సాయి పేరెంటరల్స్‌కు రూ.1,300 కోట్ల సప్లై కాంట్రాక్ట్ డీల్

హైదరాబాద్‌కు చెందిన సాయి పేరెంటరల్స్ లిమిటెడ్ అనుబంధ సంస్థ ఆస్ట్రేలియా ఫార్మసీ నెట్‌వర్క్‌లతో 7.5 ఏళ్ల సరఫరా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ భారీ డీల్ విలువ దాదాపు రూ.1,300 కోట్లు కాగా, దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో కంపెనీ మరింత బలోపేతం కానుంది.

Published on: Jul 1, 2026, 18:50:40 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ప్రముఖ ఫార్మా కంపెనీ సాయి పేరెంటరల్స్ లిమిటెడ్ అంతర్జాతీయ మార్కెట్లో ఒక భారీ మైలురాయిని అందుకుంది. కంపెనీకి చెందిన ఆస్ట్రేలియా అనుబంధ సంస్థ నౌమెడ్ ఫార్మాస్యూటికల్స్ పీటీవై లిమిటెడ్, అక్కడి అగ్రశ్రేణి ఫార్మసీ నెట్‌వర్క్‌లతో ఓటీసీ (OTC) మందుల సరఫరాకు సంబంధించి సరికొత్త ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 7.5 ఏళ్ల సుదీర్ఘ కాలపరిమితి కలిగిన ఈ ప్రతిష్టాత్మక డీల్ విలువ 202 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 1,300 కోట్లు) అని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది.

సాయి పేరెంటరల్స్ నుంచి అనిల్ కేకే, నౌమెడ్ ఫార్మా నుంచి మార్క్ థుల్ బోర్న్
సాయి పేరెంటరల్స్ నుంచి అనిల్ కేకే, నౌమెడ్ ఫార్మా నుంచి మార్క్ థుల్ బోర్న్

ఒప్పందం పూర్తి వివరాలు

ఈ ప్రతిష్టాత్మక సరఫరా ఒప్పందం జూలై 1, 2026 నుండి అమలుల్లోకి వస్తుంది. ఈ ఒప్పందం ద్వారా ఏడాదికి సగటున 27 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల చొప్పున వ్యాపారం జరుగుతుంది. ప్రాథమికంగా ఏడున్నర ఏళ్ల పాటు సాగే ఈ కాంట్రాక్ట్‌ను, ఇరుపక్షాల పరస్పర అంగీకారంతో మరో 3 సంవత్సరాలు పొడిగించుకునే అవకాశం కూడా ఉంది. వ్యాపార విస్తరణను దృష్టిలో ఉంచుకుని, ఈ ఒప్పందం కింద ప్రతి సంవత్సరం 12 కొత్త ఉత్పత్తులను జోడించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనివల్ల ప్రతి ఏడాది కాంట్రాక్ట్ విలువతో పాటు వ్యాపార పరిధి నిరంతరం పెరుగుతుంది.

నౌమెడ్ బాధ్యతలు - వ్యూహాత్మక ప్రయోజనాలు

ఆస్ట్రేలియా మార్కెట్లో ఓటీసీ ఫార్మాస్యూటికల్ ఉత్పత్తుల ప్రత్యేక సరఫరాదారుగా నౌమెడ్ కొనసాగుతుంది. మందుల తయారీ, ప్రొడక్ట్ సోర్సింగ్, నిరంతర రెగ్యులేటరీ నిబంధనల అమలు, టీజీఏ (TGA) రిజిస్ట్రేషన్లు, వేర్‌హౌసింగ్, క్వాలిటీ అస్యూరెన్స్ సహా దేశవ్యాప్త పంపిణీ బాధ్యతలను నౌమెడ్ సంస్థే స్వయంగా నిర్వహిస్తుంది. ఈ సుదీర్ఘ ఒప్పందం సాయి పేరెంటరల్స్ గ్రూప్‌నకు నిరంతర ఆదాయాన్ని అందించడమే కాకుండా, అంతర్జాతీయ ఫార్మా మార్కెట్లో కంపెనీ ఉనికిని మరింత విస్తరిస్తుంది.

యాజమాన్యం హర్షం

"మా అనుబంధ సంస్థ నౌమెడ్ ఫార్మాస్యూటికల్స్‌పై ఆస్ట్రేలియాలోని అగ్రశ్రేణి ఫార్మసీ గ్రూపులు ఉంచిన నమ్మకానికి ఈ ఒప్పంద నవీకరణే నిదర్శనం" అని సాయి పేరెంటరల్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ కుమార్ కరుసాల పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఇతర అంతర్జాతీయ మార్కెట్లలోకి విస్తరించడానికి ఈ విజయం ఒక లాంచ్ ప్యాడ్‌లా ఉపయోగపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

"ఈ సుదీర్ఘ కాలపరిమితి ఒప్పందం మా కస్టమర్లతో ఉన్న బలమైన సంబంధాలను నాణ్యమైన ఉత్పత్తులను సకాలంలో అందించగల మా సామర్థ్యాన్ని చాటి చెబుతోంది, అని నౌమెడ్ ఫార్మాస్యూటికల్స్ సీఈఓ మార్క్ థుల్‌బోర్న్ తెలిపారు.

సాయి పేరెంటరల్స్ నేపథ్యం

2001లో స్థాపితమైన సాయి పేరెంటరల్స్ లిమిటెడ్, అంతర్జాతీయ స్థాయిలో ఐపీ (IP) ఆధారిత ఫార్మాస్యూటికల్ ఫార్ములేషన్స్ రంగంలో సేవలందిస్తోంది. ఈ సంస్థకు భారతదేశంలో ఇంజెక్టబుల్స్, ఓరల్ డోసేజ్ ఫామ్స్ తయారీ ప్లాంట్లు ఉన్నాయి. ఆస్ట్రేలియాలో కూడా ఓరల్ డోసేజ్ ఫామ్స్ కోసం ఒక సరికొత్త మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్‌ను కంపెనీ ఏర్పాటు చేస్తోంది. బలమైన ఆర్‌అండ్‌డీ (R&D) విభాగం సాయంతో భారతదేశంతో పాటు వివిధ అంతర్జాతీయ మార్కెట్లలోని క్లయింట్లకు నాణ్యమైన ఉత్పత్తులను సరఫరా చేస్తోంది.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More