SBI Free Online Courses : గుడ్‌న్యూస్.... SBI నుంచి ఉచిత ఆన్‌లైన్ కోర్సులు - ఏఐతో పాటు మరికొన్ని...!

SBI Free Online Courses : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…. edX ప్లాట్‌ఫామ్‌ ద్వారా ఉచిత ఆన్‌లైన్ కోర్సులను అందుబాటులోకి తెచ్చింది. ఏఐ, డిజిటల్ మార్కెటింగ్, పర్సనల్ బ్రాండింగ్ వంటి కోర్సులు ఇందులో ఉన్నాయి.

Published on: Sep 26, 2026, 11:36:20 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

SBI Free Online Courses : అత్యంత డిమాండ్ ఉన్న నైపుణ్యాలను పెంపొందించుకోవాలనుకునే విద్యార్థులకు దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది. ప్రముఖ అంతర్జాతీయ ఈ-లెర్నింగ్ ప్లాట్‌ఫామ్ 'edX' భాగస్వామ్యంతో ఎస్‌బీఐ పలు రకాల ఆన్‌లైన్ కోర్సులను ఉచితంగా అందిస్తోంది.

ఎస్‌బీఐ నుంచి ఉచిత ఆన్‌లైన్ కోర్సులు!
ఎస్‌బీఐ నుంచి ఉచిత ఆన్‌లైన్ కోర్సులు!

ప్రత్యేకంగా కోర్సులు…

ఈ కోర్సుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), జెనరేటివ్ ఏఐ, బిహేవియోరల్ ఫైనాన్స్, పర్సనల్ బ్రాండింగ్, కంటెంట్ మార్కెటింగ్, లీడర్‌షిప్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇంటర్నేషనల్ ట్రేడ్ (అంతర్జాతీయ వాణిజ్యం) వంటి అత్యాధునిక రంగాలు ఉన్నాయి.

ఈ కోర్సులన్నింటినీ ఎస్‌బీఐ తన సుదీర్ఘమైన శిక్షణా అనుభవాన్ని ఆధారంగా చేసుకుని ప్రత్యేకంగా రూపొందించింది. తన లెర్నింగ్ ఇకోసిస్టమ్‌లో 400 కంటే ఎక్కువ మంది అనుభవజ్ఞులైన బ్యాంకింగ్ నిపుణులు, 6 ప్రత్యేక శిక్షణా సంస్థలు పనిచేస్తున్నాయని ఎస్‌బీఐ తెలిపింది. అంతేకాకుండా 25,000 కంటే ఎక్కువ ఈ-లెసన్స్, కేస్ స్టడీస్, వ్యాసాలు, ఆచరణాత్మక వీడియోల సముదాయంతో ఈ నైపుణ్య ఆధారిత కోర్సులను డిజైన్ చేశారు. కోర్సుల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి…..

బిజినెస్ ఆటోమేషన్ కోసం ఏఐ మరియు జెనరేటివ్ ఏఐ :

వ్యాపారవేత్తలు, మేనేజర్లు, కార్పొరేట్ ఉద్యోగులు ఎటువంటి కోడింగ్ లేదా టెక్నికల్ పరిజ్ఞానం లేకపోయినా.. ఏఐ, జెనరేటివ్ ఏఐ సాంకేతికతలను ఉపయోగించి వ్యాపార ప్రక్రియలను ఎలా ఆటోమేట్ చేయాలో ఈ కోర్సులో నేర్పిస్తారు. సరైన నిర్ణయాలు తీసుకోవడం, ఉత్పాదకతను పెంచడంపై నిజ జీవిత ఉదాహరణలతో అవగాహన కల్పిస్తారు.

బ్యాంకింగ్‌లో ఏజెంటిక్ ఏఐ అప్లికేషన్లు :

బ్యాంకింగ్ రంగంలో వస్తున్న సాంకేతిక మార్పులను అత్యంత సరళమైన, ఆచరణాత్మక విధానంలో విద్యార్థులకు అర్థమయ్యేలా ఈ కోర్సును తీర్చిదిద్దారు. ఈ కోర్సు నమోదు (రిజిస్ట్రేషన్) ప్రక్రియ సెప్టెంబర్ 25 నుంచి ప్రారంభమైంది. మార్చి 31, 2027 వరకు నమోదు చేసుకోవడానికి గడువు ఉంది.

కంటెంట్ మార్కెటింగ్ స్ట్రాటజీ :

డిజిటల్ యుగంలో కస్టమర్లను ఆకర్షించడం, నెట్‌వర్క్ పెంచుకోవడానికి అవసరమైన కంటెంట్ మార్కెటింగ్ వ్యూహాలు, డిజిటల్ మార్కెటింగ్ టూల్స్‌ను ఇందులో కవర్ చేస్తారు. కంటెంట్ సృష్టి, ప్రమోషన్, ఆప్టిమైజేషన్ ద్వారా వ్యాపారాన్ని ఎలా విస్తరించాలో దీని ద్వారా నేర్చుకోవచ్చు.

పర్సనల్ బ్రాండింగ్ :

ఈ కోర్సు డిసెంబర్ 30, 2026 నాటితో పూర్తవుతుంది. ఒక కార్పొరేట్ బ్రాండ్‌కు, పర్సనల్ బ్రాండ్‌కు మధ్య ఉన్న తేడాలు ఏమిటి? అసలు వ్యక్తిగత బ్రాండింగ్ ఎందుకు అవసరం? దానిని ఎలా నిర్మించుకోవాలి? అనే అంశాలపై ఆచరణాత్మక నైపుణ్యాలను ఇందులో అందిస్తారు.

అగ్రి ఈ-కామర్స్.. ఫార్మ్ టు గ్లోబల్ మార్కెట్ :

వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా ప్రపంచ మార్కెట్లతో అనుసంధానించడంలో ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల పాత్రను ఈ కోర్సు వివరిస్తుంది. రైతులు, సహకార సంఘాలు, అగ్రి-ప్రొడ్యూసర్లు ఆన్‌లైన్ వేదికల ద్వారా మెరుగైన ధరలను పొందడం, అంతర్జాతీయ డిమాండ్‌ను వినియోగించుకోవడం ఎలాగో ఈ కోర్సు బోధిస్తుంది.

ఇంట్రడక్షన్ టు బిహేవియోరల్ ఫైనాన్స్ :

ఆర్థిక మార్కెట్లలో మానవ ప్రవర్తన మరియు సైకాలజీ ఎలాంటి ప్రభావం చూపుతుందో వివరించడంతో ఈ కోర్సు ప్రారంభమవుతుంది. ఆర్థిక నిర్ణయాలలో సాధారణంగా జరిగే మానసిక పొరపాట్లు, భావోద్వేగాల ప్రభావం గురించి కేస్ స్టడీలతో లోతుగా చర్చిస్తారు.

edX వేదిక( https://www.edx.org/ )పై ఎస్‌బీఐ అందిస్తున్న ఈ కోర్సులన్నింటినీ విద్యార్థులు పూర్తిగా ఉచితంగా అభ్యసించవచ్చు. కోర్సు పూర్తయిన తర్వాత అధికారికంగా వెరిఫైడ్ సర్టిఫికేట్ కావాలనుకునే అభ్యర్థులు మాత్రం నిర్ణీత రుసుము చెల్లించి సర్టిఫికెషన్ పొందవచ్చు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More