Kim Jong un dead : కిమ్ జోంగ్ ఉన్ మృతి! నార్త్ కొరియాలో అంతర్యుద్ధం?

ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ బ్రెయిన్ హేమరేజ్‌తో కోమాలోకి వెళ్లి మరణించారంటూ సోషల్ మీడియాలో కథనాలు విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. అక్కడ అధికారిక వెబ్‌సైట్ డౌన్ కావడం, చైనా సైన్యం అప్రమత్తమైనట్లు వార్తలు రావడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Updated on: Oct 20, 2026, 05:39:48 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

నార్త్ కొరియాను తన గుప్పిట్లో పెట్టుకుని, ఒక నియంతలా ఆ దేశ ప్రజలను పాలిస్తున్న అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మరణించారా? అంటే అవుననే రూమర్లు వినిపిస్తున్నాయి! 42 ఏళ్ల కిమ్ జోంగ్ ఉన్ తీవ్ర అనారోగ్యానికి గురై మరణించారంటూ నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఆయన మెదడులో రక్తస్రావం (సెరెబ్రల్ హేమరేజ్) జరగడంతో కోమాలోకి జారుకుని, అనంతరం తుదిశ్వాస విడిచారని అనేక వార్తా సంస్థలు ‘రూమర్లు’ అంటూ ప్రచారం చేస్తున్నాయి. త్వరలోనే ఈ విషయాన్ని నార్త్ కొరియా ధ్రువీకరించి, కిమ్ జోంగ్ ఉన్ ఇక లేరన్న వార్తను ప్రపంచానికి తెలియజేస్తుందని సదరు వార్తా సంస్థలు చెబుతున్నాయి.

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్..
ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్..

కిమ్ జోంగ్ ఉన్ మరణ వార్తలు ఎలా మొదలయ్యాయి?

చైనా డెమోక్రసీ పార్టీ (సీడీపీ) ఛైర్మన్ వాంజున్ క్సీ సోషల్ మీడియా వేదికగా చేసిన కొన్ని సంచలన పోస్టులు ఈ పుకార్లకు ప్రధాన కారణంగా మారాయి. కిమ్ అనారోగ్యం పాలవ్వగానే చికిత్స అందించడానికి బీజింగ్‌లోని 'పీకింగ్ యూనియన్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రి' నుంచి వైద్య నిపుణుల బృందం ఉత్తర కొరియాకు వెళ్లినట్లు ఆయన పేర్కొన్నారు. అక్కడ సరైన వైద్య వసతులు లేకపోవడంతో కిమ్‌ను అత్యవసరంగా చైనాకు తరలించినప్పటికీ, చికిత్స ఆలస్యమై ఆయన కన్నుమూశారని, ఆపై మృతదేహాన్ని అత్యంత రహస్యంగా పాంగ్యాంగ్​కు తరలించారని క్సీ అన్నారు.

ఈ పరిణామాల నేపథ్యంలో కిమ్ కుమార్తె కిమ్ జూ-యే అధికార బాధ్యతలు చేపట్టేలా సహకరించేందుకు చైనా కమ్యూనిస్ట్ పార్టీ దాదాపు 9,000 మంది సైనికులను పాంగ్యాంగ్​కు పంపినట్లు ఆయన పేర్కొన్నారు.

అంతేకాకుండా, ఉత్తర కొరియాలో అంతర్యుద్ధం వచ్చే ప్రమాదం ఉందన్న ముందస్తు హెచ్చరికలతో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్​ఏ) నార్తర్న్ థియేటర్ కమాండ్‌ను లెవెల్-3 హై అలర్ట్‌లో ఉంచినట్లు, సైనికుల సెలవులను రద్దు చేసినట్లు వార్తలు రాశారు.

కిమ్ జోంగ్ ఉన్ మృతి- నిజానిజాలపై సస్పెన్స్!

మరోవైపు ఉత్తర కొరియా నుంచి తప్పించుకు వచ్చిన దక్షిణ కొరియా మాజీ ఎంపీ జీ సియోంగ్-హో 'యోన్హాప్ న్యూస్'కు ఇచ్చిన ఇంటర్వ్యూ ఆధారంగా ఈ వార్తలు వచ్చాయని కొందరు పేర్కొన్నప్పటికీ, అందులో కచ్చితమైన ఆధారాలు లేవు. ఆయన గత కొన్నేళ్లుగా మీడియాకు ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వలేదని, సొంత యూట్యూబ్ ఛానెల్‌ను కూడా రెండేళ్ల క్రితమే నిలిపివేసినట్లు స్పష్టమవుతోంది.

కిమ్ జోంగ్ ఉన్ చివరిగా అక్టోబర్ 13న బహిరంగంగా కనిపించారు. వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా 81వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన నూతన క్షిపణి ప్రదర్శనశాలను ఆయన ప్రారంభించారు. ఆ తర్వాత నుంచి ఆయనకు సంబంధించిన ఎలాంటి కొత్త ఫొటోలు గానీ, వీడియోలు గానీ బయటకు రాలేదు.

అధికారిక వెబ్‌సైట్ డౌన్.. కొనసాగుతున్న గందరగోళం!

ఈ ప్రచారానికి మరింత బలం చేకూరుస్తూ ఉత్తర కొరియా ప్రభుత్వ అధికారిక ఆంగ్ల వార్తా పత్రిక 'పాంగ్యాంగ్ టైమ్స్' వెబ్‌సైట్ అకస్మాత్తుగా మూతపడింది! గ్లోబల్ వెబ్‌సైట్ ట్రాకర్లు కూడా పాంగ్యాంగ్ టైమ్స్ సర్వర్లు పనిచేయడం లేదని ధ్రువీకరించాయి. ఏదైనా పెద్ద విషయాన్ని ప్రపంచానికి అధికారికంగా ప్రకటించే ముందే వెబ్‌సైట్‌ను నిలిపివేశారా? అనే కోణంలో అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

అయితే కిమ్ జోంగ్ ఉన్ మరణించారంటూ రూమర్లు రావడం ఇది కొత్తేమీ కాదు! గతంలో కూడా కిమ్ తీవ్ర ఊబకాయం, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని, ఆయన తండ్రి కిమ్ జోంగ్ ఇల్ మాదిరిగానే గుండెపోటుతో మరణించారని దక్షిణ కొరియా నిఘా వర్గాలు చెప్పేవి. ఆ తర్వాత కిమ్ స్వయంగా ప్రజలతో కనిపించేవారు.

కాగా అణు ఆయుధాలు కలిగి ఉన్న ఉత్తర కొరియాలో కిమ్ లేకపోతే ఆసియా ప్రాంతంలో తీవ్ర రాజకీయ అనిశ్చితి, సైనిక ఉద్రిక్తతలు చోటుచేసుకునే అవకాశం ఉండటంతో ప్రపంచ దేశాలన్నీ పాంగ్యాంగ్ పరిణామాలను అత్యంత నిశితంగా గమనిస్తున్నాయి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More