SBI Funds Management IPO సబ్‌స్క్రిప్షన్‌కి ఈరోజే లాస్ట్ ఛాన్స్- అప్లై చేయాలా? వద్దా?
SBI Funds Management IPO gmp : దేశంలోనే అతిపెద్ద మ్యూచువల్ ఫండ్ సంస్థ అయిన ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో గ్రే మార్కెట్ ప్రీమియం, నిపుణుల సమీక్ష, అలాట్‌మెంట్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) అనుబంధ సంస్థ అయిన ‘ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్’కు చెందిన రూ. 9,795 కోట్ల ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ నేటితో (జులై 16) ముగియనుంది. దేశంలోనే అతిపెద్ద అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ (ఏఎంసీ) నుంచి వస్తున్న ఇష్యూ కావడంతో మార్కెట్లో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఓకి చెందిన పూర్తి వివరాలను, అప్లై చేయాలా? వద్దా? అనే విషయంపై నిపుణుల అభిప్రాయాలను ఇక్కడ వివరంగా తెలుసుకోండి..

ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ ఐపీఓ- ప్రైస్ బ్యాండ్, యాంకర్ ఇన్వెస్టర్ల జోరు..
ఈ మెగా ఐపీఓ కోసం కంపెనీ రూ. 545 నుంచి రూ. 574గా ప్రైస్ బ్యాండ్ నిర్ణయించింది. ఇన్వెస్టర్లు కనీసం 26 షేర్ల లాట్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పబ్లిక్ ఇష్యూ ప్రారంభానికి ముందే ఈ సంస్థ యాంకర్ ఇన్వెస్టర్ల ద్వారా ఏకంగా రూ. 2,663 కోట్లు రాబట్టి తన సత్తా చాటింది. కంపెనీ తన షేర్లను గరిష్ట ధర అయిన రూ. 574 వద్ద 129 మంది యాంకర్ ఇన్వెస్టర్లకు కేటాయించింది.
ఈ యాంకర్ బుక్‌లో గ్లోబల్ దిగ్గజాలైన జీఐసీ, అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ, బ్లాక్‌రాక్, గోల్డ్‌మన్ శాక్స్, ఫిడిలిటీ వంటి అంతర్జాతీయ సంస్థలు పాల్గొన్నాయి. దేశీయంగా చూస్తే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ వంటి దిగ్గజాలు పెట్టుబడులు పెట్టాయి.
ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ ఐపీఓ- ఉద్యోగులకు భారీ డిస్కౌంట్!
ఈ ఇష్యూలో క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్స్ కోసం 50 శాతం, నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కోసం 15 శాతం, రిటైల్ ఇన్వెస్టర్ల కోసం 35 శాతం షేర్లను కేటాయించారు. కంపెనీలో పనిచేసే అర్హులైన ఉద్యోగులకు ప్రతి షేరుపై రూ. 54 ప్రత్యేక తగ్గింపు ఇస్తుండటం గమనార్హం.
ఈ ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ ఐపీఓ పరిమాణాన్ని పరిశీలిస్తే, ఇది పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్. అంటే ప్రమోటర్లయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన 6.3 శాతం వాటాను, గ్లోబల్ భాగస్వామి అయిన అముండి తన 3.7 శాతం వాటాను విక్రయిస్తున్నాయి. దీని ద్వారా కంపెనీకి కొత్తగా ఎలాంటి నిధులు రావు, ప్రస్తుత వాటాదారులకే ఈ డబ్బు వెళ్తుంది. ఐపీఓ అనంతరం ఎస్బీఐ వాటా 61.76 శాతం నుంచి 55.46 శాతానికి తగ్గనుంది.
ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ ఐపీఓ- సబ్‌స్క్రిప్షన్ వివరాలు..
రెండో రోజు (జూలై 15) ముగిసే సమయానికి ఐపీఓ 2.77 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. ఇందులో రిటైల్ విభాగం 1.61 రెట్లు, ఎన్ఐఐ విభాగం ఏకంగా 6.58 రెట్లు, క్యూఐబీ విభాగం 1.50 రెట్లు బుక్ అయ్యాయి. ఉద్యోగుల కోటా 2.27 రెట్లు, షేర్ హోల్డర్ల కోటా 3.98 రెట్లు సబ్‌స్క్రైబ్ కావడం విశేషం.
ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ ఐపీఓ గ్రే మార్కెట్ ప్రీమియం ఎంత?
ప్రస్తుతం గ్రే మార్కెట్లో ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ ఐపీఓ జీఎంపీ.. షేరుపై రూ. 92 ప్రీమియం నడుస్తోంది. దీని ప్రకారం చూస్తే, గరిష్ట ధర రూ. 574కు ఈ ప్రీమియం కలిపితే స్టాక్ మార్కెట్లో రూ. 666 వద్ద లిస్ట్ అయ్యే అవకాశం ఉంది. అంటే తొలిరోజే ఇన్వెస్టర్లకు సుమారు 16.03 శాతం లిస్టింగ్ లాభాలు వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది.
అయితే గత కొన్ని రోజులుగా జీఎంపీ రూ. 75 నుంచి రూ. 140 మధ్య ఊగిసలాడుతోంది.
ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ ఐపీఓ- అప్లై చేయాలా? వద్దా?
దేశంలోని అగ్రశ్రేణి బ్రోకరేజ్ సంస్థలన్నీ ఈ ఐపీఓకు పాజిటివ్ రేటింగ్ ఇచ్చాయి.
"రూ. 12.5 లక్షల కోట్ల సగటు నిర్వహణ ఆస్తులు, 15.3 శాతం మార్కెట్ షేరుతో ఎస్బీఐ ఫండ్స్ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. లిస్టెడ్ పీర్స్‌తో పోలిస్తే వ్యాల్యూయేషన్లు ఆకర్షణీయంగా ఉన్నాయి కాబట్టి దీర్ఘకాలిక లాభాల కోసం సబ్‌స్క్రైబ్ చేయవచ్చు," అని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ పేర్కొంది.
నిర్మల్ బ్యాంగ్ సెక్యూరిటీస్, ఆనంద్ రాతి, ఆదిత్య బిర్లా క్యాపిటల్ సంస్థలు కూడా ఈ ఐపీఓను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేశాయి. హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ, నిప్పన్ లైఫ్ ఏఎమ్‌సీల కంటే తక్కువ పీఈ రేషియోతో ఈ షేరు లభిస్తోందని, కంపెనీ ఎబిట్డా మార్జిన్ 79 శాతంగా ఉండటం దాని బలాన్ని సూచిస్తోందని విశ్లేషించాయి.
ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ ఐపీఓ- కీలక తేదీలు..
అలాట్‌మెంట్ ఖరారు: 17 జులై
రీఫండ్స్ ప్రక్రియ: 20 జులై
డీమ్యాట్ ఖాతాల్లోకి షేర్లు: 20 జులై
స్టాక్ మార్కెట్ లిస్టింగ్ (బీఎస్ఈ, ఎన్ఎస్ఈ): 21 జులై
(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ఐపీఓలో ఇన్వెస్ట్ చేసే ముందు మీ సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని సంప్రదించడం ఉత్తమం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


