజకీయ పార్టీ కాదు, యువత (Gen Z) సోషల్ మీడియా వేదికగా సృష్టించిన ఒక వ్యంగ్య సమూహం. అయితే, దీనికున్న క్రేజ్ చూసి రాజకీయ వర్గాలు విస్తుపోతున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ గ్రూపునకు ఉన్న ఫాలోయింగ్ అధికార భారతీయ జనతా పార్టీతో సహా పలు ప్రధాన పార్టీల కంటే ఎక్కువగా ఉండటం విశేషం. సిస్టమ్‌లోని లోపాలను ఎత్తిచూపుతూ యువత చేసే పోస్ట్‌లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

యువతపై మాకు పూర్తి నమ్మకం ఉంది

దేశ యువతరం (Gen Z) పై ఆర్‌ఎస్‌ఎస్‌కు పూర్తి విశ్వాసం ఉందని అంబేకర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ‘భారత యువత దేశం పట్ల ఎంతో ఆశావహ దృక్పథంతో ఉన్నారు. ప్రజాస్వామ్యం ప్రతి ఒక్కరి స్వరాన్ని, భావోద్వేగాన్ని కలుపుకుపోయే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ప్రజలు మన వ్యవస్థపై నమ్మకం ఉంచాలి’ అని పేర్కొన్నారు.

రాజకీయ వివాదం.. ఆర్‌ఎస్‌ఎస్ మౌనం

సీజేపీ (CJP) వెనుక పాకిస్థాన్ హస్తం ఉందని, దీని వెనుక ఉన్న ఉద్దేశాలు అనుమానాస్పదమని కొందరు బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఈ సంస్థకు చెందిన 'X' (గతంలో ట్విట్టర్) ఖాతాను ప్రభుత్వం నిలిపివేసింది. ఈ వ్యవహారం ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టులో ఉంది.

అయితే, ఈ విషయంలో ఆర్‌ఎస్‌ఎస్ జోక్యం చేసుకుంటుందా? అన్న ప్రశ్నకు అంబేకర్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. "రాజకీయ పార్టీలు, మీడియా, ప్రజాస్వామ్య సంస్థలు ఇలాంటి విషయాలను పరిష్కరించుకోగలవు. మన వ్యవస్థలు ఏవీ బలహీనంగా లేవు. కాబట్టి ఈ విషయంలో ఆర్‌ఎస్‌ఎస్ వెంటనే స్పందించాల్సిన లేదా తలదూర్చాల్సిన అవసరం లేదు" అని ఆయన స్పష్టం చేశారు.

మరోవైపు, అఖిలేష్ యాదవ్, మహువా మోయిత్రా వంటి విపక్ష నేతలతో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు, స్టాండప్ కమెడియన్లు సిజేపీకి మద్దతుగా నిలుస్తుండటంతో ఈ అంశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More