జంతర్ మంతర్ ధర్నా ప్రదేశం రద్దుపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు

ఢిల్లీలోని జంతర్ మంతర్‌ను నిరసన ప్రదేశాల జాబితా నుంచి తొలగించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వం ఇచ్చే సమాధానం సంతృప్తికరంగా లేకపోతే చట్టప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని ధర్మాసనం స్పష్టం చేసింది.

Published on: Oct 15, 2026, 13:22:20 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

దేశ రాజధాని ఢిల్లీలో దశాబ్దాలుగా నిరసనలకు, ధర్నాలకూ వేదికగా నిలుస్తున్న జంతర్ మంతర్‌ను నోటిఫైడ్ నిరసన ప్రదేశాల జాబితా నుంచి ఇటీవల డి-నోటిఫై (రద్దు) చేశారు. దీనిని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను గురువారం సుప్రీంకోర్టు విచారించింది. దీనిపై స్పందించాలని ఆదేశిస్తూ కేంద్ర ప్రభుత్వానికి అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.

జంతర్ మంతర్ ధర్నా ప్రదేశం రద్దుపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు (Hindustan Times)
జంతర్ మంతర్ ధర్నా ప్రదేశం రద్దుపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు (Hindustan Times)

భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జైమాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ చేపట్టింది. ఓటర్ల తొలగింపు ఆరోపణలు, నిరసనకారులు, లాయర్లు, విలేకరులపై పోలీసుల చర్యలు, ప్రజల రాకపోకలపై ఆంక్షలకు సంబంధించి దాఖలైన పలు పిటిషన్లతో కలిపి దీనిని విచారించారు.

కేంద్రం ఇచ్చే వివరణ ఆధారంగా నిర్ణయం

విచారణ సందర్భంగా జస్టిస్ జైమాల్య బాగ్చీ వ్యాఖ్యానిస్తూ.. "మేము కేంద్రానికి నోటీసులు జారీ చేస్తున్నాం. ప్రభుత్వం నుంచి వివరణ కోరుతున్నాం. వారి ఇచ్చే సమాధానం సంతృప్తికరంగా లేకపోతే, చట్టం తన పని తాను చేసుకుపోతుంది" అని పేర్కొన్నారు.

అలాగే సీజేఐ జస్టిస్ సూర్య కాంత్ స్పందిస్తూ.. "ఈ అంశంపై మేము క్షుణ్ణంగా హోమ్‌వర్క్ చేసి వచ్చాం. దీనిపై సమగ్ర విచారణ అవసరమని భావిస్తున్నాం. అందుకే కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు ఇస్తున్నాం" అని తెలిపారు.

నేపథ్యం ఇదీ

అంతకుముందు సోమవారం నాడు, జంతర్ మంతర్‌ను అధికారిక నిరసన వేదికల జాబితా నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దానికి ప్రత్యామ్నాయంగా ఢిల్లీ నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో మూడు కొత్త ప్రదేశాలను ధర్నాల కోసం కేటాయించారు.

అయితే, ఈ నెల ప్రారంభంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకే జంతర్ మంతర్‌ను ధర్నా వేదికగా రద్దు చేశామని ఢిల్లీ పోలీసులు మంగళవారం ఢిల్లీ హైకోర్టుకు తెలిపారు. దశాబ్దాలుగా జంతర్ మంతర్ వద్దే ధర్నాలు నిర్వహించే ఆచారాన్ని పునఃపరిశీలించాలని అక్టోబర్ 9న సుప్రీంకోర్టు అధికారులకు సూచించిన సంగతి తెలిసిందే. ప్రశాంతంగా నిరసనలు తెలిపే ప్రజల కోసం మెరుగైన సౌకర్యాలు ఉన్న ప్రత్యామ్నాయ ప్రదేశాన్ని కేటాయించాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్, సంబంధిత అధికారులకు కోర్టు సూచించింది.

ఈ నేపథ్యంలోనే జంతర్ మంతర్‌ను రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను స్వీకరించిన సుప్రీంకోర్టు, కేంద్రం ఇచ్చే సమాధానంపైనే తదుపరి చర్యలు ఉంటాయని తేల్చిచెప్పింది.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More