...
...
Next Story

స్టాక్ మార్కెట్‌లో లాభాల పంట పండాలంటే ‘సెక్టార్ రొటేషన్’తో సరైన షేర్లు ఎంచుకోండి

మార్కెట్ సైకిళ్లకు అనుగుణంగా పెట్టుబడులను ఒక రంగం నుంచి మరొక రంగానికి మళ్లించడమే సెక్టర్ రొటేషన్. ఆర్థిక వ్యవస్థలో వచ్చే మార్పులను గమనిస్తూ సరైన సమయంలో సరైన రంగాన్ని ఎంచుకోవడం ద్వారా మెరుగైన లాభాలు సాధించే వ్యూహాన్ని కోటక్ సెక్యూరిటీస్ నిపుణుడు శ్రీకాంత్ చౌహాన్ వివరించారు.

Published on: Aug 11, 2026, 14:08:36 IST
Advertisement

స్టాక్ మార్కెట్లు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఆర్థిక వ్యవస్థ పరిస్థితులను బట్టి వేర్వేరు రంగాలు (Sectors) వేర్వేరు సమయాల్లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తాయి. ఏ రంగం పుంజుకుంటోంది, ఏ రంగం క్షీణిస్తోందో గుర్తించడం పెట్టుబడిదారులకు అత్యంత కీలకమైన ఆయుధం. ఈ క్రమంలోనే 'సెక్టర్ రొటేషన్' (Sector Rotation) అనే వ్యూహం ప్రాధాన్యం సంతరించుకుంది.

అసలు ఏమిటీ ‘సెక్టర్ రొటేషన్’?

కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ హెడ్ శ్రీకాంత్ చౌహాన్
కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ హెడ్ శ్రీకాంత్ చౌహాన్

ఆర్థిక వ్యవస్థ లేదా మార్కెట్ చక్రంలో వచ్చే మార్పుల ఆధారంగా పెట్టుబడి మూలధనాన్ని ఒక రంగం నుంచి మరొక రంగానికి మళ్లించే పద్ధతినే 'సెక్టర్ రొటేషన్' అంటారు. సరళంగా చెప్పాలంటే, అన్ని రంగాలు ఒకే సమయంలో లాభాలను ఇవ్వవు.

ఆర్థిక పునరుద్ధరణ (Recovery): ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న సమయంలో ఆటోమొబైల్, క్యాపిటల్ గూడ్స్, రియల్ ఎస్టేట్ వంటి సైక్లికల్ రంగాలు మెరుగైన ప్రతిభ చూపుతాయి.

వృద్ధి దశ (Expansion): వేగవంతమైన అభివృద్ధి సమయంలో ఐటీ (టెక్నాలజీ), బ్యాంకింగ్/ఫైనాన్స్, కన్స్యూమర్ డిస్క్రిషనరీ షేర్లు ముందంజలో ఉంటాయి.

ఆర్థిక మందగమనం (Slowdown): మార్కెట్ మందగించినప్పుడు హెల్త్‌కేర్, ఎఫ్‌ఎంసీజీ (FMCG), యుటిలిటీస్ వంటి డిఫెన్సివ్ రంగాలు స్థిరత్వాన్నిస్తాయి.

ఆర్థిక మాంద్యం (Recession): మాంద్యం పరిస్థితుల్లో ఫార్మా, కన్స్యూమర్ స్టేపుల్స్ వంటి రంగాల్లో మంచి డివిడెండ్ ఇచ్చే నాణ్యమైన షేర్ల వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతారు.

ఈ మార్పులను ముందుగానే పసిగట్టడం వల్ల నష్టాలను తగ్గించుకోవడంతో పాటు, రాబడిని పెంచుకునే అవకాశం లభిస్తుంది.

సెక్టర్ రొటేషన్ ఎలా పనిచేస్తుంది?

ప్రధానంగా కొన్ని కీలక అంశాలు ఈ సెక్టర్ రొటేషన్‌ను నడిపిస్తాయి.

