SBI PO Recruitment : నిరుద్యోగులకు అలర్ట్! ఎస్బీఐలో పీఓ పోస్టులు- ఇలా అప్లై చేసుకోండి..

SBI PO apply : 1500 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఎస్బీఐ. రిజిస్ట్రేషన్ ప్రక్రియను సైతం ప్రారంభించింది. డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఈ నేపథ్యంలో ఎస్బీఐ పీఓ రిక్రూట్​మెంట్​ 2026 వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Jun 19, 2026, 06:43:08 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలనుకునే నిరుద్యోగులకు దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ (ఎస్బీఐ) తీపి కబురు అందించింది. భారీ సంఖ్యలో ప్రొబేషనరీ ఆఫీసర్ (పీఓ) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం 1500 పీవో పోస్టులను సంస్థ భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ sbi.bank.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎస్బీఐ పీఓ రిక్రూట్​మెంట్​ 2026 వివరాలు..
ఎస్బీఐ పీఓ రిక్రూట్​మెంట్​ 2026 వివరాలు..

ఈ పోస్టుల ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 18, 2026 నుంచే ప్రారంభమైంది. దరఖాస్తులు సమర్పించడానికి జులై 8, 2026 చివరి తేదీగా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులు చివరి నిమిషం వరకు వేచి చూడకుండా ముందే దరఖాస్తు చేసుకోవడం మంచిది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఎస్బీఐ పీఓ రిక్రూట్​మెంట్​ 2026- విద్యార్హతలు..

ఎస్బీఐ పీఓ రిక్రూట్​మెంట్​ 2026 కోసం ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం గుర్తించిన దానికి సమానమైన మరేదైనా విద్యా అర్హత ఉన్నా సరిపోతుంది. ప్రస్తుతం డిగ్రీ చివరి సంవత్సరం లేదా చివరి సెమిస్టర్ చదువుతున్న అభ్యర్థులు కూడా తాత్కాలికంగా దరఖాస్తు చేసుకోవడానికి ఎస్బీఐ అవకాశం కల్పించింది. అయితే, వీరు ఇంటర్వ్యూకి ఎంపికైతే గనుక.. సెప్టెంబర్ 30, 2026 తేదీన లేదా అంతకంటే ముందే డిగ్రీ పాసైనట్లు తగిన ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది.

ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ (ఐడీడీ) కోర్సులు చేసిన అభ్యర్థులు కూడా సెప్టెంబర్ 30, 2026 నాటికి కోర్సు పూర్తి చేసినట్లు సర్టిఫికేట్ కలిగి ఉండాలి. వీటితో పాటు మెడికల్, ఇంజినీరింగ్, చార్టర్డ్ అకౌంటెంట్, కాస్ట్ అకౌంటెంట్ వంటి వృత్తిపరమైన కోర్సులు చేసిన వారు కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి పూర్తిగా అర్హులు.

ఎస్బీఐ పీఓ రిక్రూట్​మెంట్​ 2026- వయోపరిమితి..

ఏప్రిల్ 1, 2026 నాటికి అభ్యర్థుల వయస్సు 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. అంటే, అభ్యర్థులు 02.04.1996 కంటే ముందుగాని, 01.04.2005 తర్వాత గాని జన్మించి ఉండకూడదు (ఈ రెండు తేదీలు కూడా వర్తిస్తాయి).

ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.

ఎస్బీఐ పీఓ రిక్రూట్​మెంట్​ 2026- ఎంపిక విధానం..

ఎస్బీఐ పీఓ పోస్టుల ఎంపిక ప్రక్రియ మొత్తం మూడు దశల్లో సాగుతుంది. మొదటి దశలో ప్రిలిమినరీ పరీక్ష, రెండో దశలో మెయిన్స్ పరీక్ష, మూడో దశలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

ప్రిలిమినరీ పరీక్ష: ఈ పరీక్షలో మొత్తం 100 మార్కులకు గాను 100 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష రాయడానికి ఒక గంట సమయం ఇస్తారు. ప్రిలిమ్స్ పరీక్షలో సెక్షనల్ కటాఫ్ మార్కులు ఏవీ ఉండవు. అభ్యర్థులు సాధించిన మొత్తం మార్కుల ఆధారంగా కేటగిరీల వారీగా మెరిట్ జాబితాను రూపొందిస్తారు. ప్రతి కేటగిరీలోని ఖాళీలకు దాదాపు 10 రెట్లు ఉన్న అభ్యర్థులను మెరిట్ లిస్ట్ ఆధారంగా తదుపరి దశ అయిన మెయిన్స్ పరీక్షకు ఎంపిక చేస్తారు.

నెగెటివ్ మార్కింగ్: అభ్యర్థులు పరీక్ష రాసేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఎస్బీఐ పీఓ రిక్రూట్​మెంట్​ 2026 ఆబ్జెక్టివ్ పరీక్షల్లో తప్పు సమాధానాలకు నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కులలో 1/4 వంతు (0.25) మార్కును పెనాల్టీగా కట్ చేస్తారు. అయితే, ఏదైనా ప్రశ్నకు సమాధానం రాయకుండా ఖాళీగా వదిలేస్తే ఎలాంటి నెగెటివ్ మార్కులు ఉండవు.

ఎస్బీఐ పీఓ రిక్రూట్​మెంట్​ 2026- దరఖాస్తు రుసుము..

జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు రుసుము కింద రూ. 750 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు, వారు ఉచితంగానే అప్లై చేసుకోవచ్చు. ఒక్కసారి ఫీజు చెల్లించిన తర్వాత ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆ సొమ్మును తిరిగి రీఫండ్ చేయరని, లేదా ఇతర పరీక్షలకు బదిలీ చేయరని బ్యాంక్ స్పష్టం చేసింది.

ఎస్బీఐ పీఓ రిక్రూట్​మెంట్​ 2026- ఇలా రిజిస్టర్ చేసుకోండి..

  • మొదటగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ sbi.bank.in ను సందర్శించండి.
  • హోంపేజీలో కనిపించే 'Careers' లేదా 'Current Openings' లింక్‌పై క్లిక్ చేయాలి.
  • అక్కడ ‘Recruitment of Probationary Officers’ కింద ఉన్న 'Apply Online' లింక్‌ను ఎంచుకోండి.
  • కొత్త పేజీ ఓపెన్ అయిన తర్వాత మీ వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకుని, అప్లికేషన్ ఫారమ్‌ను పూర్తిగా నింపండి.
  • మీ కేటగిరీని బట్టి నిర్ణీత దరఖాస్తు రుసుమును ఆన్‌లైన్ ద్వారా చెల్లించండి.
  • వివరాలన్నీ సరిచూసుకున్న తర్వాత 'Submit' బటన్‌పై క్లిక్ చేస్తే మీ దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది.
  • భవిష్యత్తు అవసరాల కోసం సబ్మిట్ చేసిన అప్లికేషన్ పేజీని డౌన్‌లోడ్ చేసుకుని, ఒక హార్డ్ కాపీ (ప్రింటవుట్) దగ్గర ఉంచుకోండి.

ఈ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు, సిలబస్, నిబంధనల కోసం అభ్యర్థులు ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి అధికారిక నోటిఫికేషన్‌ను పరిశీలించవచ్చు.

ఎస్బీఐ పీఓ రిక్రూట్​మెంట్​ 2026 నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఎస్బీఐ పీఓ రిక్రూట్​మెంట్​ 2026 రిజిస్ట్రేషన్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More