Kim Jong Un : నార్త్ కొరియా నుంచి వేస్తే.. అమెరికాలో పడాలి- కిమ్ జోంగ్ ఉన్ భారీ ‘మిసైల్’ ప్లాన్!
అమెరికా ప్రధాన భూభాగాన్ని తాకగల క్షిపణి సామర్థ్యాన్ని పెంచుకునే దిశగా ఉత్తర కొరియా మరో కీలక అడుగు వేసింది! భారీ శక్తిని ఉత్పత్తి చేసే 'సాలిడ్-ఫ్యూయల్' ఇంజిన్‌ను కిమ్ జోంగ్ ఉన్ సమక్షంలో విజయవంతంగా పరీక్షించినట్లు ఆ దేశ అధికారిక మీడియా ఆదివారం వెల్లడించింది.
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ స్వయంగా ఒక హై-థ్రస్ట్, సాలిడ్-ఫ్యూయల్ ఇంజిన్ పరీక్షను పర్యవేక్షించారు. దేశ వ్యూహాత్మక సైనిక సామర్థ్యాన్ని పెంపొందించే దిశగా ఇది ఒక గొప్ప పరిణామమని ఆయన కొనియాడినట్లు ప్రభుత్వ మీడియా నివేదించింది. తన క్షిపణి అస్త్రాగారాన్ని ఆధునీకరించడం, అమెరికా ప్రధాన భూభాగాన్ని సైతం చేరుకోగల క్షిపణుల సంఖ్యను పెంచడమే లక్ష్యంగా కిమ్ ఈ పరీక్షను నిర్వహించినట్లు తెలుస్తోంది.
నార్త్ కొరియా టెస్ట్- సాంకేతిక వివరాలు, సామర్థ్యం..
కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ ఆదివారం విడుదల చేసిన నివేదిక ప్రకారం.. కిమ్ సమక్షంలో ఈ 'గ్రౌండ్ జెట్' పరీక్ష జరిగింది.
కొత్త మెటీరియల్: ఈ ఇంజిన్ తయారీలో అత్యాధునిక 'కాంపోజిట్ కార్బన్ ఫైబర్' పదార్థాన్ని ఉపయోగించారు.
థ్రస్ట్: ఈ కొత్త ఇంజిన్ గరిష్టంగా 2,500 కిలోటన్నుల థ్రస్ట్‌ను ఉత్పత్తి చేస్తుంది. గతేడాది సెప్టెంబర్‌లో నిర్వహించిన పరీక్షలో ఇది 1,971 కిలోటన్నులుగా ఉంది. అంటే ఇంజిన్ శక్తి గణనీయంగా పెరిగింది.
లక్ష్యం: ఒకే క్షిపణిపై బహుళ అణ్వాయుధాలను అమర్చి, అమెరికా రక్షణ వ్యవస్థలను ఛేదించడమే ఈ శక్తివంతమైన ఇంజిన్ల వెనుక ఉన్న అసలు ఉద్దేశమని విశ్లేషకులు భావిస్తున్నారు.
సాలిడ్ ఫ్యూయల్ ప్రాధాన్యత..
నార్త్ కొరియా వద్ద ఉన్న పాత ద్రవ ఇంధన క్షిపణుల కంటే ఈ ఘన ఇంధన క్షిపణులు అత్యంత ప్రమాదకరమైనవి! ద్రవ ఇంధన క్షిపణులను ప్రయోగానికి ముందే ఇంధనం నింపాల్సి ఉంటుంది, అవి ఎక్కువ కాలం నిల్వ ఉండవు. కానీ, సాలిడ్ ఫ్యూయల్ క్షిపణులను ఏ క్షణంలోనైనా ప్రయోగించవచ్చు. దీనివల్ల అవి గగనతలానికి చేరేలోపు శత్రుదేశాలు గుర్తించడం చాలా కష్టమవుతుంది.
ఐదేళ్ల సైనిక ప్రణాళిక..
ఈ ఇంజిన్ పరీక్ష దేశం నిర్దేశించుకున్న ఐదేళ్ల సైనిక ఆధునికీకరణ కార్యక్రమంలో భాగంగా జరిగింది. 'వ్యూహాత్మక దాడి సాధనాల'ను అప్‌గ్రేడ్ చేయడమే దీని లక్ష్యం. దీని అర్థం అమెరికాను లక్ష్యంగా చేసుకోగల అణ్వాయుధ సామర్థ్యం గల ఖండాంతర క్షిపణులను సిద్ధం చేసుకోవడమేనని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
అమెరికాపై విమర్శలు..
నార్త్ కొరియా పార్లమెంటులో కిమ్ ప్రసంగించిన కొన్ని రోజులకే ఈ పరీక్ష జరగడం గమనార్హం. ఆ ప్రసంగంలో తన దేశం అణ్వాయుధ దేశం అనే హోదాను మార్చలేమని కిమ్ స్పష్టం చేశారు. మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధాన్ని ప్రస్తావిస్తూ అమెరికాను "ప్రపంచ దేశ ఉగ్రవాది, దురాక్రమణదారు," అని ఆయన తీవ్రంగా విమర్శించారు.
నిపుణుల అభిప్రాయం..
నార్త్ కొరియా క్షిపణి సామర్థ్యం పెరుగుతున్నప్పటికీ, ఆ క్షిపణుల అగ్రభాగాన ఉండే వార్‌హెడ్లు భూ వాతావరణంలోకి తిరిగి ప్రవేశించేటప్పుడు ఎదురయ్యే విపరీతమైన వేడిని తట్టుకోగలవా లేదా అనే విషయంలో విదేశీ నిపుణులలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయితే, ఆ దేశం గత దశాబ్ద కాలంగా అణ్వాయుధాల తయారీలో చూపిస్తున్న పట్టుదల దృష్ట్యా ఈ సమస్యను కూడా వారు అధిగమించి ఉంటారని మరికొందరు అంచనా వేస్తున్నారు.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో 2019లో జరిపిన చర్చలు విఫలమైనప్పటి నుంచి కిమ్ తన అణ్వాయుధ సేకరణను వేగవంతం చేశారు. చర్చలకు తలుపులు తెరిచే ఉంచినప్పటికీ, ముందుగా తమ అణ్వాయుధాలను వదులుకోవాలనే నిబంధనను అమెరికా పక్కన పెట్టాలని కిమ్ డిమాండ్ చేస్తున్నారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