  • జిడిపి (GDP) వృద్ధి, వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం వంటి మాక్రో ఎకనామిక్ సూచికలు
  • మార్కెట్ సెంటిమెంట్, ఇన్వెస్టర్ల రిస్క్ తీసుకునే సామర్థ్యం
  • కార్పొరేట్ కంపెనీల త్రైమాసిక రాబడుల సైకిల్
  • ప్రభుత్వ విధానాలు, బడ్జెట్ కేటాయింపులు

ఎల్లప్పుడూ ఒకే రంగం మార్కెట్‌ను నడిపించదు. నిన్నటి విజేతలే రేపు కూడా అగ్రస్థానంలో ఉంటారని అనుకోలేం. సరైన సమయంలో సరైన రంగంలో పెట్టుబడి పెట్టడం వల్ల రిస్క్ పెరగకుండానే పోర్ట్‌ఫోలియో రాబడి పెరుగుతుంది. మార్కెట్ దిద్దుబాట్లకు గురైనప్పుడు డిఫెన్సివ్ రంగాల్లోకి మారడం నష్టాల నుంచి రక్షణ నిస్తుంది.

సెక్టర్ రొటేషన్‌ను ట్రాక్ చేయడం ఎలా?

ఈ వ్యూహాన్ని అమలు చేయడానికి పెద్ద ఫండ్ మేనేజర్ కానవసరం లేదు. సాధారణ ఇన్వెస్టర్లు కూడా సులువుగా గమనించవచ్చు.

రంగాల వారీ సూచీలు (Sectoral Indices): నిఫ్టీ ఆటో, నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ, నిఫ్టీ బ్యాంక్ వంటి సూచీల పనితీరును వివిధ కాల పరిమితుల్లో పోల్చి చూడాలి.

మాక్రో డేటా పరిశీలన: జిడిపి గణాంకాలు, ద్రవ్యోల్బణ సరళి, ఆర్‌బీఐ లేదా ఫెడ్ వడ్డీ రేట్ల అంచనాలను గమనిస్తే తదుపరి ఏ రంగానికి ఆదరణ లభిస్తుందో అర్థమవుతుంది.

ఫండ్ ఫ్లోస్ (Fund Flows): మ్యూచువల్ ఫండ్లు, విదేశీ ఇన్వెస్టర్లు ఏ రంగాల్లో కొనుగోళ్లు పెంచుతున్నారో నిశితంగా పరిశీలించాలి.

కంపెనీల ఆర్థిక ఫలితాలు: ఒక రంగం పుంజుకునే ముందు ఆయా కంపెనీల ఆదాయాలు, మార్జిన్లలో పెరుగుదల స్పష్టంగా కనిపిస్తుంది.

స్టాక్ ఎంపిక - జాగ్రత్తలు

ఒక రంగం పుంజుకుంటున్నట్లు గుర్తించాక, ముమెంటమ్ ఇన్వెస్టింగ్ ద్వారా అందులో బెస్ట్ షేర్లను ఎంచుకోవచ్చు. ప్రైస్ బ్రేక్అవుట్స్, ట్రేడింగ్ వాల్యూమ్స్ పెరుగుదల, ఇండెక్స్‌తో పోలిస్తే షేరు ప్రదర్శించే బలాన్ని (Relative Strength) ప్రామాణికంగా తీసుకోవాలి.

అయితే, ఈ వ్యూహంలో క్రమశిక్షణ, సరైన సమయం (Timing), వైవిధ్యభరితమైన పోర్ట్‌ఫోలియో (Diversification) అత్యంత అవసరం. స్వల్పకాలిక ట్రెండ్స్ చూసి తొందరపడకుండా, సుదీర్ఘకాల పరిశ్రమ వృద్ధిని దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవడం మంచిది.

వ్యాసకర్త:

శ్రీకాంత్ చౌహాన్,

హెడ్, ఈక్విటీస్ రీసెర్చ్

కోటక్ సెక్యూరిటీస్

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks