సెన్సెక్స్ 534 పాయింట్లు డౌన్.. కారణాలేంటి?
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా పడిపోగా, నిఫ్టీ కీలకమైన 26,000 మార్కు కంటే దిగువకు చేరింది. రూపాయి బలహీనపడటం, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణే ఇందుకు ప్రధాన కారణాలుగా నిపుణులు చెబుతున్నారు.
ముంబై: భారత స్టాక్ మార్కెట్‌లో మంగళవారం అమ్మకాల వెల్లువ కొనసాగింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందడంతో ఇన్వెస్టర్లు పెట్టుబడులను వెనక్కి తీసుకునేందుకు మొగ్గు చూపారు. ఫలితంగా బీఎస్‌ఈ సెన్సెక్స్ ఏకంగా 534 పాయింట్లు పతనమై 84,683 స్థాయికి పడిపోగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా 26,000 మైలురాయిని కోల్పోయి 25,871 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది.

ఈ నష్టాల ధాటికి కేవలం తొలి అరగంటలోనే ఇన్వెస్టర్ల సొమ్ము సుమారు ₹2 లక్షల కోట్లు ఆవిరైపోయింది. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు కూడా అర శాతం మేర నష్టపోయాయి.
మార్కెట్ ఎందుకు పడిపోయింది? ప్రధాన కారణాలివే:
1. రికార్డు కనిష్టానికి రూపాయి:
డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ మునుపెన్నడూ లేని విధంగా 91 మార్కును తాకింది. ఈ ఒక్కరోజే 36 పైసలు క్షీణించడం మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (FIIs) నిరంతరం పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం, దిగుమతుల భారం పెరగడం రూపాయిని బలహీనపరుస్తోంది.
2. అంతర్జాతీయ మార్కెట్ల సెగ:
జపాన్ (Nikkei), కొరియా (Kospi), హాంకాంగ్ (Hang Seng) మార్కెట్లు 2 శాతం మేర కుప్పకూలాయి. అమెరికాలో వెలువడనున్న ఉద్యోగ గణంకాలు, అక్కడ వడ్డీ రేట్లపై అనిశ్చితి ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లలో ఆందోళన రేకెత్తిస్తోంది.
3. విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ (FII Outflows):
గత జూలై నుంచి విదేశీ ఇన్వెస్టర్లు వరుసగా షేర్లను విక్రయిస్తున్నారు. ఒక్క డిసెంబర్ నెలలోనే ఇప్పటివరకు ₹21,000 కోట్లకు పైగా పెట్టుబడులను వెనక్కి తీసుకోగా, గడిచిన ఐదు నెలల్లో ఈ మొత్తం ₹1.70 లక్షల కోట్ల మార్కును దాటింది.
4. ఐపీఓల ప్రభావం (Liquidity Crunch):
ఈ ఏడాది మార్కెట్లోకి వచ్చిన భారీ ఐపీఓల (IPOs) వల్ల సెకండరీ మార్కెట్‌లో నగదు లభ్యత తగ్గింది. రిటైల్ ఇన్వెస్టర్లు కొత్త షేర్లపై మొగ్గు చూపడంతో పాత షేర్ల ట్రేడింగ్‌లో మందగమనం కనిపిస్తోంది.
5. సాంకేతిక కారణాలు:
నిఫ్టీ 26,060 పాయింట్ల వద్ద బలమైన ప్రతిరోధాన్ని (Resistance) ఎదుర్కొంటోంది. ఈ స్థాయిని అధిగమించలేకపోవడంతో విక్రయాల ఒత్తిడి పెరిగింది. ఒకవేళ 25,700 స్థాయి కంటే దిగువకు చేరితే మార్కెట్ మరింత పడిపోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

E-Paper


