...
...
Next Story

India Russia : రష్యా నుంచి నేరుగా భారత్‌కు రైలు మార్గం? మాస్కో క్రేజీ ప్లాన్..

రష్యాను హిందూ మహాసముద్రంతో అనుసంధానించేలా భారీ రైలు మార్గ నిర్మాణ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. రష్యా నుంచి భారత్ చేరేందుకు వీలుగా భూమార్గంపై చర్చిస్తున్నారు.

Published on: Aug 10, 2026, 06:03:55 IST
Advertisement

రష్యా నుంచి నేరుగా భారత్‌కు ఒక రైలు మార్గం వస్తే ఎలా ఉంటుంది? వినడానికే వింతగా, అద్భుతంగా, కాస్త ఆశ్చర్యకరంగా ఉన్న ఈ ఆలోచనను ఇప్పుడు రష్యా తెరపైకి తెచింది. భవిష్యత్తులో రష్యాను హిందూ మహాసముద్రంతో అనుసంధానించేలా ఒక రైల్వే నెట్‌వర్క్‌ను అన్వేషించాలని ఆ దేశం భావిస్తోంది. దీని ద్వారా నేరుగా భారత్‌కు రవాణా మార్గం తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది.

రష్యా టు ఇండియా.. ట్రైన్ ట్రాక్?
రష్యా టు ఇండియా.. ట్రైన్ ట్రాక్?

టాస్ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రష్యా ఉప ప్రధాని మరాత్ ఖుస్నుల్లిన్ ఈ కీలక ప్రతిపాదనను బయటపెట్టారు. బాస్ఫరస్, హుర్ముజ్ జలసంధి వంటి కీలకమైన సముద్ర మార్గాల్లో తలెత్తే రవాణా ముప్పును తగ్గించుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.

అసలు రష్యా ప్రతిపాదన ఏంటి?

హిందూ మహాసముద్రానికి చేరుకునేలా ఒక కొత్త రైల్వే మార్గాన్ని నిర్మించే సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఖుస్నుల్లిన్ సూచించారు.

రష్యా నుంచి బయలుదేరి తుర్క్‌మెనిస్తాన్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్‌ల మీదుగా ప్రయాణించి చివరికి భారత్‌ను చేరుకునే ఒక మార్గాన్ని ఆయన పరిశీలనలోకి తెచ్చారు.

భారత్‌కు రవాణా సౌలభ్యం కల్పించే ఏ మార్గానికైనా తాము సిద్ధమేనని ఆయన పేర్కొన్నారు. అయితే, ప్రస్తుతానికి ఇది కేవలం ఒక ప్రతిపాదన మాత్రమే అని వివరించారు.

రష్యా-భారత్ మధ్య ఇప్పటికైతే ఎలాంటి అధికారిక ప్రయాణికుల రైలు, నిర్దిష్ట రూట్, టికెట్ ధరలు లేదా ప్రారంభ తేదీ వంటి విషయాలపై ఎలాంటి స్పష్టత లేదు. ఇవన్నీ కేవలం ప్రాథమిక ఆలోచనల దశలోనే ఉన్నాయి.

రష్యా ఈ రైలు మార్గం ఎందుకు కోరుకుంటోంది?

ప్రధాన సముద్ర మార్గాలకు బలమైన ప్రత్యామ్నాయాన్ని సృష్టించడమే ఈ భారీ ప్రతిపాదన ప్రధాన ఉద్దేశం.

భారత్ వైపునకు రైలు మార్గం ఏర్పడితే, పూర్తిగా సముద్ర మార్గాలపైనే ఆధారపడకుండా సరుకులను హిందూ మహాసముద్రానికి తరలించడానికి రష్యాకు కూడా మరో అద్భుతమైన అవకాశం లభిస్తుంది.

మరోవైపు భారత్‌కు కూడా ఈ రైల్వే కారిడార్ ద్వారా రష్యా, మధ్య, దక్షిణ ఆసియా దేశాలతో బలమైన భూసార రవాణా సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది. ఒకవేళ ఈ బృహత్తర ప్రణాళిక నిజమై, రెండు దేశాల మధ్య భూమార్గ అనుసంధానత సాకారమైతే, భవిష్యత్తులో పర్యాటక రంగం కూడా కొత్త పుంతలు తొక్కుతుంది.

అయితే ఇదంతా భవిష్యత్తులో సాధ్యమయ్యే విషయమే అయినప్పటికీ, రష్యా భారత్ వైపునకు భూమార్గ కనెక్షన్‌ గురించి ఆలోచిస్తుండటం మాత్రం ప్రస్తుతం అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks