స్టాక్ మార్కెట్ కుదేలు: 2 రోజుల్లో 1000 పాయింట్లు క్రాష్, 10 లక్షల కోట్లు ఆవిరి
స్టాక్ మార్కెట్లలో వరుసగా రెండో రోజూ సూచీలు పతనమయ్యాయి. కేవలం రెండు సెషన్లలో సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా కుప్పకూలింది. మంగళవారం నాటి ట్రేడింగ్‌లో ఇన్వెస్టర్లు ఏకంగా రూ. 10 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. అమెరికా-యూరప్ వాణిజ్య యుద్ధ భయాలు, బడ్జెట్ ఆందోళనల మధ్య మార్కెట్ పతనమవుతోంది.
దేశీయ స్టాక్ మార్కెట్లలో పెట్టుబడిదారుల గుండెలు దడదడలాడుతున్నాయి. సోమవారం మొదలైన అమ్మకాల ఒత్తిడి మంగళవారం (జనవరి 20) కూడా కొనసాగడంతో దలాల్ స్ట్రీట్ బేలచూపులు చూస్తోంది. గ్లోబల్ మార్కెట్ల నుంచి వస్తున్న ప్రతికూల సంకేతాలు, కంపెనీల నిరాశాజనక ఫలితాలు మార్కెట్‌ను కోలుకోలేకుండా చేస్తున్నాయి.

రెండు సెషన్లలోనే సెన్సెక్స్ 1,000 పాయింట్లకు పైగా (1 శాతానికి పైగా) పడిపోయింది. మంగళవారం ఇంట్రాడేలో సెన్సెక్స్ 650 పాయింట్లు నష్టపోయి 82,568 స్థాయికి దిగజారగా, నిఫ్టీ కీలకమైన 25,400 మార్కును కోల్పోయి 25,350 వద్ద ట్రేడ్ అయింది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు ఏకంగా 2% పైగా పతనం కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
శుక్రవారం రూ. 468 లక్షల కోట్లుగా ఉన్న బిఎస్‌ఇ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్, నేటికి రూ. 458 లక్షల కోట్లకు పడిపోయింది. అంటే కేవలం రెండ్రోజుల్లో ఇన్వెస్టర్ల సంపద రూ. 10 లక్షల కోట్లు ఆవిరైపోయింది.
మార్కెట్ పతనానికి 5 ప్రధాన కారణాలు:
స్టాక్ మార్కెట్ నిపుణుల విశ్లేషణ ప్రకారం, మార్కెట్‌ను భయపెడుతున్న ఐదు కీలక అంశాలు ఇవే:
1. వాణిజ్య యుద్ధ మేఘాలు (Trade War Fears):
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్ ల్యాండ్ కొనుగోలు వ్యవహారంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. దీనిని వ్యతిరేకిస్తున్న ఎనిమిది ఐరోపా దేశాలపై సుంకాలు (Tariffs) విధిస్తామని ఆయన హెచ్చరించడం మార్కెట్లలో అలజడి రేపింది. బదులుగా, ఫిబ్రవరి 1 నుంచి అమెరికా వస్తువులపై 108 బిలియన్ డాలర్ల మేర సుంకాలు విధించే యోచనలో ఐరోపా సమాఖ్య (EU) ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ అనిశ్చితి తగ్గే వరకు మార్కెట్లో ఒడిదుడుకులు తప్పవని జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ వ్యూహకర్త వి.కె. విజయకుమార్ అభిప్రాయపడ్డారు.
2. త్రైమాసిక ఫలితాల్లో నిరాశ:
క్యూ3 (Q3) ఫలితాలు ఇప్పటివరకు అంతంతమాత్రంగానే ఉన్నాయి. కొత్త లేబర్ కోడ్ల ప్రభావం కంపెనీల లాభాలపై పడింది. ఆటో రంగం మినహా మిగిలిన రంగాల నుంచి సానుకూల ఫలితాలు రాకపోవడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.
3. ఆగని విదేశీ అమ్మకాలు (FII Selling):
విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIs) భారత మార్కెట్ నుంచి నిధులను వెనక్కి తీసుకుంటున్నారు. జనవరిలో ఇప్పటివరకు వీరు ఏకంగా రూ. 29,000 కోట్ల విలువైన షేర్లను అమ్మేశారు. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంలో జాప్యం, రూపాయి బలహీనత ఇందుకు ప్రధాన కారణాలు.
4. బంగారం వైపు పరుగులు (Safe-Haven Assets):
మార్కెట్లో రిస్క్ పెరగడంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను షేర్ల నుంచి సురక్షితమైన బంగారం, వెండి వైపు మళ్లిస్తున్నారు. పసిడి ధరలు రికార్డు స్థాయికి చేరడంతో, ఈక్విటీల్లో లాభాల స్వీకరణ చేసి లోహాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు.
5. బడ్జెట్ 2026 టెన్షన్:
ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ రాబోతోంది. ప్రభుత్వం వృద్ధికి పెద్దపీట వేస్తుందా లేక ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఖర్చులను తగ్గిస్తుందా అనే సందేహాలు ఇన్వెస్టర్లలో ఉన్నాయి. ఈ ఆందోళన కూడా మార్కెట్ పతనానికి ఒక కారణం.
(గమనిక: ఈ వార్తా కథనం కేవలం సమాచారం కోసం మాత్రమే. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్‌తో కూడుకున్నవి.)
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


