ఫారం-6 నిర్బంధంపై ఈసీకి సుప్రీంకోర్టు షాక్.. 'ఓటర్ల వద్దకే వెళ్లండి'
ఢిల్లీ ఓటర్ల జాబితా ప్రత్యేక పరిశీలన (ఎస్ఐఆర్) ప్రక్రియలో ఫారం-6 దాఖలు చేయాలని నిర్బంధించడంపై సుప్రీంకోర్టు ఈసీని నిలదీసింది. నివాసం మారిన పాత ఓటర్లను కొత్త ఓటర్లుగా పరిగణించవద్దని, అధికారులే నేరుగా ఓటర్లను సంప్రదించి వివరాలు నమోదు చేసుకోవాలని స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ: ఢిల్లీలో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర పరిశీలన (ఎస్ఐఆర్) ప్రక్రియలో లక్షలాది మంది ఓటర్ల పేర్ల తొలగింపు, కొత్తగా 'ఫారం-6' దాఖలు చేయాలనే ఎన్నికల సంఘం (ఈసీఐ) నిబంధనపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. నివాసం మారినంత మాత్రాన లేదా కొన్ని నెలలు పనిమీద ఇతర ప్రాంతాలకు వెళ్లినంత మాత్రాన వారిని జాబితా నుంచి తొలగించి, కొత్త ఓటర్లుగా పరిగణిస్తూ ఫారం-6 కోరడం సరికాదని తేల్చిచెప్పింది. 2026 ఓటర్ల జాబితాలో ఇప్పటికే పేర్లున్న వారు కేవలం 'ఫారం-8' ద్వారా లేదా ఎన్యూమరేషన్ ప్రక్రియ ద్వారా తమ చిరునామాలను సవరించుకునే వెసులుబాటు కల్పించాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

ఓటు హక్కు అత్యంత కీలకం.. భారమంతా ఓటర్లపైనే వేస్తారా?
భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జైమాల్య బాగ్చీ, జస్టిస్ వి.మోహనలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉపాధి కోసం తరచూ ఇళ్లు, ప్రాంతాలు మారే వలస జనాభా ఢిల్లీలో ఎక్కువగా ఉంటారని ధర్మాసనం గుర్తుచేసింది.
"ఓటర్లే అధికారుల వద్దకు రావాలని భారం మోపే బదులు, మీరే ఎందుకు వారి వద్దకు వెళ్లకూడదు?" అని ఈసీ తరఫున హాజరైన సీనియర్ అడ్వొకేట్ డి.ఎస్.నాయుడును ధర్మాసనం ప్రశ్నించింది.
"ఓటు వేసే హక్కు పౌరులకు అత్యంత కీలకమైన హక్కు. కేవలం ఎన్యూమరేషన్ ఫారం అందలేదనో, పాత చిరునామాలో అందుబాటులో లేరనో ఓటర్లు శాశ్వతంగా ఆ హక్కును కోల్పోయేలా చేయకూడదు. ఒకటి రెండు నెలలు పనిమీద బయటకు వెళ్లినంత మాత్రాన వారు శాశ్వతంగా నివాసం మారినట్లు కాదు" అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పారదర్శకత కార్యకర్తలు అంజలీ భరద్వాజ్, అమృతా జోహ్రీలు దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం ఈ విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు.
గడువు ముగింపుపై ఈసీకి స్పష్టత.. కటాఫ్ తేదీ వద్దని ఆదేశం
దరఖాస్తుల స్వీకరణకు అక్టోబర్ 30తో ముగుస్తున్న గడువును ఇప్పుడే ఆఖరి కటాఫ్ తేదీగా భావించవద్దని ఈసీని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రస్తుతం ఢిల్లీలో తక్షణమే ఎన్నికలేవీ లేవు కాబట్టి, సవరణ దరఖాస్తులను స్వీకరిస్తూనే ఆధారాల పరిశీలన కొనసాగించాలని సూచించింది.
ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభంలో ఢిల్లీలో దాదాపు 1.45 కోట్ల మంది ఓటర్లు ఉండగా, వారిలో 97 లక్షల మంది మాత్రమే ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించారు. మిగిలిన 47 లక్షల మందిలో:
• 2.8 లక్షల మంది మరణించినట్లు,
• 1.4 లక్షల మంది డూప్లికేట్ ఓటర్లుగా,
• 43 లక్షల మంది శాశ్వతంగా నివాసం మారినట్లు లేదా జాడ లేనట్లు రికార్డుల్లో పేర్కొన్నారు.
ఇలా నివాసం మారారని భావిస్తున్న 43 లక్షల మందికి సంబంధించిన వివరాలను బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్ఓ) వద్ద అందుబాటులో ఉంచాలని కోర్టు ఆదేశించింది. ఫారమ్-6 కేవలం కొత్త ఓటర్ నమోదు కోసమేనని, పాత ఓటర్లు ఫారం-8 ఉపయోగించవచ్చని స్పష్టం చేస్తూ సరళమైన భాషలో ప్రజా ప్రకటన విడుదల చేయాలని ఆదేశించింది. కాగా, పొడిగించిన షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 4న తుది ఓటర్ల జాబితా విడుదల కానుంది.
'లాజికల్ డిస్క్రిపెన్సీ'పై తీవ్ర అభ్యంతరం
ఓటర్ల జాబితా పరిశీలనలో ఈసీ ఉపయోగిస్తున్న 'లాజికల్ డిస్క్రిపెన్సీ' (తార్కిక వ్యత్యాసాలు) వర్గీకరణ చట్టబద్ధతను తాము ఇంకా ఖరారు చేయలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీలో దాదాపు 19.34 లక్షల మంది ఓటర్లను ఈ కేటగిరీ కింద వేరు చేసి నోటీసులు ఇవ్వడంపై కోర్టు సందేహాలు వ్యక్తం చేసింది.
ఈ వర్గీకరణలో అధికారుల ప్రాథమిక పరిశీలన ఉందా? లేక కేవలం కంప్యూటర్ అల్గారిథమ్‌ల ఆధారంగా ఓటర్లను తొలగిస్తున్నారా? అని ధర్మాసనం ప్రశ్నించింది. గతంలో పశ్చిమ బెంగాల్లో ఈ కేటగిరీ కారణంగా 27.1 లక్షల మంది ఓటు హక్కు కోల్పోయిన విషయాన్ని ప్రస్తావించింది.
"2002-2003 నాటి ఓటర్ల జాబితాను ఇప్పుడు మళ్లీ ఎలా తిరగదోడుతారు? కంప్యూటర్ పాటర్న్ల ఆధారంగా పాత ఓటర్ల అర్హతలను ప్రశ్నించడం ఎంతవరకు సమంజసం?" అని ఈసీని కోర్టు నిలదీసింది. బిహార్ కేసులో ఇచ్చిన తీర్పు లాజికల్ డిస్క్రిపెన్సీకి వర్తించదని, దీనిపై ప్రత్యేకంగా విచారణ జరుపుతామని వెల్లడించింది.
రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం
ఈసీ తరఫు న్యాయవాది డి.ఎస్.నాయుడు స్పందిస్తూ, సుప్రీంకోర్టు సూచనలను ఎన్నికల సంఘంతో చర్చించి అమలు చేస్తామని, దరఖాస్తుల స్వీకరణ గడువును పొడిగిస్తామని కోర్టుకు తెలిపారు. రెండు దశాబ్దాల తర్వాత చేపడుతున్న ఈ భారీ పరిశీలనలో ఓటర్లను శాశ్వతంగా తొలగించే ఉద్దేశం లేదని వివరించారు. కోర్టు ఇచ్చిన సూచనల ఆధారంగా తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను రెండు వారాల పాటు వాయిదా వేసింది.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


