మార్కెట్లలో కాసుల వర్షం: సెన్సెక్స్ 1,695 పాయింట్లు జంప్

అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు భారీగా తగ్గడం, అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం కుదిరే అవకాశాలు ఉండటంతో దలాల్ స్ట్రీట్‌లో ఇన్వెస్టర్లు కొనుగోళ్ల పండగ చేసుకున్నారు. ఫలితంగా ఒకే రోజులో ఇన్వెస్టర్ల సంపద ఏకంగా రూ. 9.7 లక్షల కోట్లు పెరిగింది.

Updated on: Jun 12, 2026, 15:46:42 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారత స్టాక్ మార్కెట్లలో శుక్రవారం (జూన్ 12) రికార్డు స్థాయి ర్యాలీ నమోదైంది. అంతర్జాతీయంగా వెలువడిన సానుకూల పవనాలతో దలాల్ స్ట్రీట్ వన్‌వే ర్యాలీతో దూసుకెళ్లింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ ఏకంగా 1,695.40 పాయింట్లు (2.30 శాతం) లాభపడి 75,527.95 వద్ద ముగిసింది. అటు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ 50 కూడా 461.30 పాయింట్లు (1.99 శాతం) పుంజుకుని 23,622.90 వద్ద స్థిరపడింది.

మార్కెట్లలో కాసుల వర్షం: సెన్సెక్స్ 1,695 పాయింట్లు జంప్
మార్కెట్లలో కాసుల వర్షం: సెన్సెక్స్ 1,695 పాయింట్లు జంప్

మార్కెట్ దూకుడుకు కారణాలివే..

అమెరికా-ఇరాన్ మధ్య వచ్చే వారమే శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉందన్న వార్తలు మార్కెట్లలో సరికొత్త జోష్ నింపాయి. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు (క్రూడ్ ఆయిల్) ధరలు ఒక్కసారిగా 5 శాతం మేర పతనమయ్యాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 90 డాలర్ల దిగువకు పడిపోవడంతో, చమురు దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే భారత్‌కు ద్రవ్యోల్బణ భయాలు తగ్గాయి. ఐటీ రంగాన్ని మినహాయిస్తే, మిగిలిన అన్ని రంగాల షేర్లలోనూ భారీగా కొనుగోళ్లు జరిగాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత తెస్తున్న మార్పుల వల్ల ఐటీ షేర్లు మాత్రం ఒత్తిడిని ఎదుర్కొని నష్టాల్లో ముగిశాయి.

ట్రంప్ సానుకూల వ్యాఖ్యలు.. ఇరాన్ స్పందన

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం విలేకరులతో మాట్లాడుతూ ఇరుదేశాల ప్రతినిధులు ఒక అద్భుతమైన పరిష్కారానికి వచ్చారని ప్రకటించారు.

"పత్రాల తుది రూపకల్పన మాత్రమే మిగిలి ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. ఒప్పందంపై సంతకాలు కాగానే హార్ముజ్ జలసంధిని (Strait of Hormuz) తిరిగి తెరుస్తాం" అని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.

మరోవైపు, అమెరికాతో వివాదానికి ముగింపు పలికే అంశంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఇరాన్ స్పష్టం చేసింది. అయితే, వచ్చే వారం జరగనున్న ఎఫ్7 (F7) సమావేశం సందర్భంగా ఇరు దేశాలు శాంతి ఒప్పందంపై సంతకాలు చేసే అవకాశం ఉందని బ్లూమ్‌బర్గ్ నివేదిక వెల్లడించింది.

ఇన్వెస్టర్ల సొమ్ము రూ. 9.7 లక్షల కోట్లు అప్

ఈ భారీ ర్యాలీతో బీఎస్‌ఈ (BSE) లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ (M-Cap) రికార్డు స్థాయికి చేరింది. గత ట్రేడింగ్ ముగిసే సమయానికి రూ. 452.33 లక్షల కోట్లుగా ఉన్న మార్కెట్ క్యాప్, శుక్రవారం నాటి కొనుగోళ్ల హోరుతో ఏకంగా రూ. 462.05 లక్షల కోట్లకు పెరిగింది. ఫలితంగా కేవలం ఒక్క రోజులోనే ఇన్వెస్టర్ల సంపదకు రూ. 9.71 లక్షల కోట్లు అదనంగా చేరింది.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More