ఎస్‌బీఐ వినియోగదారులకు అలర్ట్: అక్టోబర్ 1 నుంచి నగదు ఉపసంహరణ నిబంధనల్లో మార్పులు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తమ బిఎస్‌బిడి (BSBD) ఖాతాదారుల నగదు ఉపసంహరణ సేవా రుసుములలో మార్పులు చేసింది. అక్టోబర్ 1, 2026 నుంచి ఈ కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (BSBD) ఖాతాదారులకు సేవా రుసుములకు సంబంధించి ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది. నూతన నిబంధనల ప్రకారం ప్రతినెల ఉచితంగా ఇచ్చే నాలుగు లావాదేవీల గణన విధానంలో బ్యాంక్ కీలక మార్పులు తీసుకొచ్చింది. ఈ సవరించిన నిబంధనలు 2026 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని బ్యాంక్ స్పష్టం చేసింది.

నెలవారీ పరిమితి లెక్కింపులో మార్పు
బిఎస్‌బిడి ఖాతాదారులకు ప్రతినెల నాలుగు ఉచిత నగదు ఉపసంహరణ సౌకర్యం యథావిధిగా అందుబాటులో ఉంటుంది. అయితే ఆ నాలుగు ఉచిత పరిమితులు దాటిన తర్వాత చేసే ప్రతి అదనపు నగదు ఉపసంహరణపై రూ. 15 తో పాటు జీఎస్‌టీ (GST) ని బ్యాంక్ వసూలు చేస్తుంది.
ఇంతకుముందు వరకు నాలుగు ఉచిత విత్‌డ్రాయల్స్ లెక్కింపులో కేవలం ప్రత్యక్ష నగదు లావాదేవీలను మాత్రమే పరిగణనలోకి తీసుకునేవారు. కానీ అక్టోబర్ 1 నుంచి డిజిటల్ లావాదేవీలను కూడా ఈ ఉచిత పరిమితి పరిధిలోకి చేర్చారు. అంటే ఎస్‌బీఐ ఏటీఎంలు, ఇతర బ్యాంక్ ఏటీఎంలు, బ్యాంక్ బ్రాంచ్ ఛానెళ్లు, డిజిటల్ లావాదేవీల ద్వారా చేసే ఉపసంహరణలన్నీ కలిపి నెలకు గరిష్టంగా నాలుగు సార్లు మాత్రమే ఉచితంగా ఉచితంగా లభిస్తాయి.
బిఎస్‌బిడి (BSBD) ఖాతా అంటే ఏమిటి?
కనీస నిల్వ (మల్టీపుల్ మినిమమ్ బ్యాలెన్స్) నిర్వహించాల్సిన అవసరం లేని సామాన్య, పేద వర్గాల కోసం ఎస్‌బీఐ ఈ బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాను అందిస్తోంది. ఖాతాదారులు విత్‌డ్రాయల్ ఫారమ్ లేదా ఏటీఎం కార్డుల ద్వారా బ్రాంచ్‌లలో డబ్బులు తీసుకోవచ్చు. ఈ ఖాతాతో ఉచితంగా బేసిక్ రూపే (RuPay) ఏటీఎం-కమ్-డెబిట్ కార్డును అందిస్తారు. అయితే ఈ ఖాతాదారులకు చెక్ బుక్ సౌకర్యం అందుబాటులో ఉండదు.
ఉచితంగా లభించే ఇతర సేవలు
కొన్ని సేవలకు ఎస్‌బీఐ ఎలాంటి రుసుములు వసూలు చేయదు.
- రూపే ఏటీఎం డెబిట్ కార్డు జారీ, వార్షిక నిర్వహణ రుసుములు ఉచితం.
- ఎన్‌ఈఎఫ్‌టీ (NEFT), ఆర్‌టీజీఎస్ (RTGS) వంటి డిజిటల్ మార్గాల ద్వారా జరిగే ఎలక్ట్రానిక్ క్రెడిట్‌లపై ఎలాంటి చార్జీలు ఉండవు.
- కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన చెక్కుల జమ లేదా కలెక్షన్ ప్రక్రియ పూర్తిగా ఉచితం.
- నిష్క్రియాత్మకంగా ఉన్న (ఇన్‌ఆపరేటివ్) ఖాతాలను తిరిగి పునరుద్ధరించడానికి ఎలాంటి చార్జీలు వసూలు చేయరు. అయితే ఖాతాను పూర్తిగా మూసివేసే సమయాల్లో నిబంధనల ప్రకారం చార్జీలు వర్తిస్తాయి.
అర్హత నిబంధనలు
ఎస్‌బీఐలో బిఎస్‌బిడి ఖాతా తెరిచేందుకు కొన్ని స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. ఈ ఖాతా ఉన్న వ్యక్తికి ఎస్‌బీఐలో ఇతర ఏ సేవింగ్స్ బ్యాంక్ ఖాతా ఉండకూడదు. ఒకవేళ ఇప్పటికే సాధారణ సేవింగ్స్ ఖాతా ఉన్నవారు బిఎస్‌బిడి ఖాతాను తెరిస్తే, పాత సేవింగ్స్ ఖాతాను 30 రోజుల్లోగా మూసివేయాల్సి ఉంటుంది.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


