Samsung Galaxy A08 : ఇండియాలో శాంసంగ్ కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్- 6000ఎంఏహెచ్ బ్యాటరీతో, ధర..
శాంసంగ్ ఇండియా మార్కెట్లోకి పవర్‌ఫుల్ 6000ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపీ కెమెరాతో గెలాక్సీ ఏ08 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. మీడియాటెక్ హెలియో జీ99+ ప్రాసెసర్, జెమినీ ఏఐ ఫీచర్లు, 6 ఏళ్ల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల హామీతో వస్తున్న ఈ ఫోన్ విశేషాలు ఇక్కడ తెలుసుకోండి..
బడ్జెట్ ధరలో అధునాతన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఫీచర్లు, సుదీర్ఘమైన బ్యాటరీ లైఫ్‌ను కోరుకునే వినియోగదారుల కోసం ప్రముఖ దక్షిన కొరియా దిగ్గజం శాంసంగ్ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. ‘శాంసంగ్ గెలాక్సీ ఏ08’ పేరుతో ఈ ఫోన్‌ను అధికారికంగా విడుదల చేసింది. 6,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా, ఏకంగా 6 ఏళ్ల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల హామీతో వస్తున్న ఈ ఫోన్ ఎంట్రీ-లెవల్ సెగ్మెంట్‌లో గట్టి పోటీని ఇచ్చేలా ఉంది.

ఈ నేపథ్యంలో ఈ మొబైల్ విశేషాలను ఇక్కడ తెలుసుకోండి..
శాంసంగ్ గెలాక్సీ ఏ08- డిస్‌ప్లే, పర్ఫార్మెన్స్..
ఈ శాంసంగ్ కొత్త స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల హెచ్‌డీ+ పీఎల్ఎస్ ఎల్సీడీ డిస్‌ప్లేతో వస్తోంది. స్మూత్ స్క్రోలింగ్, గేమింగ్ అనుభవం కోసం ఇందులో 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌ను అందించారు. స్క్రీన్ రక్షణ కోసం ముందుభాగంలో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌ను ఉపయోగించారు. ఫోన్ వేగవంతమైన పనితీరు కోసం మీడియాటెక్ హెలియో జీ99+ ప్రాసెసర్‌ను జోడించారు. ఇందులో 4జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ అందుబాటులో ఉంటాయి. మైక్రో ఎస్‌డీ కార్డ్ సహాయంతో స్టోరేజ్‌ను ఏకంగా 2టీబీ వరకు పెంచుకునే వెసులుబాటు కల్పించారు.
శాంసంగ్ గెలాక్సీ ఏ08- కెమెరా వ్యవస్థ, ఏఐ సాంకేతికత
ఫొటోగ్రఫీ ప్రియుల కోసం ఈ శాంసంగ్ గెలాక్సీ ఏ08 వెనుక వైపు డ్యూయల్ కెమెరా సెటప్‌ను అమర్చారు. ఎఫ్/1.8 అపర్చర్‌తో కూడిన 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు, ఎఫ్/2.4 అపర్చర్ ఉన్న 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌ను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందర 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.
ఆండ్రాయిడ్ 16 ఆధారిత వన్ యూఐ 9 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఈ ఫోన్ పనిచేస్తుంది. శాంసంగ్ ఈ ఫోన్‌కు ఏకంగా 6 తరాల ఓఎస్ అప్‌గ్రేడ్లు, 6 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్లను ఇస్తుండటం విశేషం. ఈ సెగ్మెంట్‌లో ఇన్ని ఏళ్ల సాఫ్ట్‌వేర్ సపోర్ట్ ఇవ్వడం అత్యంత అరుదు. అంతేకాకుండా, గూగుల్ సర్కిల్ టు సెర్చ్ 3.0, జెమినీ, పర్‌ప్లెక్సిటీ వంటి అత్యాధునిక ఏఐ ఫీచర్లను కూడా ఈ ఫోన్‌లో పొందుపరిచారు. పవర్ బటన్‌ను లాంగ్ ప్రెస్ చేయడం ద్వారా లేదా వాయిస్ కమాండ్‌తో జెమినీ, పర్‌ప్లెక్సిటీని నేరుగా యాక్సెస్ చేయవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ ఏ08- బ్యాటరీ లైఫ్, ఇతర ఫీచర్లు..
రోజంతా నిరంతరాయంగా వాడేందుకు అనువుగా 6,000ఎంఏహెచ్ సామర్థ్యం గల భారీ బ్యాటరీని ఇచ్చారు. ఇది 25డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ 8 ఎంఎం మందంతో స్లిమ్‌గా కనిపిస్తుంది. ధూళి, నీటి చుక్కల నుంచి రక్షణ కోసం ఐపీ64 రేటింగ్‌ను పొందింది. వినియోగదారుల వ్యక్తిగత డేటా భద్రత కోసం శాంసంగ్ నాక్స్ సెక్యూరిటీ ప్రొటెక్షన్ ఇందులో ఉంది.
శాంసంగ్ గెలాక్సీ ఏ08- ధర, లభ్యత, ఆఫర్లు..
భారత మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ ఏ08 ఫోన్ 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ మోడల్ ధరను రూ.18,499గా నిర్ణయించారు. ఈ ఫోన్ డార్క్ బ్లూ, గ్రీన్, సిల్వర్ రంగుల్లో లభిస్తుంది. శాంసంగ్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్లు, పార్ట్‌నర్ రిటైల్ షాపులు, శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఇతర ఆన్‌లైన్ ఈ-కామర్స్ వేదికలపై కొనుగోలుకు అందుబాటులో ఉంది.
వినియోగదారులను ఆకట్టుకునేందుకు సులభ వాయిదాల పద్ధతిని కూడా ప్రకటించారు. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై 6 నెలల వరకు, అలాగే ఎన్‌బీఎఫ్‌సీ భాగస్వాముల ద్వారా 9 నెలల వరకు వడ్డీ లేని నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లను అందిస్తున్నారు.
మరి మీరు ఈ శాంసంగ్ గెలాక్సీ ఏ08 స్మార్ట్‌ఫోన్‌ని కొంటున్నారా?
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


